Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

రోహిణీ మంటలు

. మొదటి రోజే నిప్పులు చెరిగిన సూరీడు
. సాయంత్రానికి చల్లబడ్డ వాతావరణం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. రోహిణీ కార్తె ప్రారంభమైన తొలి రోజే తన సత్తా చాటింది. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత ప్రారంభమైంది. క్రమేపీ పెరుగుతూ 11 గంటల నుంచి 3 గంటలవరకు సూరీడు నిప్పులు చెరిగాడు. ఎండకు తోడు వడగాడ్పులు, ఉబ్బ కూడా తోడవ్వడంతో ప్రజలు అల్లాడిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ 44 డిగ్రీల ఉష్ణోగ్రత పైగా నమోదైంది. నిత్యం రద్దీగా ఉండే ముఖ్య నగరాల్లోనూ రహదారులు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. మధ్యాహ్న సమయంలో అన్ని రకాల వ్యాపార సంస్థలు వినియోగదారుల్లేక వెలవెలబోయాయి. పాదచారులు, ద్విచక్ర వాహనదారుల అవస్థలు వర్ణనాతీతం. చివరకు కార్లు ఉన్న వాహన యజమానులు సైతం ఎండ తీవ్రతకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తిరగడానికి భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. వారం క్రితం ఎండ తీవ్రతకు కార్లు, మోటారు వాహనాలు అక్కడక్కడా దగ్ధమయ్యాయి. విజయవాడ కృష్ణలంకలో సెల్‌టవర్‌ కూడా ఎండ తీవ్రతకు తగులబడిరది. గురువారం నాటి ఎండ మళ్లీ ఆ స్థాయిలో ప్రజలను భయపెట్టింది. రోహిణీ కార్తె మొదటిరోజే ఎండ తీవ్రత ఈ స్థాయిలో ఉందంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఎండకు తల్లడిల్లిపోతున్నారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. శీతల పానీయాలకు మాత్రం డిమాండ్‌ ఏర్పడిరది. అయితే కొబ్బరిబోండాల్లో నీరు కూడా వేడెక్కడంతో తాగలేక జనం ఇబ్బందిపడ్డారు. చెరకురసం, కూల్‌డ్రిరక్స్‌, ఐస్‌క్రీమ్స్‌, జ్యూస్‌ దుకాణాలు కళకళలాడాయి. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు పాదచారుల దాహార్తి తీర్చాయి. అయితే విచిత్రంగా సాయంత్రం 4 గంటలకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు పూర్తిగా కమ్ముకొచ్చాయి. భారీ వర్షం, గాలి దుమ్ము వస్తుందని ప్రజలు భయపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడి… వాతావరణంలో వేడి ఒక్కసారిగా తగ్గడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img