Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

అమరావతే ఏపీ రాజధాని

పోలవరం నిర్మాణం పూర్తికి సహకరిస్తాం
బీజేపీ కోర్‌ కమిటీ సమావేశాల్లో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌
ప్రాంతీయ పార్టీలతో పొత్తులుంటాయని సంకేతాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి / విశాఖపట్నం / ఏలూరు: ఏపీ రాజధాని అమరావతేనని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ నగరాల్లో నిర్వహించిన బీజేపీ సమావేశాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విజయవాడ నగరంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీమంత్రి సుజనాచౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. రాజధాని అంశంపై ఓ నాయకుడు అడిగిన ప్రశ్నకు రాజ్‌నాథ్‌ స్పందిస్తూ ఏపీ రాజధాని అమరావతేనని, ఈ విషయంలో ఎటువంటి చర్చ లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీకి కూడా దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన సమాచారం ఇచ్చిందని గుర్తుచేశారు. ఏపీలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. బీజేపీ మూడోసారి దేశంలో అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారు దౌర్జన్యాలపై పోరాటం చేసి నిలువరించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రం నుంచి సాగించే ఉద్యమాలు, ఆందోళనల ద్వారా ప్రజల్లోకి పార్టీ బలంగా వెళుతుందని కర్తవ్యబోధ చేశారు. ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో జయహో బీజేపీ, కేంద్రంలో మూడోసారి అనే నినాదంతో ఏలూరు, అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ లోక్‌సభ నియోజకవర్గాల బూత్‌ స్థాయి కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు. ఇక్కడ రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశం లేదన్నారు. కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తున్నా అభివృద్ధి కోసం ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం లిక్కర్‌, ఇసుక మాఫియాలకు అండగా ఉంటుందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో భారత్‌ రైజింగ్‌ ఎలైట్‌ పేరిట నిర్వహించిన మేధావుల సదస్సులో రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ 2027నాటికి ప్రపంచ దేశాల్లోనే భారత్‌ మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు. భాష, ప్రాంతీయవాదం పేరుతో దేశ సమగ్రతకు నష్టం కలిగించే చర్యలు అడ్డుకోవాలని, ఉత్తర, దక్షిణ భారతదేశాల పేరుతో విభజన కోసం రాజకీయ కుట్రలు చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో పురందేశ్వరి, జీవీఎల్‌ నర్సింహారావు, సీఎం రమేశ్‌, విష్ణుకుమార్‌రాజు, పీవీఎన్‌ మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img