Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసు జారీ..

మహిళలు, యువతులపై లైంగిక దౌర్జన్యాలు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ‌పై బ్లూ కార్నర్‌ నోటీసు జారీ అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌) అభ్యర్థనతో బ్లూకార్నర్ నోటీసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) జారీచేసింది. మొత్తం 196 దేశాలతో పాటు ఇంటర్‌పోల్‌కు సమాచారాన్ని ఇచ్చినట్టయ్యింది. ప్రజ్వల్‌ రేవణ్ణ ఏ దేశంలోని విమానాశ్రయాలు, ఓడరేవుల్లో కనిపించినా సమాచారం ఇవ్వాలని ఇంటర్‌పోల్‌ను కోరినట్టు పేర్కొంది. మరోవైపు, బ్లూ కార్నర్ నోటీసుకు ఇంటర్‌పోల్ స్పందించింది. 196 దేశాలకు ఈ సమాచారాన్ని అందించినట్లు ఇంటర్‌పోల్ బదులిచ్చింది. నేర విచారణకు సంబంధించి.. దాంతో సంబంధం ఉన్న వ్యక్తి గుర్తింపు, అతడి నేర కార్యకలాపాల గురించి అదనపు సమాచారాన్ని సేకరించడానికి్ణ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేస్తారు. నిందితుడు ఆచూకీ, సమాచారం కోసం బ్లూ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ ద్వారా అన్ని దేశాలకు పంపాం.. ఇది కచ్చితంగా జరిగింది.. అన్నీ బహిర్గతం చేయలేం అని కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర వెల్లడించారు. సెక్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే జర్మనీకి పారిపోయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 26న దుబాయ్ మీదుగా ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్లిపోయినట్టు గుర్తించారు. అతడిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయినా.. ఇప్పటి వరకూ తిరిగి రాలేదు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలు మంగళవారంతో ముగిసినందున ప్రజ్వల్ రేవణ్ణ తిరిగి వచ్చే అకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఏప్రిల్ 28న ప్రజ్వల్ రేవణ్ణపై మొదటి కేసు నమోదుకాగా.. మే 1న మరో మహిళ అతడిపై ఫిర్యాదు చేసింది. అలాగే, మే 7న కూడా మూడో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. అటు, ప్రజ్వల్‌ లైంగిక దౌర్జన్యం బాధితురాలి కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన ఆయన తండ్రి, జేడీఎస్‌ ఎమ్మెల్యే రేవణ్ణ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఆయన మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ట్రిక్‌తో పాటు హెర్నియా సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స అనంతరం సాధారణ స్థితికి చేరుకోవడంతో తిరిగి సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు.

మరోవైపు ప్రజ్వల్‌ వీడియోలను 25 వేలకుపైగా పెన్‌డ్రైవ్‌లలో ఉంచి ఎన్నికల ముందు పంపిణీ చేశారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు.ఆ పెన్‌డ్రైవ్‌లను పోలీసు అధికారులే పంపిణీ చేశారని, వారిని బెదిరించి అలా చేయించారని కుమారస్వామి విమర్శించారు. ఈ కుట్ర వెనుక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఉన్నారని ఆక్షేపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img