ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరవుతారని వెల్లడి
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా పేర్కొన్నారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమే అయినా విచారణకు తాను సిద్ధమేనని పేర్కొన్నారు. అయితే, మార్చ్ 12 తరువాత విచారణ తేదీని ఖరారు చేయాలని సూచించారు.మద్యం పాలసీలో అవకతవకలకు సంబంధించి ఈడీ ఇప్పటివరకూ ఎనిమిది సార్లు కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరవ్వాలని కోరింది. కానీ, ఈ నోటీసులు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమైనవి అంటూ కేజ్రీవాల్ విచారణకు హాజరయ్యేందుకు నిరాకరిస్తూ వస్తున్నారు. ఈడీ తాజాగా ఫిబ్రవరి 27న మళ్లీ నోటీసులు జారీ చేసింది. మార్చి 4న తమముందు హాజరు రావాలని పేర్కొంది. దీనిపై స్పందించిన ఆప్ మార్చి 12 తరువాత కేజ్రీవాల్ విచారణకు వస్తారని తెలిపింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు హాజరవుతారని చెప్పింది. అయితే, వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఈడీ పట్టుబడుతోంది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు నిబంధనలు అనుమతించవని చెబుతోంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. లంచాలు చేతులుమారడం, మద్యం పాలసీలో తప్పులు తదితర అంశాలపై కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇద్దరు ఆప్ సీనియర్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను గతేడాది ఫిబ్రవరిలో సీబీఐ అరెస్టు చేయగా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఈడీ అక్టోబర్‌లో అరెస్టు చేసింది.