స్మార్ట్ఫోన్ మార్కెట్లో యాపిల్ గుత్తాధిపత్యంపై అమెరికా కన్నెర్ర జేసింది. పోటీని నిరోధించి, వినియోగదారులపై విపరీతమైన భారం మోపుతూ ఐఫోన్ చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తోందని పేర్కొంటూ యాపిల్ సంస్థపై అమెరికా న్యాయ శాఖ గురువారం దావా వేసింది. అమెరికాలోని పలు రాష్ట్రల్లో వినియోగదారులకు చౌకైన స్మార్ట్ఫోన్లు, పరికరాలకు అందకుండా చేయడం ద్వారా వందల బిలియన్ల డాలర్లను దోచుకుందని ఆరోపించింది. 1976లో స్టీవ్ జాబ్స్ స్థాపించిన యాపిల్.. దాదాపు అర్ధ శతాబ్దం పాటు అమెరికా సర్కారు పరిశీలనకు దొరక్కుండా తప్పించుకుంది. ఇప్పటికే వ్యాజ్యాలను ఎదుర్కొంటున్న అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా జాబితాలో యాపిల్ చేరింది. అమెరికా వ్యాజ్యం దాఖలు చేసిందనే వార్తలతో గురువారం వాల్ స్ట్రీట్లో యాపిల్ షేర్లు 3.75 శాతం వరకు నష్టపోయాయి. పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఆకర్షించాలనే ఉద్దేశంతో అపారదర్శకంగా వ్యవహరించిందని దావాలో ఆరోపించింది.