వారంతా రూ.500 గ్యాస్ సిలిండర్‌కి అర్హులే..
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కొటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా, రూ.500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం (ఫిబ్రవరి 27న) ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలో మహిలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. మహిళల ఆరోగ్యం కాపాడుతూ, పొగబారి నుంచి వారికి విముక్తి కల్పించడం మహాలక్ష్మీ పథకం ముఖ్య ఉద్దేశ్యమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారంౌ ప్రజా పాలన దరఖాస్తు చేసుకుని ఉన్నవాళ్లు అర్హులవుతారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవాళ్లకి గ్యాస్ సిలిండర్ రాయితీ పథకం వర్తిస్తుందని తెలిపింది. గడిచిన మూడేళ్లుగా గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోనుంది సబ్సిడీని ప్రభుత్వం ప్రతినెలా ఆయా కంపెనీలకు చెల్లింపులు చేస్తుంది. ముందుగా మొత్తం నగదును లబ్దిదారులను చెల్లిస్తే 48 గంటల్లో దానిని బ్యాంకు ఖాతాకు జమచేస్తామని తెలిపింది. భవిష్యత్తులో ముందుగానే నగదును గ్యాస్ కంపెనీలకు చెల్లిస్తామని పేర్కొంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, రూ.500లకు గ్యాస్ సిలిండర్, నెలకు రూ.2,500 నగదు అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని పట్టాలెక్కిస్తోంది. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రెండో రోజునే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఉచిత విద్యుత్, రాయితీపై గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సెక్రటేరియట్ లోనే రెండు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకాలను మధ్యాహ్నం సీఎం రేవంత్, మంత్రులు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్ నగర్‌లో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్నందున దాని కూడా కోడ్ వర్తించనుంది. మధ్యాహ్నం చేవెళ్లలో రాజకీయ సభ నిర్వహించే అవకాశం ఉంది.