Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

వలంటీర్‌ వ్యవస్థకొనసాగిస్తా

. వైసీపీకి పనిచేయొద్దు
. టీడీపీ, జనసేనతోనే అభివృద్ధి
. పెనుకొండ సభలో చంద్రబాబు

విశాలాంధ్ర – పెనుకొండ : టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీరు వ్యవస్థను తొలగించబోమని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిందా? తాను ఐటీ ఉద్యోగాలు ఇస్తే జగన్‌ వలంటీర్‌ ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వలంటీర్‌ వ్యవస్థ ఉంటుందన్నారు. ఎవరి ఉద్యోగం తీసేయబోమని, వలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తాను న్యాయం చేస్తానని చెప్పారు. వైసీపీ కోసం పనిచేయవద్దని వలంటీర్లకు చంద్రబాబు విన్నవించారు. అవినీతి కావాలా… అభివృద్ధి కావాలో తేల్చుకోవాల్సింది ప్రజలేనని చంద్రబాబు పిలుపునిచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండల పరిధిలోని కియా పరిశ్రమ ఎదుట సోమవారం జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబు ప్రసంగించారు. సభకు హిందూపురం పార్లమెంట్‌ పరిధిలోని ఆరు నియోజకవర్గాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామా చంద్రబాబు… అభివృద్ధికి బాటలు వేసింది తెలుగుదేశం పార్టీ… అన్యాయానికి, అక్రమాలకు తెరలేపింది వైసీపీ అని విమర్శించారు. అనంత జిల్లాను కరువు నుంచి కాపాడిరది తానేనని చెప్పుకొచ్చారు. అనంతపురం జిల్లాకు గొల్లపల్లి రిజర్వాయర్‌, చెర్లోపల్లి రిజర్వాయర్‌, బీటీ ప్రాజెక్టుకు నీటి సరఫరా చేసి మడకశిర ఎగువ ప్రాంతానికి నీటిని అందించానన్నారు. వీటివలన పరిశ్రమలు వచ్చి కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంలో తెలుగుదేశం పార్టీ ముందుందని తెలిపారు. కియా పరిశ్రమ కోసం 600 ఎకరాల భూమి సేకరించి 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించామన్నారు. ఇదే జిల్లాలో వైసీపీ నాయకులు లేపాక్షి నాలెడ్జ్‌కి 1200 ఎకరాలు కేటాయించినా ఒక్కరికీ ఉపాధి కల్పించలేదని మండిపడ్డారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలను జిల్లాకు రప్పించానన్నారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి చిరునామాగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి, అక్రమాలకు తెరలేపారని, తన చోటామోటా నాయకులతో భూకబ్జాలు, ఇసుక దందా చేయిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. అవినీతి ఎమ్మెల్యేలను, మంత్రులను ఒకచోటి నుంచి మరో చోటికి మారిస్తే నిజాయతీపరులు అవుతారా అని ప్రశ్నించారు. పరిశ్రమలు రాకుండా వైసీపీ నాయకులు అడ్డుకున్నారని, ఒక్కొక్క ఎమ్మెల్యే అవినీతి బాగోతం పుస్తక రూపంలో ముద్రిస్తే పెద్దచరిత్ర అవుతుందన్నారు. వైసీపీ అవినీతికి భయపడి రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిని ఆదరించాలని ప్రజలకు విన్నవించారు.
సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి, సంక్షేమాన్ని పరిగెత్తిస్తామన్నారు. సంపద సృష్టించి పేదలకు సంక్షేమాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, లేకపోతే నెలకు రూ.3 వేల భృతి అందజేస్తామని చెప్పారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పెనుకొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవితమ్మ, నాయకులు పరిటాల సునీత, బీకే పార్థసారథి, కాలవ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్‌, జితేంద్రగౌడ్‌, కందికుంట వెంకటప్రసాద్‌, పల్లె రఘునాథరెడ్డి, జేసీ ప్రభాకరరెడ్డి, జేసీ అస్మిత్‌ రెడ్డి, డాక్టర్‌ అనిల్‌ కుమార్‌, అలిమినేని సురేంద్రబాబు, ఈరన్న, గుండమాల తిప్పేస్వామి, బండారు శ్రావణి, అంబికా లక్ష్మీనారాయణ, జనసేన నాయకులు వరుణ్‌, చిలక మధుసూదన్‌ రెడ్డి, కుమార్‌, కృష్ణమూర్తి, శివ బాల, సామకోటి ఆదినారాయణ, కొల్లకుంట అంజనప్ప తదితరులు సభలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img