Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

రెండుసార్లు పది, ఇంటర్‌ బోర్డు పరీక్షలు

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

రాయ్‌పూర్‌ : నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఏడాదిలో రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. దీన్ని వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అకడమిక్‌ సెషన్‌ నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడిరచారు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ‘పీఎం శ్రీ’ (ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా) పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ… ‘2025-26 అకడమిక్‌ సెషన్‌ నుంచి పది, 12వ తరగతి బోర్డు పరీక్షలను విద్యార్థులు ఏడాదిలో రెండు సార్లు రాసే వీలు కల్పించనున్నాం. ఇందులో ఉత్తమ స్కోరును ఎంచుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడికి దూరం చేసిన నాణ్యమైన విద్యను అందించడమే మా సర్కారు లక్ష్యం. ఈ ఫార్ములా దేశాన్ని 2047 నాటికి వికసిత భారతంగా తీర్చిదిద్దుతుంది’ అని వెల్లడిరచారు. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ గతేడాది ఆగస్టులో కొత్త కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం… టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని ప్రతిపాదించారు. ఈ విధానం ద్వారా విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం దొరకడంతో పాటు పరీక్షలు బాగా రాసేందుకు వీలుంటుందని విద్యాశాఖ పేర్కొంది. అయితే, పరీక్షలు సెమిస్టర్‌ పద్ధతిలో పెడతారా లేక మొత్తం సిలబస్‌పై రెండు సార్లు నిర్వహిస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు. కొత్త విధానంలో 11, 12 తరగతుల విద్యార్థులు రెండు లాంగ్వేజ్‌లను కచ్చితంగా అభ్యసించాలని… వీటిలో ఒకటి భారతీయ భాష అయి ఉండాలని నిర్ణయించారు.
ప్రాంతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలు
దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ మాతృభాషలో చదుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించిన కేంద్రం… రాబోయే మూడేళ్లలో అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు అనువాదం చేయాలని ఎన్‌సీఈఆర్‌టీ, యూజీసీ, ఏఐసీటీఈ, ఇగ్నో, జాతీయ సార్వత్రిక విద్యా పీఠంతో పాటు కేంద్రీయ విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సెంట్రల్‌ వర్సిటీలను విద్యాశాఖ ఆదేశించింది. మాతృభాషలో చదువుకోవడాన్ని ప్రోత్సహించాలని జాతీయ నూతన విద్యా విధానం-2020 సిఫారసు చేసిన విషయం తెలిసిందే. బీటెక్‌ కోర్సులనూ ప్రాంతీయ భాషల్లో బోధనకు ఏఐసీటీఈ దేశవ్యాప్తంగా అనుమతి ఇస్తుండగా… మధ్యప్రదేశ్‌లో ఎంబీబీఎస్‌ కోర్సు హిందీ మాధ్యమంలో ఇప్పటికే ప్రారంభమైంది. పీఎంశ్రీ పథకంపై కేంద్రమంత్రి మాట్లాడుతూ చత్తీస్‌గఢ్‌లోని 211 పాఠశాలలను హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌లో అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కోదానికి రూ.2కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. 2036 ఒలింపిక్‌ క్రీడలకు భారత్‌ ఆతిథ్యం ఇస్తుందని, నాలుగేళ్లలో జరిగే ఈ ఈవెంట్‌లో దేశానికి 10శాతం పతకాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అథ్లెట్ల నుంచే రావాలని ఆకాంక్షించారు. ఇందుకోసం రాష్ట్రంలోని క్రీడాకారులు ఈ ఏడాది నుంచే సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img