కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 47కు చేరింది. వందలాదిమంది మట్టిపెళ్లల కింద, బురదలోను చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఈ తెల్లవారుజామున నాలుగు గంటల వ్యవధిలో మూడుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. రెండు హెలికాప్టర్లతోపాటు 225 మంది ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మెప్పాడితోపాటు కూరమల, అట్టమల, నూల్‌పుళ గ్రామాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. గ్రామస్థుల్లో కొందరు కొండచరియల కింద చిక్కుకుపోగా, మరికొందరు చలియార్ నదిలో కొట్టుకుపోయారు. ఇండియన్ నేవీ కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నట్టు కేరళ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కొండచరియలు విరిగిపడడంతో కూరమల సమీపంలోని ఓ వంతెన ధ్వంసమైనట్టు తెలిపారు. దాదాపు 70 మంది గాయపడినట్టు పేర్కొన్నారు.