ఆనం, శ్రీదేవి, మేకపాటి, వసంతకు మొండిచేయి
టీడీపీ తొలి జాబితాలో దక్కని చోటు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: టీడీపీ, జనసేన విడుదల చేసిన తొలి జాబితాలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద శనివారం 99 మంది అభ్యర్థులతో టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో కేవలం వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి నూజివీడు సీటు ఖరారు చేశారు. నెల్లూరు రూరల్‌కు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి సీటు కేటాయించారు. మిగిలిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనంతోపాటు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, వసంతకు సీటు ఇవ్వలేదు. వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీకి దూరమై, టీడీపీలో టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయనకు కూడా తొలి జాబితాలో చుక్కెదురైంది. వీరికి రెండో జాబితాలోనైనా సీటు దక్కుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీ ఇన్‌ఛార్జిల మార్పులు, చేర్పులు చేపట్టింది. ఏడు జాబితాలు విడుదల చేసినప్పటికీ, దాదాపు 28 మంది సిట్టింగ్‌లకు ఇన్‌ఛార్జిలను కేటాయించలేదు. వారిలో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. ఒకరిద్దరు మాత్రమే పార్టీని వీడారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరి తిరిగి వైసీపీ గూటికి వచ్చారు. వైసీపీలో ఇన్‌ఛార్జిలు దక్కని వారంతా చాలా మంది పార్టీని వీడలేదు. మళ్లీ వైసీపీలో రీ సర్వేల ఆధారంగా ఇన్‌ఛార్జిల మార్పులు, చేర్పులు చేపట్టడంతో అసంతృప్తితో ఉన్న వారంతా మౌనంగా ఉన్నారు. కొందరు సీఎం జగన్‌ను కలిసి పార్టీ వీడబోమని స్పష్టం చేశారు. వైసీపీ అసంతృప్తులంతా ఒక్కసారిగా టీడీపీలోకి వెళ్లినప్పటికీ, వారికి అక్కడ సీట్లను కేటాయించే పరిస్థితి లేదు. ఇప్పటికే టీడీపీ, జనసేన కూటమి కారణంగా కొందరు సీనియర్లకు సీట్లు దక్కపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకోవడం అసాధ్యంగా మారింది. వైసీపీలో రెబల్ ఎమ్మెల్యేలకు రెండో జాబితాలో సీటు రాకుంటే వారి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది.