న్యూదిల్లీ : సీపీఐ జాతీయ సమితి సమావేశాలు దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం అజయ్ భవన్లో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు మూడు రోజులు జరుగుతాయి. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సమావేశాలు ప్రారంభించారు. దేశ రాజకీయ పరిణామాలను ఆయన వివరించారు. మోదీ సర్కారు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను ఆయన ఉద్ఘాటించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, పార్టీ పనితీరును ఆయన విశ్లేషించారు. సమావేశాల్లో సీపీఐ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, అమర్జిత్ కౌర్, అజీజ్‌పాషా, రామకృష్ణ పాండా, కాంగో హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ కార్యవర్గ సభ్యులు కె.రామకృష్ణ, రావుల వెంకయ్య, అక్కినేని వనజ, సమితి సభ్యులు జేవీ సత్యనారాయణ మూర్తి, ఓబులేసు, దుర్గాభవానీ, మధు, రంగన్న తదితరులు పాల్గొన్నారు.