Friday, June 14, 2024
Friday, June 14, 2024

ప్రమాదాల నివారణపై అవగాహన

విశాలాంధ్ర – కర్నూలు సిటీ : విద్యుత్‌ ప్రమాదాల నివారణపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నామని ఏపీఎస్పీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ ఉమాపతి అన్నారు. మంగళవారం స్థానిక ఆపరేషన్ సర్కిల్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారులు పాటించాల్సిన భద్రత నియమాలను తెలియజేసే అవగాహన కరపత్రాలను ఎస్ఈ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఈఈ రమేష్, డీఈలు ఓబులేష్,సుబ్బన్న, రాజా మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ పట్టణ, గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం చేస్తున్నామన్నారు. విద్యుత్‌ ప్రమాదాలు నివారణకు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలను పాటించాలని ప్రజలను కోరారు.
ఇవి పాటించాల్సిందే…

 • ఇంటికి వైరింగ్‌ చేసేటప్పుడు ఐఎస్‌ఐ గుర్తింపు పొందిన విద్యుత్‌ వైర్లు, స్విచ్‌లు, హోల్డర్లు వినియోగించాలి.
 • ఇంటిలోని స్విచ్‌ బోర్డులను భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఎత్తులో అమర్చుకోవాలి.
 • విద్యుత్‌ మీటరు నుంచి స్తంభానికి వేసే వైరు లోడ్‌కు అనుగుణంగా కెపాసిటీ కలిగిన నాణ్యమైనది వేసుకోవాలి.
 • ప్రతి విద్యుత్‌ సర్వీసుకు, ఇంటిలో ఉపయోగించే పరికరాలకు తప్పనిసరిగా ఎర్త్‌ వైరు ద్వారా ఎర్తింగ్‌ ఇవ్వాలి.
 • వర్షం పడుతున్నప్పుడు, నేల పదునుగా ఉన్నప్పుడు విద్యుత్‌ స్తంభాలు, స్టే వైర్లను ముట్టకూడదు.
 • ఇల్లు, అపార్టుమెంట్లు, గ్రూపు హౌస్‌ నిర్మాణ పనులు జరిగినప్పుడు విద్యుత్‌ లైన్‌, స్తంభాలు ఉంటే వైర్లకు ఐరన్‌, ఇతర సామగ్రి తగలకుండా పని చేయాలి.
 • విద్యుత్‌ లైన్లకు దూరంగా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణాలు చేయాలి.
 • తడి చేతులు, కాళ్లు తడిగా ఉన్నప్పుడు విద్యుత్‌ స్విచ్చ్‌లు ముట్ట కూడదు.
 • ఇళ్ల డాబాలపై బట్టలు ఆరవేసేటప్పుడు విద్యుత్‌ వైర్లను చూసుకుని ఆరబెట్టాలి.
 • కొబ్బరి, పామాయిల్‌, మామిడి, టేకు తోటలలో చెట్టు కొమ్మలు తొలగిస్తే 1912 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు లేదా విద్యుత్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చి వారి పర్యవేక్షణలో లైన్‌ క్లియరెన్స్‌ తీసుకుని కొమ్మలను తొలగించాలి.
 • తోటలు, పొలాల్లో, చెరువులు వద్ద విద్యుత్‌ ప్రసారం జరిగే వైర్లు తెగి కింద పడితే 1912 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు లేదా విద్యుత్‌ శాఖ సిబ్బందికి సమాచారమివ్వాలి.
 • విద్యుత్‌ వైర్లు తెగి కింద పడితే నేరుగా ముట్టకుండా విద్యుత్‌ అధికారులకు సమాచారమివ్వాలి.
 • విద్యుత్‌ పరికరాలు రిపేర్‌ చేస్తే తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img