Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

మానసిక రోగులకు కొవిడ్‌ టీకా


కోలుకున్నా ఆసుపత్రుల్లో ఉన్న వారిపై మూడు నెలల్లో సమగ్ర నివేదిక ఇవ్వండి
కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూదిల్లీ : మతిస్థిమితంగా లేని వారికి సైతం కొవిడ్‌ పరీక్షలు, వాక్సినేషన్‌ కచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు మంగళవారం సూచించింది. మెంటల్‌ హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌లలోని రోగులను బిచ్చగాళ్ల వసతిగృహాలకు మహారాష్ట్ర ప్రభుత్వం తరలించడాన్ని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. తక్షణమే ఈ చర్యలను నిలిపివేయాలని, ఇది మానసిక ఆరోగ్య చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. జులై 12న జరగనున్న సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సమావేశంలో పాల్గొని పూర్తి సహకారాన్ని అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు న్యాయస్థానం సూచించింది. కోలుకున్నప్పటికీ ఇంకా మెంటల్‌ ఆసుపత్రుల్లోనే ఉన్న వారు/ ఇంకా చికిత్స అవసరమైన వారి లెక్కల్లో తేడాలు ఉండటాన్ని ఎత్తిచూపింది. ఈ కేసును పర్యవేక్షిస్తామని, మరో మూడు వారాల్లో విచారిస్తామని పేర్కొంది. కేంద్రప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మాధవి దివాన్‌ వాదనలు వినిపించారు. రాష్ట్రాల డేటాలో తేడాలు ఉండటాన్ని గుర్తించి తెలియజేసినట్లు కోర్టుకు తెలిపారు. కోలుకున్నప్పటికీ మెంటల్‌ ఆసుపత్రుల్లోనే గడుపుతున్న వారి సంఖ్య దేశంలో 10వేల వరకు ఉన్నట్లు న్యాయవాది గౌరవ్‌ బన్సల్‌ తన ఫిర్యాదుపై పేర్కొన్నారు. ‘ఇది తీవ్రంగా పరిగణించాల్సిన వ్యవహారం. కోలుకున్న చాలా మందిని వారి కుటుంబాలు స్వీకరించే పరిస్థితి ఉండకపోవచ్చు. దీనిని తీవ్రంగా పరిగణించి.. కోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించండి’ అని కేంద్రానికి ధర్మాసనం స్పష్టంచేసింది. దీనికి దివాస్‌ స్పందిస్తూ పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోలం. మహమ్మారి వేళ మానసిక ఆరోగ్యానికి కొత్త కోణం లభించినట్లు అయిందన్నారు. 12న జరిగే సమావేశంలో పాల్గొనాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ సమావేశంపై స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని దివాన్‌ను ఆదేశించింది. మానసిక రోగులను బిచ్చగాళ్ల వసతిగృహాలకు తరలించడాన్ని మానుకోవాలని మహారాష్ట్ర సర్కార్‌కు సూచించింది. ఈ వ్యవహారంతో తదుపరి విచారణను 27వ తేదీన జరుపుతామని న్యాయస్థానం పేర్కొంది. మానసిక అనారోగ్యం నుంచి కోలుకున్నప్పటికీ ఆసుపత్రుల్లోనే ఉన్న వారికి పునరావాసం కల్పించే విషయమై 2017లో ఇచ్చిన తీర్పు అమలునకు ఆచరించే ప్రణాళిక ఏమిటో మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. దేశవ్యాప్తంగా ఉన్న 43 మెంటల్‌ హాస్పిటల్స్‌లో కోలుకున్న వారు ఎంత మంది ఉన్నారన్నది సర్వే నిర్వహించిన నివేదిక సమర్పించాలని కూడా కేంద్రానికి సుప్రీంకోర్టుఆదేశించింది

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img