Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

కొడిగట్టిన కులవృత్తి దిగులైపోయిన కవిత్వం

కులవృత్తులు తరతరాల సంప్రదాయాల లోగిళ్లు. పల్లెలకు పట్టుకొమ్మలు. మనుషుల మధ్య ఆత్మీయతావారధులు. మనిషి మనుగడకు సోపానాలు. శ్రమజీవులకు జీవనాధారాలు. బహుజనుల పాలిట శరత్తులు. వాటిని చిన్నాభిన్నం చేసేస్తున్నాయి, కనుమరుగు చేసేస్తున్నాయిఇప్పటి కాలపరిస్థితులు. అవి అసలైన నాగరికతకు ఆనవాళ్లు. అయితే మనకళ్లముందు కనిపిస్తున్న విషాదం… అవి క్రమక్రమంగా ప్రపంచీకరణ అనకొండ కోరల్లోకి వెళ్లిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ కునారిల్లుతూ గొల్లుమంటున్న మన పల్లెలు. కులవృత్తుల ధ్వంసంతో తరతరాల వారసత్వం బీటలు వారుతూ జనజీవన విధ్వంసానికి దారితీస్తోంది. ఆ విధ్వంసం అనుబంధాలకు చిచ్చుపెడుతోంది. ఒకప్పుడు పగ్గాలు చేపట్టి అల్లికలతో వస్త్రాలను కళకళలాడిరచిన మగ్గాలు నేడు మూలన పడిపోయి మౌనంగా రోదిస్తున్నాయి. ఒకప్పుడు మట్టిలో మహారూపాలు సృష్టించిన మట్టిచేతులు ఇప్పుడు వెట్టిచాకిరీకి అంకితమైపోతున్నాయి. అయినా కులవృత్తుల్ని వదులుకోలేని కొన్ని జీవితాలు గాలిలో మినుకుమినుకుమనే దీపాల వత్తుల్లా భారంగా గడుపుతున్నాయి. కొడిగట్టిన దీపాలైపోతున్న కులవృత్తుల్ని మళ్లీ నిండుగా వెలిగించాలని కవిత్వమూ తపిస్తోంది. అవి కొడిగట్టడానికి కారణమయ్యే ప్రచండ గాలులపై అది ధ్వజమెత్తుతోంది. మోడువారిన మనిషి జీననోద్యానాన్ని మళ్లీ కులవృత్తి పచ్చదనంతో నింపడానికి అది సమాయత్తమవుతోంది. అందుకు తానే కులవృత్తి అయిపోయింది.
‘అది బువ్వకుండ/ఆకాశంలోని శూన్యాన్ని/ముక్కలుగా కత్తిరించి
సుట్టువార మట్టిగోడలు కట్టి/సృష్టించిన గుండెకాయ
ఆహార తయారీకి ఆయువు
జీవనవికాసానికి తొలి పనిముట్టు/మానవయానానికి అడుగు
ఎప్పటికీ అస్తమించని సూర్యమడుగు…..
విశ్వమానవుల ఆకలి తీర్చ
బువ్వకుండ అందించే వారసత్వం
ఒక పరపరాగ ధర్మసందర్భం
సృష్టిరహస్యం ఎంతటి మార్మికతో
కుండ సృష్టి అంతటి క్రియాత్మకత
మట్టిచేతుల నుంచే మహాపాత్రలకు
మట్టిలోనే జీవం పొయ్యడం ఒక ఆవశ్యకత….
కుమ్మరి మన్ను ఒక చరిత్ర పరిమళం
కుమ్మరి కూడా ఒక మహత్తర బాండం
మరి బ్రహ్మ పరిస్థితి ఏమిటి
మట్టిలో కుమ్మరిపురుగై తిరిగిన ఆయన
బూడిదలో బూడిదై మెదిలిన ఆయన కాయం
ఇప్పుడు ఇచ్చుకపోతున్న బోనం….
మట్టి మహిమ స్థానంలో స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌
కుండల స్థానంలో కుక్కర్‌ విజిల్లు
మట్టిని లోహం పురాగా మింగింది
అయినా మన్ను పరిమళం మిగిలేవుంది
కళాత్మకతలో ఉత్పాదకత దాగివున్న కులకాశ్పి
చేతివేళ్లనుంచే ఆణిముత్యాల్లాంటి
కుండలు గురుగులు గూనలు రాలిపడుతాయి….
ఉత్పత్తిసేవలు ఒక సామాజిక సన్నివేశం
సమాజానికి బహుజనులు అందించిన బహుమానం
తరతరాలుగా కొనసాగుతున్న వారసత్వం….
(‘బువ్వకుండ’ దీర్ఘకవిత నుంచి)
అంటూ మట్టికీ, మనిషికీ అవినాభావ సంబంధాన్ని ఏర్పరచే కుండను సృష్టించే కుమ్మరి విభిన్న జీవనపార్శ్వాలను కవిత్వీకరించాడు అన్నవరం దేవేందర్‌. కులవృత్తి అతని చేత చేయించే అద్భుతాలను ఏకరువు పెట్టింది కవిత్వం. అతని వృత్తికి కలిగించే ఆటంకాలు సృష్టించే జీవనవిధ్వంసంలోని విభిన్న కోణాల్ని స్పృశించింది. మనిషికి ఆకలి తీర్చే కుండ కోసం ఆకాశమంత శూన్యాన్ని ముక్కలుగా కత్తిరించే శ్రమను చూపిస్తుంది. కుండ వని, జీవనవిధానంలో భాగమైపోవడాన్నీ, అది మానవ నాగరికతలో అడుగు అయిపోవడాన్నీ, అది మట్టి అనే జీవంతో నిండుగా తొణికిసలాడడాన్నీ, ఆ పనిముట్టు జీవనావసరం వంటి గుండెకాయ అయిపోవడాన్నీ గుర్తుచేస్తుంది. మట్టిపరిమళాన్ని లోహపు కబంధ హస్తాలు స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌, కుక్కర్‌ ల కూపంలో కమ్మేయడాన్నీ దునుమాడుతుంది. అయినా ఎప్పటికీ తరిగిపోని మట్టిపరిమళాన్ని ఆస్వాదిస్తూనే వుండాలని, సమాజం కోసం ఉత్పత్తిగా మారే చేతివేళ్లు సృష్టించే కళను పదిలపరచుకోవాలని ప్రబోధిస్తుంది. విధ్వంసానికి గురైన ఆ శ్రమజీవి లోగిలిని మట్టిఊపిరితో నింపాలని తపిస్తుంది.
‘కులవృత్తుల మైదానంలో/ప్రపంచీకరణ మృత్యుక్రీడ
మా నిస్సహాయత దేహపు శవంపై
రంగుతో రాగాలు కట్టి మా జీవన సంస్కృతిని దోచుకుంది
దాని నీలినీడల దుప్పటి కింద/తాటి కవలపిల్లలు
మొలకల్లోనే ‘భ్రూణహత్యలు’ కాబడుతున్నాయి
ప్రపంచీకరణ విధ్వంసకాండకు/వృత్తుల జాబితాలో గీత
రెక్కలు తొలుచుకుంటున్న నగ్నవృక్షం
గీతకార్మికుడు కొలువు జారి
ముందువరసలో నిలబడిన నిరుద్యోగి
పట్టణీకరణమనే/కాంక్రీట్‌ జంగిల్‌ భవనాల పునాదుల్లో
ఈదులన్నీ సమాధులు కాబడ్డాయి
రింగ్‌ రోడ్డు వామనపాదాల విఫణివీధిలో
చెరిపి బతికి తొక్కబడుతున్న బలిచక్రవర్తి ‘మా తాటివనం’
రియల్‌ ఎస్టేట్‌ డేగల పడగల కింద
వనం మట్టిదేహం తొలచబడి
బతుకు బీడైన/మా గీత కార్మికుడు ‘ఓ శిబిచక్రవర్తి’….
సృజనాత్మకంగా/వృత్తినైపుణ్యం పండిరచిన
మా గీత పనిముట్లన్నీ అటకెక్కిన
పాతగోతాము మూటలో చేర్చాం
వాటితో పాటు మా ఆత్మల్ని కూడా మూటగట్టాం….
రాజ్యం మాకు మిగిల్చిన వారసత్వం
చెట్టునుంచి వలస/వృత్తినుంచి వలస
వూరునుంచి వలస/బతుకునుంచే వలస….
వృత్తి ప్రతి ఒక్కరి ఆర్థికమూలం
అత్మసంతృప్తి/ఆత్మగౌరవం సొంత అస్తిత్వం!’
(‘కల్లంచుల బువ్వ’ దీర్ఘకవిత నుంచి)
అంటూ బువ్వ పెట్టే తల్లిలాంటి కల్లుగీత వృత్తి విధ్వంసక దృశ్యాలను కవిత్వీకరిస్తాడు ఈ. రాఘవేంద్ర. ఇక్కడ ప్రపంచీకరణ విధ్వంసకాండలో తరతరాల సంస్కృతిచిన్నాభిన్నమైపోయి పగుళ్లు దీసే కల్లుగీత వృత్తి దిగులు అయిపోయింది కవిత్వం. ఆ విధ్వంసంలో తాటిఈత మొలకల భ్రూణహత్యల్నీ, సర్వస్వం కోల్పోయి చెట్టు బోసిపోవడాన్నీ, కల్లురాజసంతో ఉట్టిపడిన గతవైభవపు కొలువు జారిపోతే గీతకార్మికుడు రోడ్డునపడ్డ నిరుద్యోగి అయిపోవడాన్నీ, కార్పొరేట్‌ రోడ్ల వామన పాదాల కింద తాటివనాల బలిచక్రవర్తులు అణగిపోవడాన్నీ దర్శిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ స్వైరవిహారంతో బీళ్లుపడిన తమ తాటివనాల బతుకులతో శిబిచక్రవర్తులయ్యే గీత కార్మికుల ఆవేదనను రికార్డు చేసింది.
నిరంతరం చూపించే సృజనాత్మకత, వృత్తి నైపుణ్యం పనిముట్లతో బాటు అటకెక్కిపోతే ఉసూరుమంటూ తమ ఆత్మల్ని కూడా మూటగట్టి అటకెక్కించేసిన ఆ శ్రమజీవుల దుర్భరస్థితిని మనకళ్లముందుంచుతుంది. తరతరాల వారసత్వం జీవితంనుంచే వలస వెళ్లిపోయే దయనీయస్థితిని చూపుతుంది. దేహంలో అంగంలా మనిషి జీవితంలో అంతర్భాగమైపోయిన కులవృత్తి అతని ఆత్మసంతృప్తికీ, ఆత్మగౌరవానికీ, అస్తిత్వానికీ ప్రతీక అయిపోయింది. అందుకే కవిత్వం దానికి ఆత్మీయ నేస్తమైపోయింది. తన అక్షరాల ఓదార్పును వొంపుతూ దాని దిగులు తీర్చడానికి, అది పురాజ్ఞాపకంగా మిగిలిపోకుండా ఆ వైభవాన్ని మళ్లీ మనిషి జీవితానికి తొడగడానికి యత్నిస్తుంది.
డాక్టర్‌ కొత్వాలు అమరేంద్ర
సెల్‌: 9177732414

Previous articleఅవలోకనం…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img