Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

అవలోకనం…

పుట్టుక మొదలు గిట్టే వరకూ
ఎంతో కొంత
మనల్ని మనం ప్రేమించుకుంటూ వుండాలి
ఆకాశం నుంచి రాలిన
వర్షపు చినుకులు
పుడమిని ముద్దాడినట్టు
ఎటు నుంచి ఎక్కడికో ప్రయాణం
ఏ ఆశలు ఆశయాలు లేకుండా
ఏ భయాలు బాధ్యతలూ ముడేసుకోకుండా
స్వాతిముత్యంలా వచ్చి వుండవచ్చు
సృష్టికి ప్రతిసృష్టినీ ఆకాంక్షిస్తూ
కాలగమన క్రియవై
రాత్రిని నిశబ్దంగా వొదిలి
కొత్త ఉదయాలను తొడుక్కోక తప్పదు
బతుకెప్పుడూ యుద్ధమే
ఆయుధాన్ని చేపట్టి
రణరంగంలో దూకినప్పుడు
పోరాటమూ తప్పదు గాయాలు తప్పవు
జయాపజయాలు కాలానికి వొదిలేయ్యాలి
దుఃఖపు ఘోషలో
తల్లడిల్లిన దేహానికి తడి ఎప్పటికీ ఆరదు
కొన్ని క్రతువుల పాదముద్రలు
ఏ అలజడి తుఫానుకూ చెరిగిపోవు
కొన్ని గాయాలకు లేపనాలుండవు
కాలమే కరిగి వెన్నెపూసై
బాధపై చల్లగా జారిపోతుంది
అందమైనా… వికృతమైనా
గుండెను జండాలా ఎగరేసుకుంటూ
కొన్ని కళల్ని మరికొన్ని కలల్ని పోగేసుకుని
మన చుట్టూ ఆకట్టుకున్న ప్రకృతిని
మనల్ని చుట్టుకున్న ఆకృతిని
పోయే వరకూ ఆరాధించక తప్పదు..!
డా. కటుకోరa్వల రమేష్‌
సెల్‌: 9949083327

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img