చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పనితీరును ప్రశంసిస్తూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్, ప్రముఖ నటుడు చిరంజీవి, స్టాలిన్ భేటీపై ఆ రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగింది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ తన ప్రసంగంలో ఈ విషయాల్ని ప్రస్తావించారు. పవన్ ట్వీట్‌ను తమిళనాడు మంత్రి ప్రత్యేకించి తెలుగులో చదివి వినిపించారు. తోటి సభ్యులకు అర్థమయ్యేలా ఈ ట్వీట్‌ను తెలుగులో చదువుతూ తమిళంలో తర్జుమా చేసి చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి.. కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం. స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను’ అని ట్వీట్లో పవన్ పేర్కొన్నారు. మరోవైపు, స్టాలిన్‌తో భేటీ అయిన చిరంజీవి..‘స్టాలిన్‌ను కలవడం సంతోషంగా ఉంది. ఆయన తీసుకున్న ఉన్నతమైన నిర్ణయాలతో గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగారు. కరోనా కాలంలో మెరుగైన పాలన అందిస్తున్నారని అభినందనలు తెలిపాను’ అని ట్వీట్ చేశారు.