Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

బీజేపీకి కాదు ‘నోటా’కే ఇండోర్‌ ఓటు

గుజరాత్‌లోని సూరత్‌ మాదిరిగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోనూ ఏకగ్రీవ ఎన్నికైంది. దీనికి బీజేపీ రాజకీయ ఎత్తుగడలే కారణం. ఈ స్థానం నుంచి పోటీ చేయాల్సిన కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షయ్‌ కాంతి బమ్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అందుకు కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇదే క్రమంలో ఇండోర్‌లో నోటాకు స్వరం పెరిగింది. ఈనెల 13న జరగబోయే ఎన్నికల్లో బీజేపీకి కాకుండా నోటాకు ఓటు వేస్తామని స్థానికులు అంటున్నారు. తమ అభ్యర్థిని బీజేపీ బలవంతంగా పోటీ నుంచి తప్పించిందని, నోటాకు ఓటు వేయాలని ఇండోర్‌ ప్రజలకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. ఇండోర్‌లో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందని, దేశంలోని అతిశుభ్రమైన నగరాన్ని కలుషితం చేసిందని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు విమర్శించారు. తాజా ఎన్నిక ఇండోర్‌ విలువలకు, బీజేపీ అహానికి మధ్య పోటీగా వర్ణించారు. నోటా ఎంపిక ద్వారా అహంకార పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ పిలుపునకు ఇండోర్‌ ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. ఇది బీజేపీని ఇరకాటంలో పెట్టింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ విలేకరులతో మాట్లాడుతూ తాజా పరిణామంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. 1989 నుంచి 2014 వరకు వరుసగా ఇండోర్‌ నుంచి ఎనిమిదిసార్లు బీజేపీ ఎంపీగా సుమిత్రా మహాజన్‌ (81) ఎన్నికయ్యారు. తన 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాన్ని చూడలేదని కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షయ్‌ నామినేషన్‌ ఉపసంహరణను ఉద్దేశించి అన్నారు. నామినేషన్‌ ఉపసంహరించుకున్న కొన్ని గంటలలోనే బీజేపీలో చేరడాన్ని ఆమె ప్రశ్నించారు. తాము బలంగా ఉన్న స్థానంలో బీజేపీ ఇలా ఎందుకు చేసిందో అంతు పట్టడం లేదని మహాజన్‌ అన్నారు. ఇండోర్‌ ప్రజలు బీజేపీకి కాదు నోటాకు ఓటు వేస్తామంటున్నారని ఆమె తెలిపారు. కాగా, నోటాను ఎంపిక చేయడంలో ఇండోర్‌ ప్రజలు ముందుంటారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ నోటాకు 15వేలకుపైగానే ఓట్లు వచ్చాయి. 2018లోనూ 20,817 మంది ‘నోటా’ (నన్‌ ఆఫ్‌ ది అబవ్‌)ను ఎంచుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img