Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

అభివృద్ధే కోటేశ్వరరావు అజెండా

విశాలాంధ్ర-విజయవాడ: అభివృద్ధే తన అజెండాగా పనిచేసే జి.కోటేశ్వరరావుకు ఓట్లు వేసి గెలిపించాలని సీపీఐ నేతలు పిలుపునిచ్చారు. ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీపీఐ అభ్యర్థి కోటేశ్వరరావుకు మద్దతుగా బుధవారం సీపీఐ శ్రేణులు భారీ ప్రదర్శన అదరహో అనిపించింది. భవానీపురం స్వాతి థియేటర్‌ వద్ద ప్రారంభమైన ర్యాలీ శివాలయం సెంటర్‌, చర్చ్‌ సెంటర్‌, ఊర్మిళా నగర్‌ మీదుగా కబేళా సెంటర్‌ వరకు సాగింది. అనంతరం జరిగిన సభలో సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ ఏ సమస్య వచ్చినా ‘నేను ఉన్నాను’ అంటూ వెంటనడిచే స్థానికుడైన కోటేశ్వరరావుకు విజయం చేకూర్చాలని కోరారు. బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టిన వారికి అవకాశం ఇస్తే ప్రజల్ని మరింత దోపిడీ చేస్తారని హెచ్చరించారు. బీజేపీ... సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాసం అంటూనే మణిపూర్‌లో 155 చర్చిలను కూలగొట్టిందన్నారు. వికసిత్‌ భారత్‌ అని చెపుతూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం సంక్షేమం ముసుగులో అభివృద్ధిని నిర్వీర్యం చేసిందన్నారు. రాజకీయ అవకాశవాది చంద్రబాబు... రాష్ట్ర్ర అభివృద్ధి కోసమే ఎన్డీఏలో చేరానని చెప్పటం బూటకమని ధ్వజమెత్తారు. పారాచూట్‌లో దిగిన వారికి కాకుండా మన మధ్య ఉండే వ్యక్తి ఎవరో ఆలోచన చేసి ఓట్లు వేయాలని ప్రజలకు సూచించారు. ఈ ప్రాంతంలో అండిమాని బ్రహ్మయ్య, పాపారత్నం ఆ తరువాత కోటేశ్వరరావు కార్పొరేటర్లుగా భవానీపురం, విద్యాధరపురం, అమ్మవారి గుడి తదితర ప్రాంతాలను అభివృద్ధి చేశారని వివరించారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ తాను కార్పొరేటర్‌గా ప్రజలకు సేవలు అందించానన్నారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే చట్టసభలో ప్రజాసమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. ‘కంకికొడవలి’ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లూరు భార్గవ్‌ ‘హస్తం’ గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్‌.కోటేశ్వరరావు, రావులపల్లి రవీంద్రనాథ్‌, పెన్మెత్స దుర్గాభవాని, ఇన్సాఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్‌ అప్సర్‌, సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు పాల్గొన్నారు.
ఆద్యంతం ఆకట్టుకున్న ఎర్రసైన్యం క్రమశిక్షణ
కోటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ కమ్యూనిస్టు శ్రేణులు నిర్వహించిన ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. డీజే సౌండ్లతోను, ఎర్రచీరలు ధరించిన మహిళలు, ఆ వెనుక రెడ్‌షర్ట్‌ వలంటీర్లు అద్భుత ప్రదర్శనలిచ్చారు.రెండు వరుసల్లో ఎంతో క్రమశిక్షణతో కార్యకర్తలు ముందుకు సాగారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా, ఒడిదుడుకులు లేకుండా ఎర్ర గొడుగులు, ఎర్ర టోపీలు, బ్యాడ్జీలు ధరించి కదులుతున్న ఎర్రసైన్యం ప్రవాహాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img