Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

ఇండియా కూటమికి మద్దతివ్వండి

కార్మికవర్గానికి ఓబులేసు పిలుపు

విశాలాంధ్ర`విజయవాడ(గాంధీనగర్‌): రాజ్యాంగాన్ని కాపాడుతూ లౌకికతత్వం, ప్రజాస్వాయ్యాన్ని పరిరక్షిస్తామని ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం హామీ ఇచ్చాయని, ఈ ఎన్నికల్లో కార్మికవర్గం మొత్తం ఆ కూటమి అభ్యర్థులను గెలిపించవలసిన చారిత్రక అవసరం ఉందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు పిలుపునిచ్చారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ప్రధాన కార్మిక సంఘాల నాయకులు గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఓబులేసు మాట్లాడుతూ కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం అభ్యర్థుల గెలుపు కోసం కార్మికవర్గం కృషి చేయాల న్నారు. ఇండియా కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మోదీ నేతృత్వంలోని పదేళ్ల బీజేపీ పాలనలో దేశ ఐక్యతకు ప్రమాదం ఏర్పడిం దన్నారు. సామాన్యుల నడ్డివిరిచి బడా కార్పొరేట్లను భుజానికెత్తుకున్న నియంత ప్రధాని నరేంద్ర మోదీ నిజస్వరూపాన్ని ప్రజలు గ్రహించారని చెప్పారు. నిరుద్యోగం పెరగడం, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పాటు నిత్యావసరాల వస్తువుల ధరలన్నీ ఆకాశాన్నంటాయన్నారు. పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో వివిధ రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయ న్నారు. కుడి, ఎడమ పక్కన పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబును నిలబెట్టి మోదీ విజయవాడలో రోడ్‌షో నిర్వహించారని, దానివలన రాష్టానికి జరిగిన ప్రయోజనం ఏమిటని ఓబులేసు ప్రశ్నించారు. మరోపక్క తమ వల్లే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగిందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నా రని ఆరోపించారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన మోదీ వల్లే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు చెబుతున్నారని, అలాగైతే ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి నాడు ఆయన ఎందుకు బయటకు వచ్చారని నిలదీశారు. పునర్విభజన చట్టం ప్రకారంగా రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు వంటి ఏ ఒక్క హామీ పరిష్కారం కాలేదన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక సంఘాలన్నీ ఇండియా కూటమిని బలపర్చాలని కోరారు. ఇండియా కూటమిగా సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీలను తాము పూర్తిగా బలపరుస్తున్నామన్నారు. ఇండియా కూటమితోనే రాజ్యాంగానికి రక్షణ అన్నారు. రాజ్యాంగం లేకపోతే లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం ఉండదన్నారు. బీజేపీ పాలనలో కార్మికవర్గానికి అనుకూలంగా ఒక్క నిర్ణయం తీసుకోలేదన్నారు. ఉన్న చట్టాలు రద్దుచేసి కార్పొరేట్లకు కట్టు బానిసలుగా చేశారన్నారు. ఇండియా కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మికవర్గానికి, ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు పి.అజయ్‌కుమార్‌, డి.రమాదేవి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img