Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

అవ్వా తాతల పెన్షన్‌ కష్టాలకు కారకులెవరు?

అవ్వా తాతల పెన్షన్‌లకు కష్టాలను కొని తెచ్చినది టీడీపీ అని వైసీపీ, కాదు మీరేనని టీడీపీ వీధులకెక్కి కాట్లాడుకోవడం తెలుగు ప్రజలకు పట్టిన దుర్గతి. వయసుడిగి పనిభారం మోయలేక విశ్రాంతి జీవితం గడుపుతున్న వృద్ధులు, వయోవృద్ధులు ఎన్నికలవేళ రాజకీయ పావులుగ మారడానికి అధికార, ప్రతిపక్షపార్టీలు కారకులైనా ప్రధాన నిందను అధికారపార్టీ మోయకతప్పదు.
వాస్తవానికి అసలు కారకులు ఎవరన్నది ప్రధాన చర్చనీయాంశం. వలంటీర్లను పించను, తదితర డబ్బు పంపిణీకి పంపరాదని ఎన్నికల కమిషన్‌ తాఖీదు లివ్వడమే అసలు సమస్య. వలంటీర్లను నగదు పంపిణీకి, ఎన్నికల బాధ్యతలకు నియమించరాదని తెలుగుదేశం పార్టీతోపాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేసినందున అవ్వా, తాతలకు ఈ సమస్య వచ్చి పడిరదని వైసీపీ ఆరోపణ. కాదు వలంటీర్లను ఎన్నికల్లో వైసీపీ ప్రచారదళంగా ఉపయోగపడుతుందని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని చెప్పామని, కాని పించన్ల నగదు పంపిణీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదని టీడీపీ నాయకుల వాదన. సాంకేతికపరంగా చూసినప్పుడు రెండు వాదనల్లోను నిజం లేకపోలేదు.
అయినా వలంటీర్ల నియామకం మొదటినుండి వివాదాస్పదం. పాలకపార్టీలు తమ స్వార్థ రాజకీయాలకు కొన్ని నిర్ణయాలు చేసినా అవి ప్రజలకు చేరువకాగలవు. గతంలో ఎన్‌టీఆర్‌ తీసుకున్న మండలవ్యవస్థ ఏర్పాటును ప్రతిపక్ష పార్టీలు విమర్శించినా తరువాత అవే పార్టీలు, ప్రజలు హర్షించారు. కాని దీనిలో రాజకీయ తంత్రం ఏమీలేదు. ఆ తరువాత ఆంధ్రలో మునసబు, కరణాలను తెలంగాణలో పటేల్‌, పట్వారీలను రద్దుచేస్తూ ఒక చట్టం చేశారు. అలాగే భూమిశిస్తును రద్దు చేశారు. ఈ రెండు చట్టాలు టీడీపీకి ప్రత్యేకంగా ఎన్‌టి.రామారావు ప్రతిష్టను పెంచాయనుటలో సందేహంలేదు. కాని అందరు హర్షించలేకపోవచ్చు. మునసబు, కరణాల వ్యవస్థను రద్దు చేయటాన్ని ప్రారంభంలో ప్రజలు స్వాగతించినా, ఆచరణలో ప్రజల నుండి నిరసనను ఎదుర్కోక తప్పలేదు. తరువాత ఆ స్థానాలలో నియమించిన ప్రభుత్వ ఉద్యోగులకు భూ రికార్డులపై అవగాహన లేకపోవడం, వారికి తగిన సాంకేతిక శిక్షణ ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఈ నాటికి భూ వివాదాలకు కొదువలేదు.
ఈనాడు జగన్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వ్యవస్థ ఆనాడు టీడీపీ తీసుకువచ్చిన సంస్కరణలకు భిన్నమైనది. అత్యంత ప్రమాదకరమైనవి. గాంధీ కలలుగన్న గ్రామ రాజ్యానికి భిన్నమైనవి. వలంటీర్‌ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను వైసీపీ పంచమాంగదళంగా ముఖ్యమంత్రి తీర్చిదిద్దడాన్ని టీడీపీ ఆరోపించడంలో నిజం లేకపోలేదు. సంస్కరణలనేవి రాష్ట్రంలోనైనా, కేంద్రంలోనైనా తీసుకురావలసిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చి 70సంవత్సరాలకు పైబడినా సంస్కరణలు లేకపోతే ఆ సమాజం, రాజకీయ వ్యవస్థ బండబారిపోతుంది. ప్రజాస్వామ్యం కనుమరుగై నియంతృత్వపాలనకు దారి తీస్తుంది. ఈ 70 సంవత్సరాలలో జనాభా పెరగడం, వారి అవసరాలు, ఆలోచనలు, జీవనసరళి మారుతున్న దశలో వాటికనుగుణమైన, ప్రజల అవసరాలు తీర్చగలిగిన సంస్కరణలు కావాలి. అవి ప్రజలకు, సమాజానికి మేలు చేస్తాయి. రాష్ట్రాలు, దేశాభివృద్ధికి బాటలు వేస్తాయి.
కాని జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వలంటీర్‌, సచివాలయ వ్యవస్థలు అందుకు భిన్నంగా ఫలితాలను ఇస్తున్నాయన్నది నిర్వివాదాంశం. వలంటీర్‌లు కేవలం 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్వీస్‌ రూల్స్‌ అమలు పరుస్తున్నారా? లేదు. వారు ప్రభుత్వ యంత్రాంగంలో భాగమా? ప్రశ్నార్థకమే. వలంటీర్లు మేం చెప్పినట్లే వినాలి. వలంటీర్లే నా సైన్యం అని ముఖ్యమంత్రి ప్రకటించిన తరువాత ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ఆలోచిస్తాయి? అవి మంచివా, చెడువా అన్నది వేరే విషయం. గల్లీ నుండి తాడేపల్లి ప్యాలెస్‌ వరకు వైసీపీ నాయకులు బరితెగించి వలంటీర్లకు తాయిలాలిచ్చి, అజమాయిషీ చేస్తుంటే ఎన్నికల్లో పాల్గొనే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయకుండా ఉంటుందా? వారు నిజంగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండాలని భావిస్తే వైసీపీ నాయకులతోపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండమని ఎన్నికల కమిషన్‌ ఆదేశించినప్పుడే రాజకీయ పార్టీల ప్రచారానికి దూరంగా ఉండవలసిన బాధ్యత వారికుంది. వలంటీర్ల శ్రేయస్సు కోరినట్లయితే వైసీపీ నాయకులు స్వచ్ఛందంగా వారిని ప్రచారానికి దూరంగా ఉంచితే విజ్ఞతగా ఉండేది. పోలీసు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం తమ చెప్పుచేతల్లో ఉంటే తమను ఎవరూ ఏమీ చేయలేరన్న అహంభావాన్ని ప్రదర్శిస్తే జరిగేదేమిటో, జరగబోయేదేమిటో ఇటీవల వస్తున్న వార్తలే స్పష్టంచేస్తున్నాయి.
ఎన్నికలనేవి ప్రజాస్వామ్యానికి ప్రధమ సోపానం. అవి నిష్పక్షపాతంగా జరిగితే ప్రజలు శక్తిమంతంగా తయారవుతారు. వ్యక్తి స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటాయి. సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు కొంతమేర పురోగమనంలో ఉంటాయి. నోటుకు ఓటు, కండబలం ఎన్నికల్లో ప్రధాన సాధనంగా ఉన్నంతకాలం ప్రజాస్వామ్యానికి అంగవైకల్యం దాపురిస్తుంది. దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి తిరోగమనం బాట పడతాయి. దానికి మన రాష్ట్రమే నిదర్శనం. అందువలన నేటి ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయానికి నేటి వైసీపీ పాలకులే తప్ప, దానికి ప్రతిపక్ష రాజకీయ పార్టీలపై నిందలు వేయడం దుర్మార్గం. దీనికి అనుగుణంగా వైసీపీ ఐటీ బృందాలు సోషల్‌ మీడియాలో వాయిస్‌ మెసేజ్‌లు పెట్టి ప్రజల ఆలోచనలను కలుషితం చేస్తున్నాయి. అయినా ప్రజలు నమ్ముతారనుకోవడం భ్రమ మాత్రమే.
ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా అవ్వా, తాతల పెన్షన్‌లను రాజకీయంచేసి పాలకపార్టీకి లాభం చేకూర్చే పనిలో ఉన్నారు. సచివాలయం, పంచాయితీ సిబ్బంది తగిన సంఖ్యలో ఉన్నా గ్రామాలకు అధికారులనుపంపి పంపిణీ చేయించడానికి ఉన్నతాధికారులు ప్రయత్నించకపోవడం స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. అనేక చోట్ల సచివాలయాలకు వెళ్లిన వృద్ధులు డబ్బులు లేక వెనుదిరగడం, గంటల తరబడి వేచి ఉండడం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యమని ఎవరైనా నిందించవలసిన పనిలేదు. తనకుతానే నిందించుకోవాలి. ప్రస్తుత దుస్థితికి కారణం నూటికి నూరుపాళ్లు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అనడంలో ఎలాంటి సందేహంలేదు.
సెల్‌ : 8121223457

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img