Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

జవాబు లేని ప్రశ్న

చింతపట్ల సుదర్శన్‌

పొద్దు గూట్లో పడే టైం అయింది. వెనుకటి రోజుల్లో ఎక్కా బుడ్డీలు, కందిలీలు వెలిగించే టైం. ఇప్పుడైతే ఎల్‌ఈడీలు వెలిగించే టైం. అరుగుమీద తీరిగ్గా కూచున్నాయి డాంకీ, డాగీ. కళ్లు మూసుకుని మెడిటేషన్‌ చేస్తున్నది డాంకీ. తోకతో విన్యాసాలు చేయిస్తున్నది డాగీ. ఉన్నట్టుండి లేచి నిలబడ్డది డాగీ. మొహం మీద చెవులు, వీపు మీద తోకా నిలబెట్టి ‘రీ సౌండు’ వచ్చేట్టు ‘భవ్వు’ మనసాగింది. ధ్యానం భగ్నంఅయి ఉలిక్కిపడి కళ్లు తెరిచింది డాంకీ. ఎమొచ్చిందోయి నీకు ఉన్నట్లుండి తోక తొక్కిన కుక్కలా అరుస్తున్నావు అంది డాంకీ. ఒక్క క్షణం ‘భవ్వు’ను ఆపి అటుచూడు ఆ వెళ్లున్నవాడ్ని గుర్తుపట్టి అరిచి చస్తున్నా అంది డాగీ. ఎవరతను? కార్పొరేటరా, ఎంఎల్‌ఏనా మరో పెద్ద తలకాయా అంది డాంకీ. ఆళ్లెవరూ కాదు. గుడి దగ్గర అడుక్కునే బిచ్చగాడు. వాడ్నిచూసి ‘భవ్వు’ అనకుండా ఉండలేక ‘భవ్వు’ మంటున్నా. మీ కుక్కలకిదేం బుద్ధి. బిచ్చగాళ్లనూ, రోడ్డుమీద ప్లాస్టిక్‌ సీసాలు, పేపర్లూ కవర్లూ ఏరుకునే వాళ్లనూ చూస్తే అస్సలు సహించరు అంది డాంకీ. అవును. మాకు వాళ్లు దొంగల్లా కనిపిస్తారు మరి. అడుక్కునే వాళ్లందరూ దొంగలేనా? ఎన్నికలప్పుడు ఓట్లు అడుక్కునే వాళ్లూ దొంగలేనా? ఆళ్లూ దొంగలే ఈళ్లూ దొంగలే. వాళ్లని చూసి అరవలేం, కనుక వీళ్లనుచూసి ఆరుస్తాం. అసలు మన ఘనమైన దేశంలో దొంగలేతప్ప దొరలే తప్ప బిచ్చగాళ్లు ఉండరుగాక ఉండరు. బిచ్చగాళ్ల వేషంలో ఉండేవాళ్లంతా దొంగలే అంది డాగీ. ఆ మాట ఎలా అనగలవు. పాపం నిజంగానే తిండికి వాచిపోయిన ముఖాలెన్నిలేవు? ఎలా ఉంటాయి. మన దేశం ప్రపంచ దేశాలలో ‘అయిదవది’ అంటున్నారు. అయిదుదాకా లాక్కువచ్చిం దాన్ని ‘మూడు’ని చేస్తామంటున్నారు. ఇంత గొప్ప దేశంలో బిచ్చగాళ్లసలు ఉంటారా? ఉండరు గాక ఉండరు? ఉంటేగింటే దొరల వేషంలోనే బెగ్గర్‌ కాస్ట్యూమ్‌లో బిచ్చగాళ్లు గానో ఉంటారంతే అంటూ ‘భవ్వు’ రాగం అందుకుంది మళ్లీ డాగీ. ఏమరుస్తావు లెద్దూ! వాడెప్పుడో రోడ్డెక్కేడు అంటూ అరుగెక్కాడు అబ్బాయి. డాగీ అరుపు ఆపి అబ్బాయి చుట్టూ ఓ రౌండేసి తన జాగాలో కూచుంది. సాయంత్రం అయింది గదా కాసేపు ప్రశాంతంగా కళ్లు మూసుకుందామనుకుంటే ఈ గ్రామసింహం ‘భౌభౌ’ రాగం ఎత్తుకుంది అంది డాంకీ. అక్కడికి ఈ ఊళ్లో నేనొక్కడ్నే అరుస్తు న్నట్టు దేశం నిండా అరుపులే! తాట తీసేవాళ్లు, నాలుక కోసేవాళ్లు అరిచే అరుపుల కంటేఎక్కువేం కాదు మాకుక్కల అరుపులు అంది డాగీ. అరిచే కుక్కలూ, మనుషులూ కరిచేదే లేదు కానీ తమ్ముడూ నీ సంగతిచెప్పు. ఈ ఎన్నికలకయినా నీకు ‘అచ్ఛేదిన్‌’ వచ్చేది ఉందంటావా? అంది డాంకీ. చచ్చేదిన్‌ కంటే ముందు అచ్ఛేదిన్‌ చూస్తానో లేదో కానీ కొత్త సంవత్సరం అయితే వస్తున్నది అన్నాడబ్బాయి. ఆ వచ్చేది కొత్త సంవత్సరం అయితే వస్తున్నది అన్నాడబ్బాయి. ఆ వచ్చేది ఏ సంవత్సరం ‘బ్రో’ అనడిగింది డాగీ. దాన్ని ‘క్రోధి’ అంటారు. క్రోధి అంటే కోపిష్టిది అని అర్థం అని వివరించాడు అబ్బాయి. అనుకుంటూనే ఉన్నా పేపర్లనిండా మన నేతల కోపం కట్టలు తెంచుకుంటున్నది. కోపం కారణంగా నాలుకలు అన్ని హద్దులూ మర్చిపోతున్నవి. ఇక ఈ కోపగొండి ఏడాదంతా విశ్వా మిత్రులూ, దుర్వాసులూ విజృంభిస్తా రన్నమాట అంది డాంకీ. తన కోపమే తన శత్రువు అనే పద్యం అందరికీ కంఠతా వచ్చేట్టు చెయ్యాలి.ఆ సంగతి వదిలెయ్యి. ఎన్నికలయ్యాక అంతా మంచే జరుగుతుందంటు న్నారు. పాంచ్‌ న్యాయ్‌ పచ్చీస్‌ గ్యారంటీ కరపత్రాలు ఇంటింటికీ పంచి ఘర్‌ ఘర్‌ గ్యారంటీని గ్యారంటీగా ఇస్తున్నారు అంది డాంకీ. అయిన దేమో అయినది ఇక లక్షల్లో ఉద్యోగాలంటున్నారు. ఈ సారి పేపరు లీక్‌ కాకుండా ఉంటే, కోర్టులు అడ్డకాలు వెయ్యకుండా ఉంటే నీకు ఉద్యోగం గ్యారంటీ ‘బ్రో’ బాగా చదివి, దేనికైనా రెడీగా ఉండు అంది డాగీ. రాతా గీతా సరిగ్గాలేక ఇలా ఉన్నావు కానీ ‘బ్రో’ నువ్వు చాలా ‘స్మార్ట్‌ గురూ’ అనాలి నిన్ను. అయితే అన్నా నేనడుగుతాను చెప్పు మధ్యపాన నిషేధం ఏమైంది? అంది డాగీ యూపీఎస్‌సీ మెంబర్లా ముఖం సీరియస్‌గా పెట్టి. మద్యపాన నిషేధం నిషేధించబడిరది. మద్యం లేకుంటే సర్కార్లు నిలబడవు. మద్యం పాలసీ ముఖ్యమంత్రిని కూడా జైలుపాలు చెయ్య గలదు. బెల్టు షాపులు గవర్నమెంటు షాపులుగా మార్చ వచ్చు. కొత్త పేర్లూ, బ్రాండ్లూ తాగుబోతుల్ని ‘చెడ్డీ’ మీద నిలబెట్టగలవు. ఇలా చెప్పు కుంటూ పోతుంటే మధ్యలో అందుకుంది మరో సభ్యుడిలా డాంకీ. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఎందుకు అందడంలేదు. ఉన్నడబ్బంతా ఉచితాలకు ఖర్చుపెట్టే ప్రభుత్వాలు ముందు ముందు జీతాలు, పెన్షన్లూ ఇవ్వలేక ఉద్యోగులనే, పనికి ఇంతని వసూలు చేసుకో మనే పరిస్థితి రావచ్చు అని జవాబిచ్చాడు అబ్బాయి. బాగా చెప్పావు కానీ దీనికి చెప్పు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర ఏమిటి? కాలం మారింది. ప్రభు త్వాలు ప్రతిపక్షాలను ‘హాంఫట్‌’ అని మాయం చేసే పనికి పూనుకుంటు న్నవి. బెల్లం చుట్టూ ఈగల్లా అధికారం ఎక్కడ ఉందో అక్కడికే చేరు కుంటున్నారు కొందరు స్వార్థ రాజకీయ నాయ కులు. ప్రతిపక్షాలే లేని నాడు వాటి పాత్రా లేద గోచీ లేదు అన్నాడు అబ్బాయి. చివరగా నాదో ప్రశ్న దీనికి జవాబు చెప్తే ఉద్యోగం గ్యారం టీగా వస్తుంది అంది డాగీ. ప్రత్యేక హోదా గురించయితే అడక్కు. ఏ కేసులూ తలమీద లేని నాయ కుడు ఏలికైతే తప్ప అది సాధ్యం కాదు అన్నాడబ్బాయి. అదేం కాదు. ఈజీ క్వశ్చిన్‌. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని ఏది? ఇది ఈజీ క్వశ్చిన్‌ కాదు. ఉద్యోగం ఇవ్వకుండా పంపే జటిలమైన ప్రశ్న. అంతూ లోతూ తెలీని ప్రశ్న తేలని ప్రశ్న. బేతాళ కథలో విక్ర మార్కుడికి కూడా దీనికి జవాబు తెలియదు. పొద్దుపోయింది వస్తానంటూ అరుగుదిగాడు అబ్బాయి. డాగీనైతే యేం? జవాబు తెలీని ప్రశ్న అడగగలిగాను అంది డాగీ హుశారుగా!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img