Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ప్రమాదంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం

టి.వి.సుబ్బయ్య

చరిత్రలో మానవాళి క్లిష్ట దశలో పయనిస్తోంది. శాంతి, పురోగతి, స్వేచ్ఛ, సామరస్యం, మానవజాతి మనుగడ కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలు తప్పనిసరి. అయితే ప్రపంచంలో అనేక దేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థల నుంచి ఇటీవల కాలంలో నియంతృత్వం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. వీటిలో తేడాలున్నాయి. ఉదాహరణకు భారతదేశ ప్రజాస్వామ్యంలో నియంతృత్వం కొనసాగుతోంది. గత పదేళ్ల కాలంలో నియంతృత్వం వైపు క్రమంగా నడుస్తోంది. అన్ని వ్యవస్థలు, విలువలు దిగజారిపోతున్నాయి. ఒక మతం ఆధారంగా నియంతృత్వ పాలన కావాలని కేంద్ర పాలకులు కోరుకుంటున్నారు. ఏకవ్యక్తి పాలన కొనసాగుతోంది. ఆధునిక ప్రపంచంలో ప్రజాస్వామ్యం స్థానే నియంతృత్వ వ్యవస్థ తిరోగమనం వైపు వెళుతోంది. మత సామరస్యం విచ్ఛిన్నం చెందుతోంది. నియంతృత్వ దేశాలన్ని ఫాసిజం వైపు పరుగెడుతున్నాయి. ప్రజాస్వామ్యం కోరుకుంటున్న శక్తులు బలహీనపడు తున్నాయి. శాంతిని, సామరస్యతను కోరుతున్న శక్తులు బలహీనపడుతూ ప్రతిఘటించలేక పోతున్నాయి. భారతదేశంలో పరిస్థితి అర్థ నియంతృత్వంలో ఉందని అనేకమంది చరిత్రకారులు, మేధావులు, సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మతం ఆధారంగా ఏర్పడిన దేశాలు ఎల్లవేళలా సంఘర్షణలు, అంతర్వ్యుద్ధాలలో మనుగడ సాగిస్తున్నాయి. అనేక కారణాలు, పరిణామాల వల్ల సామ్రాజ్యవాద దేశాలు ప్రపంచం పై పెత్తనం చెలాయి స్తున్నాయి. మతాలు, జాతుల మధ్య నిరంతరం అంత: ఘర్షణలు సాగుతు న్నాయి. భారతదేశంలో మెజారిటీ మత ప్రజల అండగా సర్వ వ్యవస్థలు వ్యక్తి పాలనలో భ్రష్టు పడుతున్నాయి. భారతదేశం ప్రజాస్వామ్యం క్షీణించిందని స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌ నుంచి పనిచేస్తున్న విడెమ్‌ సంస్థ ‘‘ప్రజాస్వామ్య రిపోర్టు 2024 విశ్లేషించింది. కేవలం ఎన్నికలు నిర్వహించినంత మాత్రాన అట్టి దేశంలో ప్రజాస్వామ్య సమాజం నెలకొని ఉందని చెప్పడానికి వీలులేదు. పౌర సమాజంలో అన్ని మతాలకు, జాతులకు శాంతియుత జీవనం ఉండాలి. జన్మించిన ప్రతివాడికి స్వేచ్ఛా జీవనం అవసరం. కానీ ఇవి రోజురోజుకు దిగజారిపోతున్నాయి. వాక్‌ స్వాతంత్య్రం తప్పనిసరి. దానికీ సంకెళ్లు పడుతున్నాయి. ప్రతిపక్ష ముఖ్యమంత్రులూ అన్యాయంగా జైళ్ల పాలవుతున్నారు. మేధావులను జైళ్ల పాలుచేసి విచారణ కూడా లేకుండా వేధిస్తున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ఎన్నికల బాండ్లను పథకాన్ని ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని ధిక్కరించిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏక వ్యక్తి పాలనలో ఇలాంటివి సాధారణం. ఎన్నికల బాండ్లు నల్ల ధనంతో కొనుగోలు చేశారు. ఇది పరస్పరం ఇచ్చిపుచ్చు కోవడమేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎవరితో సంప్రదించకుండా పెద్ద నోట్ల రద్దు, కరోనా ప్రారంభ దశలో లాక్‌డౌన్‌ ప్రకటన తదితర అనేక నిర్ణయాలు నియంతలు మాత్రమే చేసే పనులు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగవు. ప్రజలు ఎన్నుకున్న చట్ట సభలలో చర్చించి నిర్ణయిస్తే దాన్ని ప్రజాస్వామ్యమని చెప్పవచ్చు. తూర్పు ఐరోపా, ఆసియా దేశాలు ప్రజాస్వామ్యం నుంచి నియంతృత్వం వైపు పరుగెడుతున్నాయి. ప్రపంచ జనాభాలో 5.7 బిలియన్‌ల ప్రజలు నియంతృత్వ దేశాల్లో నివసిస్తున్నారు. పదేళ్ల క్రితం కంటే నేడు నియంతృత్వంలోకి జారిన ప్రజలు 48 శాతం పెరిగారు. దాదాపు 60 దేశాలలో 2024 లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 23 దేశాల్లో కేవలం ఎన్నికల ప్రజాస్వామ్యం నెలకొన్నది. ఉదాహరణకు భారతదేశం సైతం ఎన్నికలు నిర్వహణ ప్రజాస్వామ్య దేశంగా పరిగణించాలి. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు వీలవుతుందని కర్నాటకకు చెందిన బీజేపీ ఎంపీ ఒకరు అసలు విషయం వెల్లడిరచారు. ఎల్‌సాల్వడార్‌, ఇండియా, మారిషస్‌లలో ప్రజాస్వామ్యం వేగంగా నియంతృత్వ వ్యవస్థలోకి వెళ్లడానికి తహతహలాడుతున్నాయి. 2024 లో 31 దేశాల్లో ప్రజాస్వామ్య స్థాయిలు దిగజారుతున్నాయి. బ్రిటీష్‌ పాలన నుండి స్వాతంత్య్రాన్ని సాధించడానికి సుదీర్ఘ కాలం భారతదేశ ప్రజలు దీర్ఘకాలం మహత్తర పోరాటం చేశారు. ఈ పోరాటంలో అనేక మంది తమ జీవితాలను అంకితంచేసి ప్రాణ త్యాగం చేశారు. మహత్తర పోరాటానికి నాయకత్వం వహించిన మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌నెహ్రు లాంటి నేతలను, స్వాతంత్య్ర పోరాటం ఎరుగని నేటి పాలకులు ఏ మాత్రం గౌరవించడం లేదు. వీరు రాజ్యాంగాన్ని, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని, ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారు. వీటిన్ని రద్దు చేసి నియంతృత్వంలోకి వెళ్లిపోయేందుకు అనేక ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలు తీసుకుంటున్నారు. రాజ్యాంగ విలువలకు ఈ ప్రభుత్వం ఎప్పుడో తిలోదకాలిచ్చింది. బాబ్రి మసీదు వివాదం పైనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గగోయ్‌ బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. పదవీ విరమణ తర్వాత గగోయ్‌కి రాజ్యసభ పదవి దక్కింది. గుజరాత్‌లో కోర్టులు బీజేపీకి అనుకూలంగా తీర్పులిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. న్యాయశాఖను, దర్యాప్తు సంస్థలను, దాదాపు పూర్తిగా మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు. 2014 లో మోదీ అధికారంలోకి రాగానే దర్యాప్తు సంస్థలను, పోలీసు వ్యవస్థను, న్యాయ వ్యవస్థను తన అధీనంలోకి తెచ్చుకొనేందుకు వ్యూహాన్ని పన్నారు. కొద్ది కాలంలోనే రాష్ట్రాలకున్న హక్కులలో కొన్నింటిని హరించారు. ముస్లింల చేతుల్లో అధికారం ఉండకూడదని నిశ్చయించుకొని జమ్మూ కశ్మీరుకున్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించేందుకు 370 వ అధికరణను రద్దు చేసి అనుకున్నది సాధించారు. తొలి నుండి నల్ల కుబేరుల నుండి ధనాన్ని సమీకరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆకాంక్ష ప్రకారం పాలన సాగిస్తున్నారు. ఈ డబ్బుతో కర్నాటక, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలను కూల్చివేశారు. చాలా రాష్ట్రాలలో ఎన్నికల ద్వారా బీజేపీ గెలవలేదు. ధనబలం ఉపయోగించి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రజలకిచ్చి వాగ్దానాలను ఇప్పటికీ అమలుచేయలేదు. పెద్ద నోట్లు రద్దు ద్వారా నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకునేందుకు ఆశ్రిత సంపన్నులకు ప్రయోజనం చేకూర్చారు. అనేక అంశాలలో రాజ్యాంగాన్ని ఖాతరు చేయకుండా నియంతృత్వ లక్షణాలను ప్రదర్శించారు. ఈ ధోరణి నేడు మరింతగా ముదిరింది. ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలను సృష్టిస్తానని వాగ్దానం చేసిన మోదీ నేడు యువత ఉద్యోగాల కోసం చూడకుండా, ఉద్యోగాలను ఇచ్చేందుకు పరిశ్రమలు పెట్టమని సలహాలిస్తున్నారు. ముస్లింలను, క్రైస్తవులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేందుకు వివిధ వ్యూహాలను రూపొందించారు. ఇందులో భాగంగానే సీఏఏ ప్రవేశపెట్టారు. ముస్లింలను వీలయితే దేశం నుండి వెళ్లగొట్టేందుకు వెనకాడరని అనేక సూచనలు కన్పిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img