Monday, May 20, 2024
Monday, May 20, 2024

శాస్త్రీయ దృక్పథం, నాణ్యమైన విద్య, మంచి వైద్యం కావాలి!

– జనవిజ్ఞాన వేదిక
విశాలాంధ్ర ధర్మవరం:: శాస్త్రీయ దృక్పథం, నాణ్యమైన విద్య, మంచి వైద్యం కావాలని,
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 (ఏ.హెచ్) ప్రకారం సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాలని, ఎన్నికల్లో నిలబడిన రాజకీయ పార్టీలు అందుకు తగిన ప్రణాళిక ప్రకటించాలని జనవిజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షుడు డాక్టర్ బషీర్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక సీతారామయ్య జూనియర్ కళాశాలలో జె.వి.వి నాయకులు- పీపుల్స్ మేనిఫెస్టో ను విడుదల చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు దేశం కోసం, భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం,ప్రజల పక్షాన జనవిజ్ఞాన వేదిక పీపుల్స్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ వ్యవహారాలను మతం నుంచి వేరు చేయాలని, సైన్సును,శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించే విధంగా రాబోయే ప్రభుత్వాలు ఉండాలన్నారు.నీటిని అరుదైన ప్రజల సంపదగా పరిగణిస్తూ జాతీయ నీటి విధానాన్ని రూపొందించాలని, జీవించే హక్కులో భాగంగా నీటి హక్కును గుర్తించాలని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం శుభ్రమైన తాగునీరు దేశంలోని అన్ని ఇళ్ళకి సరఫరా చేయాలన్నారు.
సీతారామయ్య మాట్లాడుతూ నూతన విద్యా విధానం (ఎన్. ఈ.పి) ఉపసంహరించుకోవాలని, విద్యా, వైద్య రంగాలకు జిడిపిలో 9 శాతం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ నుంచి కేటాయించాలని మేనిఫెస్టో డిమాండ్ చేస్తుందన్నారు.
ఆహార హక్కుతో పాటుగా ఆరోగ్యము విద్య ,ఉపాధి, సామాజిక రక్షణ పర్యావరణ పరిరక్షణతో పాటు ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీలను అమలు చేసేందుకు తమ కార్యచరణ ప్రకటించాలన్నారు.
జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు మాట్లాడుతూ
విశాఖ ఉక్కు ప్రైవేటీరణ చర్యలు ఉపసంహరించుకోవాలని, రాజ్యాంగ పరిరక్షణ, ఎన్నికల కమిషన్, సీబీఐ, ఈడి, లాంటి సంస్థలను నిష్పక్షపాతంగా , స్వతంత్రంగా పనిచేసేలా బలమైన చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
శాస్త్ర-సాంకేతిక రంగాలలో దేశీయ పరిశోధనలకు జిడిపిలో కనీసం 3 శాతానికి ప్రభుత్వ కేటాయింపులు పెంచాలని, ఈ మేనిఫెస్టోను విస్తృతంగా ప్రచారం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో జెవివి నాయకులు డి.చంద్రశేఖర్ రెడ్డి , నరేంద్ర బాబు, లోకేష్, పర్వతయ్య, సురేష్, ఖలందర్, ప్రసాద్, తమ్ముడు నరేంద్ర, నారపరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img