Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

దిగ్విజయ్‌ సింగ్‌ నిరసనాస్త్రం

నిరంతరం వార్తల్లో ఉండే చాకచక్యం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ కు ఉన్నట్టుగా ఎవరికీ లేదేమో. ఆయన రెండు దఫాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ గఢ్‌ నుంచి లోకసభకు పోటీ చేస్తు న్నారు. మూడవ దశలో ఆ నియోజకవర్గంలో పోలింగ్‌ జరగవలసి ఉంది. శుక్రవారం నుంచి నామినేషన్లు ప్రారంభం అవుతాయి. దిగ్విజయ్‌ సింగ్‌ మొదటి నుంచి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అవి చిప్‌ ఆధారితంగా పని చేస్తాయి కనక వాటిని తారుమారు చేయడం, మాయ చేయడం సాధ్యమేనని ఆయన ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. ఎలక్ట్రానికి ఓటింగ్‌ యంత్రాలకు బదులు పాత పద్ధతిలో బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఎన్నికలు జరిపించాలని సుప్రీంకోర్టు న్యాయ వాదుల దగ్గర్నుంచి అనేక మంది రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. కానీ ఎన్నికల కమిషన్‌ మాత్రం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ద్వారానే పోలింగ్‌ జరిపించాలన్న కృత నిశ్చయంతో ఉంది. దీనికి దిగ్విజయ్‌ సింగ్‌ ఓ మంత్రం కనిపెట్టారు. అదేమిటంటే తాను పోటీ చేయనున్న రాజ్‌ గఢ్‌ నుంచి ఏకంగా 500 మందితో నామినేషన్లు వేయించడం. అంత మంది ఒక నియోజక వర్గంలో పోటీ చేస్తే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ద్వారా పోలింగ్‌ నిర్వహించడం సాధ్యం కాదు. అప్పుడు తప్పని సరిగా ఇదివరకటి పద్ధతిలో బ్యాలెట్‌ పత్రాలను వినియోగించవలసిందే. ఆ బ్యాలెట్‌ పత్రం కూడా చాలా పొడవుగా తయారవుతుంది కనక ఒక పుస్తికలా ప్రచురించాల్సిందే. ఆ పుస్తికను అంతా పరిశీలించి ఓటరు ఓపికగా తాను ఓటు వేయదలచుకున్న అభ్యర్థి పేరు, ఎన్నికల చిహ్నం ఎక్కడున్నాయో వెతికి పట్టుకుని ఓటు వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్‌ పత్రాన్ని పుస్తిక రూపంలో ముద్రించడానికి ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేయడం సాధ్యం కావచ్చు. కానీ జనం ఓటు వేయడానికి ఎక్కువ సమయం పడ్తుంది. అది సమస్యగా మారవచ్చు. ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం ఈ దశలో సాధ్యం కాదు. ఎందుకంటే ఒక సారి ఎన్నికల కార్యక్రమం ప్రకటించిన తరవాత పోలింగ్‌ కేంద్రాలను మార్చడం కుదరదు. 384 మంది అభ్యర్థుల దాకా ఉంటే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు వినియోగించవచ్చు అంటున్నారు. కానీ దిగ్విజయ్‌ సింగ్‌ ఆలోచిస్తున్నట్టు 500 మంది పోటీ చేస్తే బ్యాలెట్‌ పత్రాల పద్ధతి అనుసరించవలసిందే. అప్పుడు ఎన్నికల కమిషన్‌ కు మరో సమస్య కూడా ఎదురవుతుంది. పోటీలో ఉన్న వందలాది మంది అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై కన్నేసి ఉంచవలసి వస్తుంది. తమ సమస్యలను జనం దృష్టికి తీసుకు రావడానికి వందల సంఖ్యలో ఎన్నికల్లో పోటీ చేసిన ఉదంతాలు ఇంతకు ముదూ ఉన్నాయి. ఫ్లోరిన్‌ బెడద కారణంగా మంచి నీళ్ల సమస్యను జనం దృష్టికి తీసుకు రావడానికి 1996లో నల్లగొండలో 480 మంది పోటీ చేశారు. అలాగే 2019 ఎన్నికల్లో నిజామాబాద్‌ నియోజక వర్గం నుంచి 180 మంది పోటీ చేశారు. కర్నాటకలోని బెల్గాం ను మహారాష్ట్రలో విలీనం చేయాలని కోరుతూ 456 మంది పోటీ చేసిన పూర్వోదంతమూ ఉంది. ఏమైతేనేం గత డిసెంబర్‌ లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌ లో కాంగ్రెస్‌ పరాజయం తరవాత దిగ్విజయ్‌ సింగ్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. 2003 నుంచి వీటికి తాను వ్యతిరేకమే అంటున్నారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను మాయ చేస్తే మన ప్రజాస్వామ్యం కాస్తా వృత్తిరీత్యా ఎలక్ట్రానిక్‌ పరికరాలమీద దాడిచేసే వారి దయా దాక్షిణ్యాల అధీనంలో ఉంటుంది అని దిగ్విజయ్‌ వాదిస్తున్నారు. ఇ.వి.ఎం.లు అత్యాధునిక ఓటింగ్‌ పరికరాలన్న మాట నిజమే. సాంకేతికాభివృద్ధిని అడ్డుకోకూడదన్న మాటా వాస్తవమే. కానీ ఇ.వి.ఎం.లను మాయ చేస్తున్నారన్న ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి. ఆ ఆరోపణలను తొలగించవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ మీద ఉంది. కానీ ఎన్నికల కమిషన్‌ ఆ పని చేయకుండా వితండవాదానికి దిగుతోంది. వాటిని గట్టిగా వ్యతిరేకించే వారు ఉన్నట్టే గట్టిగా సమర్థించే వారూ ఉన్నారు. కాని అవి లోపరహింతంగా ఉండేట్టు చేయాలన్న సంకల్పం ఎన్నికల కమిషన్‌ కు ఉన్నట్టు లేదు. ఇలాంటి స్థితిలోనే దిగ్విజయ్‌ సింగ్‌ లాంటి వారికి వందల మంది చేత పోటీ చేయించి బ్యాలెట్‌ పద్ధతి అనుసరించడం అనివార్యం చేయాలన్న ఆలోచన రావ డంలో ఆశ్చర్యం లేదు. దిగ్విజయ్‌ సింగ్‌ చేసే వ్యాఖ్యలు తరచుగా వివాదాలకు తావిస్తాయి. కాంగ్రెస్‌ నే ఇరుకున పెట్టేలా ఎన్నో సార్లు ఆయన మాట్లాడారు. కానీ ఆయన నిరంతరం ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను, స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌ మెంట్‌ (సిమి) ను నిరంతరం వ్యతిరేకిస్తుంటారు. ఈ రెండు సంస్థలు దేశ ఐక్యతకు భంగం కలిగిస్తాయంటారు. ముంబై తీవ్ర వాద దాడులలో ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు సంబంధం ఉందంటారు. 2011లో బాట్లా హౌజ్‌ ఎన్‌ కౌంటర్‌ సందర్బంÛగా దిగ్విజయ్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీనే ఇరుకున పెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులు, ఒక పోలీసు అధికారి మరణించారు. ఇది బూటకపు ఎన్‌ కౌంటర్‌ అని దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించా లన్నారు. అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఈ డిమాండును అంగీకరించలేదు. కాంగ్రెస్‌ సైతం దిగ్విజయ్‌ అభిప్రా యాలతో ఏకీభవించలేదు. దిగ్విజయ్‌ సింగ్‌ శంకరాచార్య స్వామి స్వరూపానంద శిష్యుడు. ఆయన రాజ్యసభ టీవీ కార్యక్రమాల ప్రయోక్త అమృత రాయ్‌ తో ప్రేమలో పడ్డారు. 2015లో 68వ ఏట ఆమెను పెళ్లి చేసుకున్నారు. దిగ్విజయ్‌ ఒక్కో సారి ఇబ్బందికర వ్యాఖ్యలు చేయగల సమర్థుడు. 2013లో మంద్‌ సౌర్‌ నుంచి ఎన్నికైన కాంగ్రెస్‌ ఎంపీ మీనాక్షీ నటరాజన్‌ ను చొక్కపు బంగారం అన్నారు. ఈ మాటల వాచ్యార్థం ఏమైనా ఆయన ఉద్దేశం మాత్రం ఆమె లైంగికంగికతను ప్రస్తావించడమే. వివాదాలు రేకెత్తించి వార్తల్లోకెక్కడం దిగ్విజయ్‌ ప్రత్యేకత. 2019లో ఆయన బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ చేతిలో ఓడిపోవడమూ సంచలనకర వార్తే.
అనన్య వర్మ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img