Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

భగత్‌ సింగ్‌ కేసువిచారణ -కొన్ని వాస్తవాలు!

డి. సోమసుందర్‌
విప్లవాదర్శాల కోసం పిన్నవయసులోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన భగత్‌ సింగ్‌ , శివరామ్‌ రాజ్‌ గురు, సుఖదేవ్‌ థాపర్‌ , భారతీయులందరికీ అత్యంత ఆరాధ్యనీయులు. మన యువతకు స్ఫూర్తినిచ్చే జాతీయ హీరోలు. లాహోర్‌ జైలులో 1931 మార్చి 23న ఆ ముగ్గురు విప్లవకారులకు ఉరిశిక్ష అమలు అయింది. అది జరిగి తొమ్మిది దశాబ్దాలు గడిచింది. అయినా వారి అమరత్వాన్ని స్మరించుకోవడాన్ని ఒక పవిత్రకర్తవ్యంగా మనదేశ ప్రజలు భావిస్తున్నారు. కానీ వారిపై నమోదైన కేసుల గురించి, విచారణ గురించి, ఉరిశిక్షకు దారితీసిన పరిస్థితుల గురించి వివరాలు చాలామందికి తెలియదు. ఇటీవల కాలంలో కేసుకు సంబంధించిన అనేక పత్రాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్థాన్‌ ప్రభుత్వం కూడా భగత్‌ సింగ్‌ లేఖలను, రచనలను ఇటీవల లాహోర్‌ మ్యూజియంలో భద్రపరిచి సందర్శకులకు అందుబాటులోకి తెచ్చింది. అనేక మంది పరిశోధకులు ఆయా పత్రాలను పరిశీలించి కేసుల విచారణ క్రమాన్ని సాధారణ పాఠకులకు అందుబాటులోకి తెచ్చారు.
భగత్‌ సింగ్‌ పై రెండుకేసులు నమోదయ్యాయి. ఒకటి న్యూదిల్లీలోని సెంట్రల్‌ అసెంబ్లీలో బాంబులు విసిరిన కేసు కాగా బ్రిటిష్‌ పోలీసు అధికారి జాన్‌ శాండర్స్‌ను కాల్చిచంపిన కేసు రెండోది. లాలా లజపత్‌ రాయ్‌ మృతికి ప్రతీకారంగా విప్లవకారులు లాహోర్‌లో జాన్‌ శాండర్స్‌ను కాల్చిచంపారు. మొదటి కేసులో విప్లవకారులకు జీవితఖైదు మాత్రమే పడగా రెండో కేసులో ఉరిశిక్ష పడిరది. భగత్‌ సింగ్‌, ఆయన సహచర విప్లవకారుడు బటుకేశ్వర దత్‌ 1929 ఏప్రిల్‌ 8 వ తేదీన న్యూదిల్లీలోని సెంట్రల్‌ అసెంబ్లీలో బాంబులు విసిరి, కరపత్రాలు వెదచల్లారు. విప్లవం వర్ధిల్లాలి, శ్రామికవర్గం వర్ధిల్లాలి అంటూ వారు నినాదాలు చేశారు. ప్రజాభద్రతా చట్టం, కార్మిక వివాదాల చట్టం పేరుతో సెంట్రల్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక నిర్బంధ చట్టాలను నిరసిస్తూ , 31 మంది కార్మిక నాయకుల అరెస్టును ఖండిస్తూ వారా చర్యకు పూనుకున్నారు. ఉద్దేశ పూర్వకంగానే పేలుడు సామర్థ్యం తక్కువ ఉన్న బాంబులను వారు విసిరారు. సెంట్రల్‌ అసెంబ్లీలో సభ్యులు కూచున్న బెంచీల వైపు కాకుండా, కావాలని ఖాళీ బెంచీల వైపు బాంబులు వేశారు. బాంబుల మోతతో సెంట్రల్‌ అసెంబ్లీ సభ్యులు, భద్రతా సిబ్బంది చెల్లాచెదురై పరుగులు పెట్టారు. అక్కడి గందరగోళంలో తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ భగత్‌ సింగ్‌, బటుకేశ్వర్‌ దత్‌ తప్పించుకోకుండా అక్కడే నిలబడి పోయారు. పోలీసుల దగ్గరికి వెళ్లి స్వయంగా లొంగిపోయారు. తన దగ్గరున్న ఆటోమేటిక్‌ పిస్టల్‌ ను భగత్‌ సింగ్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఐపీసీి 307, 1888 పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం నేరం చేసినట్లు కేసు పెట్టారు. అవే ఆరోపణలతో ఛార్జ్‌ షీట్‌ వేశారు. సెంట్రల్‌ అసెంబ్లీలో విసిరిన కరపత్రాలలోని చేతిరాత, గతంలో జాన్‌ శాండర్స్‌ను హత్య చేస్తామని హెచ్చరిస్తూ వేసిన పోస్టర్లలోని చేతిరాత ఒకే విధంగా ఉందని పోలీసులు గమనించారు. భగత్‌సింగ్‌ అప్పగించిన ఆటోమేటిక్‌ పిస్టల్‌తోనే శాండర్స్‌ హత్య జరిగిందని కూడా పోలీసు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దాంతో త్వరితగతిన రెండు కేసుల కేసు విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది.
1929 మే 7 వ తేదీన సెంట్రల్‌ అసెంబ్లీ బాంబు కేసు విచారణ ప్రారంభం అయ్యింది. బ్రిటిష్‌ జడ్జి పీబీ పూల్‌ విచారణ నిర్వహించారు. రాయ్‌ బహదూర్‌ సూర్యనారాయణ ప్రాసిక్యూషన్‌ తరపున, జాతీయోద్యమ నాయకుడు, అప్పటి కాంగ్రెస్‌ అగ్రనాయకుల్లో ఒకరైన అసఫ్‌ అలీ విప్లవకారుల తరపున వాదనలు వినిపించారు. నెలరోజుల వ్యవధిలోనే మెజిస్ట్రేట్‌ కేసును సెషన్స్‌ కోర్టుకు నివేదించారు. సెషన్స్‌ కోర్టు జడ్జి లియోనార్డో మిడిల్‌ టన్‌ జూన్‌ మొదటివారంలో విచారణ ప్రారంభించారు. ప్రాసిక్యూషన్‌ దాదాపు ఆరువందల సాక్ష్యాలను సేకరించింది. కొందరు సహచరులు అప్రూవర్లుగా మారి ప్రాసిక్యూషన్‌కు సహకరించారు. ‘‘చక్రవర్తికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా సాయుధ తిరుగుబాటు చేసినట్లు, ప్రభుత్వ అధికారులను, పాలితులను హత్య చేసేందుకు, గాయపరచడానికి ప్రయత్నించినట్లు’’ నేరారోపణ చేసింది. అయితే భగత్‌ సింగ్‌ ఉద్దేశం వేరు. కోర్టు విచారణ సందర్భంగా తాము చేసే వాదనలు పత్రికల ద్వారా ప్రజల్లోకి వెలతాయని, విప్లవం పట్ల ప్రజల్లో సానుకూలత రావడానికి తమ వాదనలు వినియోగ పడతాయని భగత్‌ సింగ్‌ భావించారు. అందుకు తగినట్లుగా ఆయన కోర్టులో ఒక ప్రకటన చేశారు. ‘‘తాము పెద్దగా చదువుకోలేదని, మంచి భాషలో విన్నపాలు చేసే భాషా సామర్థ్యం తమకు లేదని, అందువల్ల భాషా దోషాలను బట్టి తమ వాదనలను తప్పుగా అర్థం చేసుకోవద్దని, తమ ఉద్దేశాలను అర్థం చేసుకుని వాటి ఆధారంగా న్యాయం చేయాలని’’ భగత్‌ సింగ్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘చెవిటి ప్రభుత్వానికి గట్టిగా వినిపించాలనే’’ ఉద్దేశంతో తాము బాంబులు వేశామని ఎవరినీ చంపడం తమ ఉద్దేశం కాదని’’ భగత్‌ సింగ్‌ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ‘‘తమకు అత్యంత ప్రీతిపాత్రులైన మోతీలాల్‌ నెహ్రూ సహా అనేకమంది జాతీయోద్యమ నేతలు సెంట్రల్‌ అసెంబ్లీ సమావేశంలో ఉండగా వారి ప్రాణాలకు హాని తలపెట్టే చర్యలకు ఎలా పూనుకుంటామని’’ భగత్‌ సింగ్‌ తన ప్రకటనలో ప్రశ్నించారు. ‘‘తమ చర్యలోని నేరాన్ని కాకుండా ఉద్దేశాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని’’ భగత్‌ సింగ్‌ కోరారు.
‘‘బ్రిటిష్‌ పాలన వద్దని పోరాడటం, స్వాతంత్య్రం కావాలని కోరుకోవడం, పీడన నుంచి విముక్తి కావాలని కోరుకోవడం నేరం కాదని అందువల్ల తమకు శిక్ష విధించడం న్యాయం కాదని’’ భగత్‌ సింగ్‌ వాదించారు. దీంతో ప్రాసిక్యూషన్‌ ఏకీభవించలేదు. ప్రాసిక్యూషన్‌ సాక్షులు ఇద్దరు భగత్‌ సింగ్‌ సెంట్రల్‌ అసెంబ్లీలో పిస్టల్‌తో కాల్పులు జరిపినట్లు ఒక తప్పుడు సాక్ష్యం కూడా చెప్పారు. దాంతో సెషన్స్‌ జడ్జి ప్రాసిక్యూషన్‌ వాదనలను ఆమోదిస్తూ భగత్‌ సింగ్‌, బటుకేశ్వర్‌ దత్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. 1929 జూన్‌ లో మొదలైన విచారణ 1930 మార్చి నాటికి ముగిసింది. వారిద్దరినీ వేర్వేరు జైళ్లకు తరలించారు!
లాహోర్‌ కుట్ర కేసు: వారిద్దరూ జైల్లో ఉండగానే 1929 జులై 10 వ తేదీన లాహోర్‌ జైల్లోనే లాహోర్‌ కుట్ర కేసు విచారణ మొదలయింది. తాము నేరస్థులన్న నిర్ధారణకు కోర్టు ముందస్తుగానే వచ్చిందని, అందువల్ల విచారణ వల్ల ప్రయోజనం లేదని భగత్‌ సింగ్‌ భావించారు. విచారణను బహిష్కరించాలని అనుకున్నారు. దాంతో విచారణా ప్రక్రియకు సహకరించలేదు. జైల్లో నిరవధిక నిరాహారదీక్షకు పూనుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుల జైలు కమిటీ కోరినా భగత్‌ సింగ్‌ దీక్ష విరమించలేదు. చివరకు తండ్రి కోరిక మేరకు 1929 అక్టోబర్‌ 5 వ తేదీన 116 రోజుల దీక్షను భగత్‌ సింగ్‌ విరమించారు. 1928 నుంచి విప్లవకారులు ఒక జాతీయస్థాయి విప్లవసంస్థను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేసినట్లు ప్రాసిక్యూషన్‌ పేర్కొన్నది. అందులో భాగంగానే జాన్‌ శాండర్స్‌ను 1928 డిసెంబర్‌ 17 న లాహోర్‌లో కాల్చి చంపారని నేరారోపణ చేసింది. భగత్‌ సింగ్‌ ఆయన సహచర విప్లవకారుల తరపున అసఫ్‌ అలీ తదితరులు వాదించారు. ‘‘తనకు డిఫెన్స్‌ అవసరం లేదని కేసును తానే వాదించుకుంటానని, అందుకు న్యాయనిపుణుల సహాయం తీసుకుంటానని’’ భగత్‌ సింగ్‌ చెప్పారు. అసఫ్‌ అలీ సుఖదేవ్‌ తరపున డిఫెన్స్‌ వాదనలు కొనసాగించారు. అయితే కేసు విచారణ నత్త నడకన సాగింది. ’’కేసు విచారణను వేగవంతం చేయాలని మెజిస్ట్రేట్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ‘‘పోలీసు అధికారులు వేసిన పిటిషన్‌ను లాహోర్‌ హైకోర్టు కొట్టివేసింది. దాంతో 1930 మే 1 వ తేదీన వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ ఒక ఆర్డినెన్సును జారీ చేస్తూ కేసువిచారణ కోసం ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. 1930 మే 5 వ తేదీన ట్రిబ్యునల్‌లో విచారణ ప్రారంభం అయింది. 1930 అక్టోబర్‌ 7 వ తేదీన ట్రిబ్యునల్‌ తీర్పు చెప్పింది. కేసులో విప్లవకారుల సహచరులు ఐదుగురు అప్రూవర్లుగా మారారు. ప్రాసిక్యూషన్‌ ప్రధానంగా అప్రూవర్ల సాక్ష్యాలను రుజువులుగా చూపించి కేసును నిర్మించింది. జాన్‌ శాండర్స్‌ హత్య కేసులో భగత్‌ సింగ్‌ తదితరుల పాత్ర సందేహానికి అతీతంగా రుజువు అయ్యింది. ‘‘దేశంలో విప్లవకారులు 1928 నాటికే ఒక జాతీయస్థాయి విప్లవసంస్థను ఏర్పాటు చేసుకున్నారని, చక్రవర్తికి వ్యతిరేకంగా కుట్రచేసి రాజద్రోహానికి పాల్పడ్డారని, ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేశారని అందులో భాగంగానే జాన్‌ శాండర్స్‌ను కాల్చి చంపారని’’ జడ్జి తన మూడు వందల పేజీల తీర్పులో పేర్కొన్నారు. ముగ్గురికి ఉరిశిక్ష విధించి, మిగిలిన వారికి ద్వీపాంతర యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించారు. శిక్ష విషయంలో గాంధీజీ జోక్యం చేసుకోవాలని చిట్టగాంగ్‌ అయుధాగార దోపిడీ కేసులో విచారణలో ఉన్న ఖైదీలు ఒక విజ్ఞప్తి చేశారు. దానిపై కాంగ్రెస్‌ ఎనిమిది మంది సభ్యులు గల డిఫెన్స్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. వారు శిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రివీ కౌన్సిల్‌ కు అప్పీలు చేశారు. ప్రివీ కౌన్సిల్‌ ఆ వాదనలను తిరస్కరించింది. నిజానికి అప్పీలు అనవసరమని భగత్‌ సింగ్‌ భావించారు. అయితే విచారణ పేరుతో విప్లవభావాలు మరోసారి ప్రజల దృష్టికి వెళతాయని ఆయన భావించినట్లు ఇటీవల వెల్లడైన పత్రాలను బట్టి తేలింది.
గాంధీజీ జోక్యం: లాహోర్‌ కుట్ర కేసులో శిక్షలు రద్దు చేయాలని, విప్లవకారులను విడుదల చేయాలని కోరుతూ దేశవ్యాప్త ఉద్యమం వెల్లువెత్తింది. గాంధీ – ఇర్విన్‌ చర్చల్లో దీన్నొక షరతుగా చేర్చాలన్న డిమాండ్‌ కూడా వచ్చింది. అయితే లక్ష్యాలు, మార్గాలు విషయంలో గాంధీజీకి గల అభిప్రాయాలు, అహింసాయుత పోరాట పద్ధతులకు కాంగ్రెస్‌లో ఉన్న ఆమోదం రీత్యా లాహోర్‌ కుట్ర కేసును చర్చల అజెండాలో చేర్చడానికి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అంగీకరించలేదు.
అదీ కాక ప్రివీ కౌన్సిల్‌లో అప్పీలు తిరస్కారానికి గురయ్యాక రాజకీయ డిమాండ్‌కు ప్రాతిపదిక లేదని కాంగ్రెస్‌ భావించింది. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన పత్రాలను బట్టి ఇర్విన్‌తో చర్చల సందర్భంలో గాంధీజీ అధికారిక అజెండాకు సంబంధం లేకుండా వ్యక్తిగత స్థాయిలో భగత్‌ సింగ్‌ తదితరుల కేసును ప్రస్తావించారని తేట తెల్లం అయ్యింది. భగత్‌సింగ్‌ తదితరుల వ్యక్తిగత హింసా మార్గానికి తాను పూర్తి వ్యతిరేకం అయినప్పటికీ గాంధీజీ ఈ సమస్యను లేవనెత్తడానికి మరో కారణం ఉంది. ‘‘ఏ ఒక్కరినీ ఉరికంబం ఎక్కించడానికి నా అంతరాత్మ అంగీకరించదు, ప్రాణం ఇచ్చింది భగవంతుడే కాబట్టి దాన్ని ఆయన మాత్రమే తీసుకోగలడు’’. భగత్‌ సింగ్‌ తదితరులకు ఉరిశిక్ష వేసిన సందర్భంలో ఆయన మరింత స్పష్టంగా రాశారు. ‘‘భగత్‌ సింగ్‌ తదితర విప్లవకారుల సంగతి అటుంచండి, కఠిన నేరస్తులైన హంతకులు, బందిపోట్లు, అయినా సరే వారిని ఉరి తీయడానికి నేను వ్యతిరేకం, చట్టబద్ధంగా అయినాసరే ఉరి తీసే అధికారం మానవ మాత్రులకు లేదు. ప్రాణం పోసేది, తీసేదీ భగవంతుడే’’ అన్నారు గాంధీజీ. ఇర్విన్‌తో చర్చల సందర్భంగా భగత్‌ సింగ్‌ తదితరుల ఉరిశిక్షను వాయిదా వేయించడానికి గాంధీజీ ప్రయత్నించారు. ముందు వాయిదా వేయిస్తే ఆ తర్వాత శిక్ష తగ్గింపునకు ప్రయత్నించాలని గాంధీజీ భావించారని అప్పటి ఉత్తర ప్రత్యుత్తరాలను బట్టి, సహచరుల రాతలను బట్టి , ప్రభుత్వంలో జరిగిన సంభాషణలను బట్టి అర్థం అవుతుంది . గాంధీ – ఇర్విన్‌ ఉత్తర ప్రత్యుత్తరాలలో, కూడా కనీసం ఐదు సార్లు భగత్‌ సింగ్‌ ఉరిశిక్ష అమలు నిలిపి వేయాలని గాంధీజీ కోరినట్లు నమోదై ఉంది. హింసావాదానికి స్వస్తి చెబుతానని భగత్‌ సింగ్‌ ఒక హామీలేఖ ఇస్తే దాని ఆధారంగా ఉరిశిక్షను రద్దు చేయించాలని గాంధీజీ భావించారని అసఫ్‌ అలీ రాశారు. అలాంటి లేఖ తేవడానికి అసఫ్‌ అలీ, అరుణా అసఫ్‌ అలీ లాహోర్‌ వరకూ వెళ్లారు. జైలు అధికారులు భగత్‌సింగ్‌ను కలుసుకోవడానికి వారికి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాలను అసఫ్‌ అలీ, అరుణా అసఫ్‌ అలీ కూడా అనంతర కాలంలో ధృవీకరించారు. 1931 మార్చిలో గాంధీజీ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కరాచీలో జరిగే కాంగ్రెస్‌ మహాసభ పూర్తయ్యేవరకూ ఉరిశిక్ష అమలును వాయిదా వేయాలని గాంధీజీ ఇర్విన్‌కు సూచించారు. రద్దు కోసం పట్టుపట్టకుండా వాయిదా కోరుతున్న గాంధీజీ వైఖరితో ఇర్విన్‌ కొంత మేరకు డోలాయమాన స్థితిలోపడ్డారు. ‘‘గాంధీజీ ఒత్తిడికి లొంగి ఉరిశిక్ష వాయిదా వేస్తె తాము మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని’’ పంజాబ్‌ గవర్నర్‌ సహా అనేకమంది బ్రిటిష్‌ సైనిక, పోలీసు ఉన్నతాధికారులు ఇర్విన్‌కు హెచ్చరికలు జారీ చేశారని గార్డియన్‌ పత్రికా విలేఖరి రాశారు. దాంతో ఇర్విన్‌ గాంధీజీ విజ్ఞప్తిని తిరస్కరించారు. దానితో మార్చి 24న అమలు చేయాల్సిన ఉరిశిక్ష మార్చి 23 వ తేదీనే అమలు జరిగింది. ఆ తర్వాత జరిగిన కరాచీ కాంగ్రెస్‌ మహాసభలో గాంధీజీకి గాంధీ గో బ్యాక్‌ , గాంధీ డౌన్‌ డౌన్‌, గాంధీ రాజీ – భగత్‌ సింగ్‌ ఉరి లాంటి నినాదాలు ఎదురయ్యాయి.

సీనియర్‌ పాత్రికేయుడు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img