ఇంట్లో గొడవపడి ఆఫీసుకు వచ్చిన ఆఫీసరు ఉద్యోగుల మీద మండిపడేట్టు మండిపడుతున్నాడు. జనం మీద ఆకాశంలో అగ్గిదొర. వేసవి వచ్చిందో లేదో క్రికెట్టు మొట్టమొదటి బాల్నే బౌండ్రీ దాటించిన బ్యాట్స్మన్లా రెచ్చిపోతున్నాడు ఆకాశంలో అగ్గిబరాటా. రోడ్లమీద ఎక్కువగా తిరిగితే కళ్లు తిరగొచ్చునని దొరికిందేదో నమిలి పైనుంచి తలమీద అగ్గిపిడుగు పడకముందే అరుగు ఎక్కింది డాంకీ. సరిగ్గా ఇదే ‘ఫీలింగు’తో ఇంటి దారిపట్టిన డాగీ అంతకుముందే అరుగుఎక్కి ఉండడం వల్ల గాడిదకు ‘హాట్ ఆఫ్టర్ నూన్’ చెప్పింది. ఇక నుంచి తొలిజల్లు కురిసేదాకా ఒంటిపూట బడిపిల్లల మాదిరి వచ్చి అరుగు ఎక్కేయాలి మనం అంది డాంకీ. డాగీ, డాంకీ ఉక్కపోత మరిచిపోడానికి కబుర్లు చెప్పుకుంటుంటే ఒక ఆగంతకుడు చెమట్లు కక్కుతూ ఆగమాగంగా అరుగెక్కేశాడు. ఒకపక్క డాంకీని, మరోపక్క డాగీని చూసి మొదట తడబడ్డా తమాయించుకున్నాడు మరో మార్గమేదీలేక. ఎవరోయ్ నువ్వు! ఏమాపరుగు! ఇది మా అరుగు అని అరిచింది డాగీ. వెనకు కాళ్లకు పని తగిలేనేమో అని, రెడీ అయిపోయింది డాంకీ. అరవకు మీ అరుగేమీ కబ్జా చెయ్యను. రియల్టర్ని కాను, ఏ పార్టీ లీడర్నికాను నేను సత్యాన్ని. సత్యాన్ని అంటే నిజాన్ని, నిజాన్ని అంటే నిప్పుని అన్నాడు సత్యం చెదిరిన జుట్టు, ముఖం నిండా జిడ్డుతో, ఒంటినిండా ఒణుకుతో. సత్యానివా? సత్యానికిక్కడేం పని అంది డాగీ. అసలు సత్యానికి ఈ అరుగుమీదే కాదు, ఈ ఇలాఖాలోనే కాదు, ఈ దేశంలోనే పనిలేదుకదా. సత్యం వధ అంటే సత్యం చచ్చిందనో చచ్చాడనో అన్నారుకదా అంది డాంకీ. మీరనేదేమిటో నాకర్థం కావడంలేదు, నేనుఇంకా మినుకుమినుకు మంటున్న దీపంలా, కొన ఊపిరితో ఉన్నాను. నన్ను చంపడానికి నా వెనక నలుగురు పడ్డారు. వాళ్లనుంచి తప్పించుకుని ఇలావచ్చాను, అన్నాడు సత్యం. మన రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నవి నాలుగు పార్టీలా? అయిదా? అంది డాగీ. ఇప్పుడదవసరమా? పొత్తులో ఉన్న పార్టీలు రెండా మూడా? పంచుకున్న సీట్లెన్ని ఆరా, ఏడా ఇవి అవసరమా ఇప్పుడు అని కోప్పడి నీ చావు కోరి నీ వెనుకపడ్డ వారెవరైతేనేం, నీ ఆపద, మాకర్థం అయింది. నువ్వు ఈ కూలినకొంప లోపలికి వెళ్లి ఏ గోడ పక్కనైనా నక్కిదాక్కో. ఎవరన్నావస్తే మా డాగీ నోరు, నావెనక కాళ్లూ ఊరుకోవులే అంది డాంకీ.సత్యం కొంపలోకి పరుగెత్తాడో లేదో మరొకడు ఒంటి బరువు మోసుకుంటూ అరుగు ఎక్కాడు. ఎవరోయ్ నువ్వు ఏమా పరుగు! ఇది మా అరుగు అంది ఈ సారి డాంకీ. డాగీ మాత్రం వచ్చినవాడ్ని పరీక్షగా చూస్తూ నువ్వు ఇందాక వచ్చిన సత్యానివే కద. లోపలికి వెళ్లి దాక్కోమంటే ఇలా వచ్చావేంటి మళ్లీ అంది. ఇందాక సత్యం వచ్చాడా, నాలాగే ఉన్నాడా. నాపేరు చట్టం. నా వెనకాల న్యాయం కూడా వస్తున్నాడు. మమ్మల్ని చంపేసి దేశాన్ని ఏలుకోవాలని కొందరు మా వెంట పడ్డారు తప్పించుకుని వస్తున్నాం, అంటుండగానే అలసిపోయి వగరుస్తూ అరుగుఎక్కాడు న్యాయం. అరే! ఇతనూ నీలాగేఉన్నాడే అంది డాంకీ. ఇందాకవచ్చిన సత్యం, నేనంటే చట్టాన్ని, ఈ న్యాయం మేమంతా ఒక్కలాగే ఉంటాం. మేమంతా ప్రమాదంలో ఉన్నాం. నన్ను అంటే చట్టాన్ని తమ చుట్టంగా మార్చాలని, ఈ న్యాయాన్ని తొక్కిపెట్టాలని కొందరు దుర్మార్గులు ప్రయత్నిస్తున్నారు అన్నాడు చట్టం. అవును ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడు మా వెంట పడతారు అన్ని పార్టీలవాళ్లు, మమ్మల్ని మేం ప్రాణాలతో ఉంచుకోడానికి ఎంతో శ్రమించాల్సి వస్తున్నది అన్నాడు న్యాయం. సత్యం లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. మీరూ లోపలికి వెళ్లి దాక్కోండి అంది డాగీ. చట్టం, న్యాయం ఇద్దరూ లోపలికి వెళ్లిన వీళ్లంతా ఒకేపోలికతో ఉన్నారు. పాపం ప్రాణభయంతో వొణికిపోతున్నారు అది డాంకీ. ఒకే పోలికతో ఏడుగురు ఉంటారంట కదా వీళ్లు ముగ్గురేకాక ఇంకో నలుగురు వస్తారంటావా అంది డాంకీ పళ్లు బైటపెడుతూ. అది బయటపెట్టిన పళ్లు అలా ఉండగానే పరుగెత్తుకు వచ్చాడు మరొకడు. ఏడుగురంటాము కానీ నేను నాలుగోవాడ్ని .నాపేరు ధర్మం అన్నాడు వచ్చినవాడు, భయంతో వణుకుతున్నవాడు. ధర్మానివా? ఒకేపోలికలో ఉన్నా నాలుగోవాడివా? అంది ఆశ్చర్యంగా డాగీ. వేరువేరుగా వచ్చినా, ఒకేపోలికతో ఉన్నా మేమంతా ఒక్కటే. మాలో ఒక్కర్ని చంపినా అందరం చచ్చిపోతాం. మమ్మల్ని అందర్నీ చంపాలని కొందరు మనుషులు మా వెంట పడుతున్నారు. మమ్మల్ని చంపైనా సరే పదవుల్లోకి రావాలని, మా శవాలపై కుర్చీలు వేసుకుని కూచోవాలని చూస్తున్నారు. వీళ్లకు ఏ నీతీలేదు, ఏ నియమమూలేదు. పదవే వీళ్ల పరమావది. పదువులకోసం సత్యాన్ని చంపేస్తారు. చట్టాన్ని లొంగదీసుకుంటారు. న్యాయాన్ని అవమానిస్తారు. చట్టాన్ని లొంగదీసుకుంటారు. న్యాయాన్ని అవమానిస్తారు. ఇక నా ఊసు అసలు పట్టించుకోరు అన్నాడు ధర్మం. అయితే నువ్వూ వెళ్లిలోపల ఏ గోడ చాటునన్నా దాక్కో అన్నవి డాగీ, డాంకీ. ధర్మా లోపలికి వెళ్లాడు. ఎండ చల్లారుతుందగా అరుగు ఎక్కాడు తెలుగు అబ్బాయ. జరిగిన విషయం అబ్బాయికి చెప్పింది డాంకీ. ఆ నలుగురూ లోపలే క్షేమంగా ఉన్నారా? అన్నాడబ్బాయి. ఏమో మరి వాళ్లని చంపేవాళ్లూ రాలేదు. వాళ్లూ బైటకు రాలేదు అన్నది డాగీ. అయితే లోపలికి వెళ్లి చూద్దాం అన్నాడు అబ్బాయి. అబ్బాయితోపాటు డాగీ, డాంకీ లోపలకి వెళ్లారు. లోపల ఎవ్వరూలేరు. ఏమైపోయారు ఈ నలుగురూ అన్నాడబ్బాయి. మమ్మల్ని చంపాలనుకున్నవారు ముందువైపు నుండి రాకుండా వెనుకనుంచి వచ్చి ఇదిగో ఇక్కడ గొయ్యితీసి పాతిపెట్టి చచ్చామనుకుని వెళ్లిపోయారు అని అరిచారు. సత్యం, చట్టం, న్యాయం, ధర్మం. ఇంతలోతుగా పాతిపెట్టని వీళ్లు ఎప్పుడుపైకి వస్తారో…అంటూ అరుగుదిగి వెళ్లిపోయాడు అబ్బాయి. కొన ఊపిరితో ఉన్న వీళ్లు చావలేదు. కనక ఎప్పుడైనా బైటకు రాగలరంటావా అంది డాగీ. ఆశిస్తే తప్పులేదు నమ్మకం…నమ్మకం…నమ్మకం…అని పాట అందుకుంది డాగీ.