Monday, April 22, 2024
Monday, April 22, 2024

భళా… బల్లెం వీరా..!

టోక్యో : భారత యువ ఆటగాడు నీరజ్‌ చోప్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అఖండ భారతావనిని ఆనందంలో ముంచెత్తాడు. ఒకటి.. రెండు.. మూడు కాదు ఏకంగా వందేళ్ల కలను నిజం చేశాడు. అథ్లెటిక్స్‌లో శతాబ్దం తర్వాత తొలి పతకం అందించాడు. జావెలిన్‌ త్రోలో స్వర్ణ పతకం ముద్దాడాడు. స్వతంత్ర భారతదేశంలో.. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్‌ బింద్రా తర్వాత పసిడి పతకం అందుకున్న వీరుడిగా నిలిచాడు. అందరూ ఊహిస్తున్నట్టుగానే నీరజ్‌ చోప్రా అద్భుతం చేశాడు. ఈటెను విసరడంలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాడు. భారత కీర్తిపతాకను అత్యున్నత శిఖరాలలో రెపరెపలాడిరచేలా చేశాడు. అందరికన్నా మెరుగ్గా ఆడుతూ.. ఈటెను 87.58 మీటర్లు విసిరి నయా చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించాడు. మొదటి అవకాశంలోనే నీరజ్‌ 87.03 మీటర్లు విసిరి ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత తన రికార్డును మరింత మెరుగు పర్చుకున్నాడు. ఈసారి ఈటెను 87.58 మీటర్లు విసిరి పతక పోటీలో ముందుకెళ్లాడు. మూడోసారి మాత్రం 76.79కి పరిమితం అయ్యాడు. ఆ తర్వాత రెండు ఫౌల్స్‌ పడ్డాయి. ఆరో రౌండ్‌లో 84.24 మీటర్లు విసిరాడు. దీంతో పోటీలో పాల్గొన్న అథెట్లలో అత్యధిక మీటర్లు (87.58 మీటర్లు) విసిరిన ఆటగాడిగా నిలిచి స్వర్ణ పతకం ముద్దాడాడు. నీరజ్‌ తర్వాత చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకూబ్‌(86.67 మీటర్లు)కు రజతం దక్కగా, అదే దేశానికి చెందిన మరో అథ్లెట్‌ విటెడ్జ్‌స్లావ్‌(85.44 మీటర్లు)కు కాంస్యం సొంతమైంది. ఆసియా, కామన్వెల్త్‌లో స్వర్ణ పతకాలు ముద్దాడిన నీరజ్‌ ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లోనూ అగ్ర స్థానంలో నిలిచాడు. అతడు 2021 మార్చిలో 88.07మీ, 2018, ఆసియా క్రీడల్లో 88.06మీ, 2020జనవరిలో దక్షిణాఫ్రికాలో 87.87 మీ, 2021 మార్చిలో ఫెడరేషన్‌ కప్‌లో 87.80మీ, 2018, మేలో దోహా డైమండ్‌ లీగ్‌లో 87.43 మీ, 2021 జూన్‌లో కౌరెటనె గేమ్స్‌లో 86.79మీటర్లు ఈటెను విసిరి రికార్డులు సృష్టించాడు.
మోకాలినొప్పితోనే బరిలోకి పునియా
భారత స్టార్‌ రెజ్లర్‌.. బజరంగ్‌ పునియా అంచనాలకు మించి రాణించాడు. తన సత్తాను చాటాడు. మోకాలి నొప్పితో బాధపడుతూనే రింగ్‌లో ప్రత్యర్థిని మట్టి కరిపించాడు. దేశానికి కాంస్య పతకాన్ని అందించాడు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ విభాగంలో ఘన విజయం సాధించాడు. కజకిస్థాన్‌కు చెందిన దౌలెట్‌ నియాజ్‌బెకొవ్‌పై ఏకపక్షంగా విజయ ఢంకా మోగించాడు. 8-0 స్కోర్‌ తేడాతో అతనిపై గెలిచాడు. 2019లో వివాదాస్పదంగా తనపై సాధించిన విజయానికి ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు బజరంగ్‌. ఏ దశలోనూ తన ప్రత్యర్థిని పైచేయి సాధించడానికి అవకాశం ఇవ్వలేదు. ఆటమొదలైన నిమిషాల్లోనే తన వశం చేసుకున్నాడు. కాంస్య పతకానికి సాగించిన పోరులో బజరంగ్‌ రెండు విజయాలు, ఒక ఓటమిని ఎదుర్కొన్నాడు.
అదితి నిరాశ
పతకంపై ఆశలు రేపిన గోల్ఫ్‌ ఈవెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న గోల్ఫర్‌ ఆదితి అశోక్‌ తృటిలో పతకాన్ని కోల్పోయింది. చిట్టచివరి వరకు మూడో స్థానంలో ఉన్న ఆమె.. నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నాలుగో రౌండ్‌ ఆరంభంలో రెండో స్థానంలో నిలిచారు. తోటి ప్రత్యర్థులు విజృంభించడంతో మూడో స్థానానికి పడిపోయారు. ఆ తరువాత తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. చాలా సేపటి వరకు మూడో స్థానంలో కొనసాగారు. అదే సమయంలో న్యూజిలాండ్‌కు చెందిన లైడియా కో దూసుకొచ్చారు. టాప్‌-3లో నిలిచారు. ఈ దశలో తుపాను హెచ్చరికలు జారీ కావడంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం ఏర్పడిరది.
పోటీ ఇచ్చిన న్యూజిలాండ్‌..
ఆట మళ్లీ మొదలైన కొద్దిసేపటికే లైడియా తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకున్నారు. న్యూజిలాండ్‌ గోల్ఫర్‌ లైడియా చివరి బర్డీ సాధించారు. దీనితో ఒక్క పాయింట్‌ తేడాతో ఆదితి అశోక్‌.. నాలుగో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇక తాజా విజయాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తదితరులు విజేతలకు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img