Sunday, April 14, 2024
Sunday, April 14, 2024

బీజేపీ మళ్లీ గెలిస్తే… ఎవర్నీ బతకనివ్వరు

. ప్రధాని కుర్చీ కోసం మోదీ ఎంతకైనా తెగిస్తారు
. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అక్రమం
. కూనంనేని తీవ్ర విమర్శలు

విశాలాంధ్ర`హైదరాబాద్‌: లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిని వదిలేసి, రూ.వంద కోట్ల వ్యవహారంలో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం చూస్తుంటే… ప్రధాని మోదీ తన ప్రత్యర్థుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీజేపీ అనుకున్నన్ని సీట్లు వస్తే ఏ రాష్ట్రంలో ఏ వ్యక్తిని కూడా బతకనివ్వ బోరని… చివరకు సీఎం రేవంత్‌ రెడ్డికి కూడా ముప్పు తలపెడతారని అన్నారు. ఒక హిట్లర్‌, ఒక ముస్సోలిని, ఫాసిజం, నాజీయిజం అన్ని కలబోసిన వ్యక్తి మోదీ అని, అధికారం కోసం ఏమైనా చేసే ఔరంగజేబ్‌ ఆయనలో దాగి ఉన్నాడని విమర్శిం చారు. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చి… శాశ్వత అధ్యక్షుడిగా మారాలని మోదీ భావిస్తు న్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి కుర్చీలో కూర్చునేందుకు ఏ నిమిషం, ఏదైనా చేసేందుకు నరేంద్రమోదీ సిద్ధంగా ఉంటారని విమర్శించారు. ప్రమాదకరమైన ప్రధాని నరేంద్రమోదీపై చట ్టపరంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలలో చైతన్యం రావాలన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకట్‌ రెడ్డి, పశ్యపద్మ, కళవేణ శంకర్‌, బాలనర్సింహా, ఈటీ నర్సింహాతో కలిసి కూనంనేని సాంబశివరావు హైదరాబాద్‌ మఖ్దూం భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ట్ర సమితి సమావేశం వివరాలను వెల్లడిరచారు. లోక్‌సభ ఎన్నికలు, కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహన అంశంపైన సమావేశంలో చర్చించామని, కాంగ్రెస్‌తో సీట్లు సర్దుబాటుపై స్పష్టత వచ్చిన తర్వాత మరోసారి చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటామని కూనంనేని అన్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా సేకరించిన అక్రమ డబ్బుతో ప్రతిపక్షాలను ‘ఇండియా కూటమి’ని ధ్వంసం చేసి, 400 స్థానాల్లో గెలిచేందుకు మోదీ ప్రయత్ని స్తున్నారని, మరోవైపు మేథావులు, సాఫ్ట్‌ నిపుణులతో ఈవీఎం యంత్రాలను ట్యాపింగ్‌ చేసేందుకు .ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఏ ఒక్క బీజేపీ నేతను కూడా అరెస్ట్‌ చేయలేదన్నారు. సిసోడియాను అరెస్ట్‌ చేసినప్పుడే కవితను ఎందుకు అరెస్ట్‌ చేయ లేదని ప్రశ్నిస్తూ… వారి మధ్య అవగాహన ఉన్నం దునే అప్పుడు అరెస్ట్‌ చేయలేదని విమర్శించారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అన్యాయమంటూ… దీనిని ఒక బ్లాక్‌ డేగా కూనంనేని అభివర్ణించారు. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఇద్దరు సీఎంలను ఇప్పటికే అరెస్ట్‌ చేశారన్నారు. ఇండియా కూటమి నుండి బయటకు రావాలని కేజ్రీవాల్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని, అనేక వేధింపులకు గురిచేసినా ఆయన లొంగకపోవడంతోనే అక్రమ కేసులో ఆలస్యంగా అరెస్ట్‌ చేశారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోదీ అణచివేస్తున్నారని మండిపడ్డారు. పెద్ద శాడిస్డు,నియంతగా మోదీ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో మోదీ లాంటి దుర్మార్గ ప్రధానిని చూడలేదన్నారు.
బాండ్ల రూపంలో బీజేపీకి అక్రమ సంపాదన
లాటరీ కంపెనీ, మెయిల్‌ కంపెనీలకు చెందిన అక్రమ సంపాదన బాండ్ల రూపంలో బీజేపీకి చేరాయని కూనంనేని విమర్శించారు. ఈ బాండ్ల విధానాన్ని సీపీఐ. సీపీఎం వ్యతిరేకించాయని గుర్తు చేశారు. దొంగల నుండి దోపిడీదారులు దోచుకున్నట్టు అక్రమ సంపాదనను మోదీ బాండ్ల రూపంలో తీసుకున్నారని దుయ్యబట్టారు. దీనిపై మోదీతో పాటు ఇతరులపైన కూడా కేసుల నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. చట్టబద్ధత రూపంలో బీజేపీ రూ.6వేల కోట్లు తినేసిందన్నారు.
ఆ కేసులో మోదీని వదిలేసిన ఈడీ
బిర్లా, సహారా కంపెనీలపై ఐటీ దాడులు నిర్వహిస్తే, 2013లో అప్పటి గుజరాత్‌ సీఎం నరేంద్రమోదీకి బిర్లా కంపెనీ రూ.24 కోట్లు, సహారా కంపెనీ రూ.40 కోట్లు చెల్లించినట్టుగా ఆధారాలు లభించాయని, దీనిపైన ఈడీ ఎందుకు విచారణ చేపట్టలేదని కూనంనేని ప్రశ్నించారు. ఈ కేసులో మోదీపై ఈడీ కేసు నమోదు చేయకుండా వదిలిపెట్టిందన్నారు. అమిత్‌షా కొడుకు రూ.50 కోట్లతో వ్యాపారం మొదలు పెట్టి, ఒక సంవత్సరంలోనే 16 వేల రెట్లు రూ.80వేల కోట్ల వరకు సంపాందించారని తెలిపారు. సృజనాచౌదరి లాంటి వారు బీజేపీలో చేరగానే పవిత్రులయ్యారా? అని నిలదీశారు.
కమ్యూనిస్టులను కాంగ్రెస్‌ కలుపుకు పోవాలి
ప్రమాదకర బీజేపీని ఎదుర్కొనే క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీపీఐ, సీపీఎంలను కలుపుకుపోవాలని కూనంనేని సూచించారు. దక్షిణాదిలో బీజేపీ రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ సమర్థ పాత్రను పోషించడంలేదని విమర్శించారు. తెలంగాణలో సీపీఐ. సీపీఎం పార్టీలకు లోక్‌ సభ ఎన్నికల్లో ఒక్కసీటులో కూడా సర్దుబాటు జరగలేదని, తమిళనాడు రాష్ట్రాన్ని చూసైనా నేర్చుకోవాలని ఆయన సూచించారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలను బతకనివ్వబోదని, ఇక్కడ సీఎం రేవంత్‌ రెడ్డికి కూడా కష్టమేనని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అక్రమాలను తాము అడ్డుకున్నామని గుర్తు చేశారు.
బీజేపీ ఓటమి ఖాయం: అజీజ్‌ పాషా
సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా మాట్లాడుతూ సీఏఏ తర్వాత ఎంపీఆర్‌ కూడా అమలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ లాంటి వారి అరెస్ట్‌ ప్రభావం ఎన్నికల్లో బీజేపీపై పడుతుందన్నారు. లోక్‌ ఎన్నికల్లో బీజేపీ గెలవబోదన్నారు. మతం ఆధారంగా పౌరసత్వాలను ఇస్తున్నారని విమర్శించారు. ప్రతి రోజూ 350 మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుని వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యం ఖూనీ: చాడ వెంకట్‌ రెడ్డి
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను, ప్రశ్నించే గొంతులను లేకుండా చేస్తోందన్నారు. ఎన్నికల సీట్ల సర్దుబాటు అంశంలో కాంగ్రెస్‌ గౌరవంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని సూచించారు. బీజేపీని ఓడిరచడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని, ఇందుకు అందరినీ కలుపుకునే అంశంలో కాంగ్రెస్‌ పెద్దన్న పాత్రను పోషించాలని తెలిపారు. వామపక్షాలు దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తాయన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img