వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత మూడు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ వర్షంలో తడిసి ముద్దవుతున్నది. గురువారం కూడా భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె.నాగరత్న హైఅలర్ట్ ప్రకటించారు. ఇవాళ రాత్రి గంటకు 5 సెం.మీ. నుంచి 6 సెం.మీ. వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. కాగా, తెలంగాణలో రెండ్రోజులపాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.