— అభివృద్ధిలో ఆదర్శంగా కడ్తాల్ గ్రామపంచాయతీ
–యువ నాయకులకు ఆదర్శంగా ఎల్.ఎన్.రెడ్డి
విశాలాంధ్ర – ఆమనగల్లు ::-లో నూతనంగా ఏర్పడిన కడ్తాల్ గ్రామపంచాయతీ ప్రగతికి చిరునామాగా మారింది. సమగ్రమైన ప్రణాళికతో, అభివృద్ధి పనులను చేపట్టడంలో వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులకు ఆ యువ నాయకుడు స్ఫూర్తిగా నిలిచారు. జాతీయస్థాయి సదస్సులు, సమావేశాల్లో కడ్తాల్ గ్రామపంచాయతీ అభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులు ప్రశంసలు అందుకున్న కడ్తాల్ గ్రామపంచాయతీ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి. గ్రామంలో విద్యాభ్యాసం పూర్తి చేసి విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించి, న్యాయ శాస్త్రంలో పట్టా పొంది రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన యువ నాయకులకు ఆదర్శంగా నిలిచారు.
—- సర్పంచిగా ఎన్నికై : –2019 గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఏర్పడిన కడ్తాల్ సర్పంచ్ గా గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి ఎన్నికైనారు. గ్రామంలో సంచార పందుల నియంత్రణలో ఆయన పోరాటాన్ని గ్రామస్తులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిలో ఎక్కడ చూసినా పచ్చదనం, పారిశుద్ధ్యంతో ఆయన పనితీరు రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులకు ఆదర్శంగా నిలిచింది.రైతు వేదిక, డంపింగ్ యార్డు,పల్లె ప్రకృతి వనము, వైకుంఠధామము పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసి రాష్ట్రంలోనే ఉత్తమ సర్పంచిగా నిలిచారు.
- చేసిన అభివృద్ధి పనులు::- నూతనంగా వివాహం చేసుకున్న దంపతులచే మొక్కలు నాటించి వివాహ ధ్రువీకరణ పత్రాలు అందజేయడంలో కడ్తాల్ గ్రామపంచాయతీ రాష్ట్రవ్యాప్తంగా అధికారుల ప్రశంసలు అందుకుంది. మరియు అమెరికా తెలుగు సంఘం(ఆటా) సౌజన్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ తరగతులు, పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి నిరుపేదలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. రైతు వేదిక,పల్లె ప్రకృతివనము, డంపింగ్ యార్డ్ త్వరిత గతిన నిర్మించడంతో జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సందర్శించి మోడల్ పంచాయతీగా గుర్తించి ప్రశంసించారు. జిల్లా అధికారులతో పాటు అస్సాం, మేఘాలయ,నాగాలాండ్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు మరియు మాల్దీవుల ప్రజాప్రతినిధులు గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించి అభినందించారు. అదేవిధంగా ఢిల్లీలో ఎన్ ఐ ఆర్ డి పి ఆర్ నిర్వహించిన సబ్ కి యోజన -సబ్ కా వికాస్ హైదరాబాద్ జాతీయ స్థాయిలో నిర్వహించిన భేటీ బచావో బేటి పడావో, జల శక్తి అభియాన్, జల జీవన్ మిషన్, బీకాన్ పంచాయతీ లీడర్, న్యూట్రిషన్ అడ్వకేట్ వంటి అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రశంసలు పొందారు.