సర్పంచ్ పుష్పలత
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- చిరు వ్యాపారులు వారపు సంత షెడ్లను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత అన్నారు. పంచాయతీ మరియు నాబార్డ్ సహకారంతో నిర్మించిన వారపు సంత షెడ్లను బుధవారం ఆమె పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ అంబేద్కర్ తో కలిసి లాటరీ విధానం ద్వారా దుకాణాలను (షెడ్లను) చిరు వ్యాపారులకు కేటాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెరిగిన జనాభా, వ్యాపారుల కారణంగా మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తిన నేపథ్యంలో నాబార్డు సహకారంతో పంచాయితీ ద్వారా సంత షెడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. వాటిని ఈరోజు వ్యాపారులకు లాటరీ విధానం ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. వ్యాపారులంతా సమన్వయంతో ఈ షెడ్లను సద్వినియోగం చేసుకొని వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవాలని ఆమె సూచించారు. ఈ షెడ్లను ఏ ఒక్కరూ అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించరాదని , ఆ విధమైన కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ల సంఘం మండల అధ్యక్షుడు వేములపూడి పరమేష్ తదితరులు పాల్గొన్నారు.