Monday, May 20, 2024
Monday, May 20, 2024

కాంగ్రెస్‌తోనే ప్రత్యేక హోదా

. ఏపీకి బీజేపీ ద్రోహం
. బాబు, జగన్‌ పాలనలో ఒరిగింది శూన్యం
. ‘న్యాయ యాత్ర’ సభలో షర్మిల

విశాలాంధ్ర`పాయకరావుపేట : ఒక్క కాంగ్రెస్‌తోనే ఏపీకి ప్రత్యేక హోదా లభిస్తుందని, రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే, జగన్‌ తొత్తుగా వ్యవహరిస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో శనివారం ‘న్యాయ యాత్ర’ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ, ప్రత్యేక హోదా, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణంపై చంద్రబాబు, జగన్‌… కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. జగన్‌, చంద్రబాబు పదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. కొత్తగా పరిశ్రమలు వచ్చాయా… యువతకు ఉపాధి అవకాశాలు లభించాయా అని నిలదీశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో డక్కన్‌, హెటెరో పరిశ్రమలు ఉన్నప్పటికి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేవన్నారు. చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఊపిరి వంటిదన్నారు.
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందన్నారు. వైసీపీ హయాంలో వ్యవసాయం నిర్వీర్యం అయిందన్నారు. ధరలు నియంత్రించలే దన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లభించలేదన్నారు. 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. ప్రభుత్వమే నాసిరకం మద్యం అమ్మకాలు చేపడుతూ ప్రజల చావుకు కారణమవుతుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రూ.రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని, ప్రతి మహిళకు రూ.8,333 చొప్పున ఏడాదికి రూ.లక్ష అందిస్తామన్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేశ్‌, పాయకరావుపేట అసెంబ్లీ అభ్యర్థి బోని తాతారావును గెలిపించాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాసరావు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు ప్రసంగించారు. రుత్తల శ్రీరామూర్తి, జగతా శ్రీనివాస్‌, మోర్త సింహాచలం, పోలవరపు అప్పలరాజు, బందుల సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img