న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్`యూజీ పేపర్ లీక్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీక్ ప్రధాన నిందితుడిని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అరెస్ట్ చేసింది. జార్ఖండ్ హజారీబాగ్‌లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నుంచి ప్రశ్నపత్రాన్ని దొంగిలించిన పంకజ్ కుమార్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇతడితో పాటు పేపర్ లీక్‌కు సహకరించిన మరో వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటివరకు పేపర్ లీక్ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 14కు చేరింది. జంషెడ్‌పూర్‌లో 2017 బ్యాచ్ సివిల్ ఇంజినీర్ అయిన పంకజ్ కుమార్… హజారీబాగ్‌లోని ఎన్టీఏ ట్రంక్ పెట్టెల నుంచి నీట్ ప్రశ్నాపత్రాన్ని దొంగిలించాడు. అనంతరం రాజు సింగ్ అనే వ్యక్తికి అందజేయగా… అతడు తన ముఠా సభ్యులకు చేరవేశాడు. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఇద్దరిని అరెస్ట్ చేసింది. బొకారోకు చెందిన పంకజ్ కుమార్‌ను బీహార్ రాజధాని పాట్నాలో అరెస్ట్ చేయగా, రాజును హజారీబాగ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఆరు ఎఫ్ఐఆర్లను సీబీఐ అధికారులు నమోదు చేశారు. ఇందులో బీహార్‌లో పేపర్‌లీక్‌పై కేసు నమోదు కాగా, మిగిలిన ఐదు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో మోసం చేయడానికి సంబంధించినవి. దీంతోపాటు కేంద్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు సీబీఐ సొంతంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. అక్కడ కాలిపోయిన ప్రశ్నపత్రాలను బీహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.