- అర్ధరాత్రి బైకులపై ఏసీపీ, సీఐ, ఎస్ఐలు తిరుగుతూ ముమ్మర సోదాలు
- మద్యం తాగుతూ రోడ్లపై ఉన్నవారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- అర్ధరాత్రి పోలీసు అధికారులు రావడంతో ఆకతాయిలు ఉరుకులు పరుగులు
విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్ ): స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషను పరిధిలోని ఆకతాయిలను అర్ధరాత్రివేళ ఉరుకులు పరుగులు పెట్టించారు. రోడ్ల వెంబడి, నిర్మానుష్య ప్రదేశాల్లో చేరి మద్యం తాగుతున్న వారి మత్తు వదిలించారు. ఒక్కసారిగా ఏసీపీ, సీఐ, ఎస్ఐలు, పెద్ద సంఖ్యలో పోలీసులు బైకులపై గస్తీ నిర్వహిస్తూ రోడ్డెక్కడంతో ఆకతాయిలు, అల్లరిమూకలు భయంతో పరుగులు తీశారు. వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు, సీఐ కొండలరావు నేతృత్వంలో ఎస్ఐలు, కానిస్టేబుళ్లు సోమవారం రాత్రి 11 నుంచి 2 గంటల వరకు బైకులపై ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పాతబస్తీలోని వించిపేట, నైజాంగేటు సెంటర్, ఖాధర్ సెంటర్, లంబాడిపేట, అడ్డరోడ్డు, వైఎస్సార్ కాలనీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేశారు. బైకులపై పోలీసు అధికారులు ఆకస్మికంగా రావడంతో ఖంగుతిన్న మందుబాబులు, ఆకతాయిలు పరుగులు తీశారు. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. రోడ్లపై మద్యం తాగుతూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని ఏసీపీ దుర్గారావు, సీఐ కొండలరావు హెచ్చరించారు.