Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాడేరు శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – 2019 కి ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలది దోపిడీ రాజ్యమని ఇప్పుడున్న వైకాపా ప్రభుత్వంలో వాలంటీర్లది పారదర్శక సేవ అని వైకాపా అరకు పార్లమెంట్ సమన్వయకర్త, పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశం మందిరంలో ఎంపీడీవో సాయిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాలకు, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు నేరుగా పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం వైకాపా అన్నారు. గత ప్రభుత్వాలలో సంక్షేమ ఫలాలు అంటే తెలియని గిరి గ్రామాలు అనేకం ఉండేవన్నారు. కానీ నేడు ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకు సంక్షేమ పథకాలు నేరుగా చేరుతున్నాయని, నేడు వాలంటీర్ ఈ వ్యవస్థ ద్వారా ప్రతినెలా ఒకటో తేదీనే లబ్ధిదారులందరూ పెన్షన్ అందుకుంటున్నారన్నారు. అది ఒక్క వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంతోనే సాధ్యమైందని చెప్పారు. కానీ నేడు 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ని నియమించడంతో మారుమూల పల్లెలకు కూడా వెళ్లి వారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తెలియజేసి వాటిని పార్టీలకతీతంగా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరూ పొందేలా వాలంటీర్లు పారదర్శకమైన సేవ చేస్తున్నారని చెప్పారు. మండలంలో
421 మంది వాలంటీర్లు ఉన్నారని, వారిలో ఇద్దరికీ సేవా వజ్ర, ఐదుగురికి సేవా రత్న, మిగిలిన వారికి సేవా మిత్ర అవార్డులు వరించాయని తెలిపారు. అవార్డులకు ఎంపికైన వాలంటీర్లకు స్థానిక ప్రజా ప్రతినిధులు, వైకాపా నాయకులతో కలిసి ఆమె అవార్డులు అందించారు. అవార్డులు పొందిన వారిని దుస్సాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన జన్మభూమి కమిటీలకి, వైకాపా ప్రభుత్వంలో పని చేస్తున్న వాలంటీర్ వ్యవస్థకు నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు. జన్మభూమి కమిటీలది దోపిడీకి పాలనైతే , వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందజేసే పాలన అని ఆమె కితాబిచ్చారు. తాను గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో అన్ని గ్రామాలను పూర్తిస్థాయిలో తిరగడమే గాక వాలంటీర్లను ముందు ఉంచుకుని ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరించి సంక్షేమ పథకాలు అందుతున్న తీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడమే గాక ఆయా గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగిందన్నారు. నేడు తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటున్న సూపర్ సిక్స్ పథకాలు ప్రస్తుతం తమ ప్రభుత్వం అమలు చేస్తున్నవేనని, వాటికి పేర్లు మార్చి, కాపీ పేస్ట్ అనే చందంగా తెలుగుదేశం నాయకులు ప్రచారం ప్రారంభించారని ఆమె ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోరాబు,
అనుషా దేవి, జడ్పిటిసి పోతురాజు బాలయ్య లు ప్రసంగించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు గోపినాయక శారద, సాగిన వెంగళరావు, వైకాపామండల అధ్యక్షుడు, డిసిసిబి డైరెక్టర్ మోరి రవి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత, జీజూ మండల కన్వనర్ పాంగి గుణబాబు, స్థానిక ఎంపిటిసిలు చిందాడ జయలక్ష్మి, దాసరి ధారలక్ష్మి, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మీరా, మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ నాజర్ వల్లి, చౌడుపల్లి సర్పంచ్ గెమ్మేల లలిత , ఎంపీటీసీలు జర్తా రుతు, గెమ్మే ల సోని, తాంబేలి మోహనరావు, ఎస్సీ సెల్ మహిళా అధ్యక్షురాలు సోమరాజు, నాయకులు కొర్ర రఘునాథ్, నూకరాజు, నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో గ్రామ వాలంటరీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img