Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాష్ట్రంలో మళ్లీ వైకాపాదే అధికారం

మన్యంలో హ్యాట్రిక్ విజయం నమోదు చేస్తాం

వైకాపా అల్లూరి జిల్లా అధ్యక్షురాలు, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఎన్ని పార్టీలు జత కలిసినా, ఎంతమంది ఏకమైనా ప్రజలు వైకాపా వైపే ఉన్నారని రాష్ట్రంలో మళ్ళీ వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని ఆ పార్టీ అల్లూరి జిల్లా అధ్యక్షురాలు, పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. చింతపల్లి,జీకే వీధి మండలాల పార్టీ శ్రేణులతో కలసి అంతర్ల గ్రామంలో ఆ పార్టీ అరకు పార్లమెంట్ పాడేరు శాసనసభ అభ్యర్థుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి పాడేరు నియోజకవర్గ పరిశీలకులు శ్రీకాంత్ రాజు, పీలా వెంకటలక్ష్మి లతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ అల్లూరి జిల్లాలో మరోమారు వైకాపా జెండా ఎగరవేయడమే గాక హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తామన్నారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో అరకు పార్లమెంట్, శాసనసభలతోపాటు పాడేరు శాసనసభ స్థానాలలో వైకాపా అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఏ నిర్ణయానికైనా పార్టీ శ్రేణులంతా కట్టుబడి ఉండాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా వైకాపా స్థాపన జరిగిందని 2014లో 68 స్థానాలతో ప్రతిపక్ష హోదాను సంపాదించుకున్న వైకాపా 2019లో భారీ మెజారిటీతో 151 స్థానాలను గెలుచుకొని ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగిందన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో జగనన్న పేదల పక్షాన నిలిచి పాలన అందించారని పేర్కొన్నారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు చూడని అభివృద్ధి, సంక్షేమాలను వైకాపా ప్రభుత్వం అందించిందన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా రాష్ట్ర ప్రజల ముఖాల్లో గడచిన ఐదేళ్లు చిరునవ్వులు కనిపించాయని, ఇవి కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుందన్నారు. తన వల్ల ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని భావిస్తేనే తనకు ఓటు వేయాలని నిర్భయంగా అడిగే ధైర్యమున్న నాయకుడు జగనన్న అన్నారు. గడచిన ఐదేళ్లలో ఆయన అందించిన పాలనే నిదర్శనం అన్నారు. ఈ ఐదేళ్లలో పాడేరు నియోజకవర్గంలో అనేక సమస్యలను పరిష్కరించుకోగలిగామని, మిగిలిన సమస్యలు కూడా పరిష్కారం కోసం మళ్లీ వైకాపాను అధికారంలోకి తెచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన్య ప్రాంతంలో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లయినా అభివృద్ధికి నోచుకోని పరిస్థితుల్లో ఉన్న గిరిజనాన్ని ఈ ఐదేళ్లలో అభివృద్ధి బాట పట్టించడమే గాక, ప్రతి ఇంటికి సంక్షేమాన్ని చేరువ చేశారన్నారు. విజన్ ఉన్న నాయకుడు పాలకుడు కాకపోతే మళ్లీ ఆదివాసి ప్రాంతాలు అభివృద్ధికి దూరమవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి, సంక్షేమాన్ని అందుకున్న ప్రజలంతా వైకాపాలు మరోమారు ఆశీర్వదించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఎస్ టి సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు మత్స్యరాస వెంకటలక్ష్మి,
వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సరస్వతి, జడ్పిటిసి పోతురాజు బాలయ్య, ఎంపీపీలు కోరాబు అనూష దేవి, బోయిన కుమారి, పార్టీ మండల అధ్యక్షులు మోరి రవి, వైస్ ఎంపీపీలు గోపి నాయక్ శారద, వెంగళరావు, సర్పంచ్ దురియా పుష్పలత , అరకు పార్లమెంట్ మాజీ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ హలియా రాణి, ట్రైకార్ డైరెక్టర్ లోవరాజు, చింతపల్లి, జీకే వీధి మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు , ఏఎంసీ డైరెక్టర్లు, పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు, వైకాపా అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img