Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

‘ఇండియా’ గెలుపుతో రాజ్యాంగ రక్షణ

. అక్కినేని వనజ పిలుపు
. విమల విజయం కోసం విశాఖలో భారీ ర్యాలీ

విశాలాంధ్ర-విశాఖ : దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడా నికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, మత విద్వేషాలకు తావు లేకుండా ప్రజలు స్వేచ్ఛా, సౌభ్రాతృత్వాలతో మెలగడానికి ఇండియా కూటమి అభ్యర్థుల విజయం చారిత్రక అవసరమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి నుంచి పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థి అత్తిలి విమల, విశాఖ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సత్యారెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పశ్చిమ నియోజకవర్గంలో బాజీ జంక్షన్‌ నుంచి గోపాలపట్నం పెట్రోల్‌ బంకు వరకు శనివారం మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించారు. అక్కినేని వనజ మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం దేశాన్ని తిరోగమనంలో నడిపిందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అతి తక్కువ ధరకు ప్రైవేటు శక్తులకు కట్టబెడుతోందని ఆరోపిం చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని అమ్మకానికి పెట్టిందన్నారు. విదేశాలకు తరచూ వెళ్లే ప్రధాని మోదీ…సభ్య సమాజం తలదించుకునే ఘటనలు జరిగిన మణిపూర్‌లో మాత్రం పర్యటించలేదని నిందించారు. తమను వ్యతిరేకించే శక్తులు, వ్యక్తులను జైలుకు పంపుతోందని అన్నారు. బీజేపీ కండువా కప్పుకుంటే పవిత్రులవుతు న్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు రాజకీయ స్వార్థంతో మోదీ ప్రభుత్వానికి మోకరిల్లుతున్నాయని విమర్శిం చారు. కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజక వర్గం సీపీఐ అభ్యర్థి అత్తిలి విమల, విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి సత్యారెడ్డి, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, రాష్ట్ర సమితి సభ్యులు చలసాని రాఘవేంద్రరావు, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎంఏ బేగం, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి, జిల్లా అధ్యక్షురాలు పద్మ, కాంగ్రెస్‌ మహిళా విభాగం నాయకురాలు రజియా బేగం, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జీఎస్‌జే అచ్యుతరావు, కసిరెడ్డి సత్యనారాయణ, ఎస్‌కే రెహమాన్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img