Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

మాడుగుల హల్వా దక్కేదెవరికి?

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏజెన్సీకి ముఖ ద్వారంగా ఉన్న మాడుగుల నియోజకవర్గం ప్రస్తుతం జిల్లాల విభజన నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో పరిధిలో ఉంది. మాడుగుల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. మాడుగుల హల్వా అంటే దేశంలోనే ప్రత్యేకత చాటుకుంది. ఈ నియోజకవర్గంలో కె. కోట పాడు, చీడికాడ, దేవరాపల్లి, మాడుగుల మండలాల పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గంలో తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అనూహ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పించి ఆయన కుమార్తె కె కోట పాడు జడ్పిటిసి సభ్యురాలు ఈర్ల అనురాధకు మాడుగుల వైసీపీ టికెట్‌ కట్టబెట్టారు. అయితే ముత్యాల నాయుడు కుమారుడు బూడి రవి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగడంతో ముత్యాల నాయుడుకు చిక్కులు ఎదురయ్యాయి. రెండో భార్య కుమార్తె అయిన అనురాధకే తొలినుంచి రాజకీయ వారసత్వం కల్పిస్తున్న ముత్యాల నాయుడు వైఖరిపై కుమారుడు బూడి రవి రాజకీయ పోరాటం మొదలుపెట్టారు.
1952లో ఏర్పడిన మాడుగుల నియోజకవర్గం తొలి ఎమ్మెల్యేగా బోజంగి గంగయ్య నాయుడు కేఎల్‌పీ నుంచి ఎన్నిక కాగా, 1955లో పీఎస్‌ఎల్‌పీి నుంచి దొండ శ్రీరామ మూర్తి ఎన్నికయ్యారు. 1962లో స్వతంత్ర అభ్యర్థిగా తెన్నేటి విశ్వనాథం, 1967లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రమా కుమారి దేవి, 1972 లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బొడ్డు కళావతి, 1978లో స్వతంత్ర అభ్యర్థిగా కూరచా రామనాయుడు, 1983లో స్వతంత్ర అభ్యర్థిగా రెడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెడ్డి సత్యనారాయణ మరోసారి ఎన్నికయ్యారు. 1989, 1994, 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి రెడ్డి సత్యనారాయణ ఎన్నికై మంత్రిగా కూడా పనిచేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ చేతిలో రెడ్డి సత్యనారాయణ ఓటమి పాలయ్యారు. 2009లో టీడీపీి నుంచి గవిరెడ్డి రామానాయుడు గెలుపొందారు. 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీి అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడుపై వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు గెలుపొందారు. వైసీపీి నుంచి రెండుసార్లు వరుసగా మాడుగుల నుంచి ఎన్నికైన ముత్యాల నాయుడు రెండున్నరేళ్ల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రిగా, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2024లో కూడా ముత్యాల నాయుడుకే మాడుగుల ఎమ్మెల్యే టికెట్‌ సీఎం జగన్‌ ప్రకటించినప్పటికీ ఆఖరి నిమిషంలో ఆయనకు అనకాపల్లి ఎంపీగా టికెట్‌ కేటాయించారు. కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్‌ రావడంతో వైసీపీ నుంచి ఆయనకు దీటైన అభ్యర్థి లేకపోవడంతో ముత్యాల నాయుడును మాడుగుల ఎమ్మెల్యే బరి నుండి తప్పించి ఎంపీగా పోటీలోకి వైసీపీ దింపింది. దీంతో ఆయన కుమార్తె కె. కోట పాడు జడ్‌పీటీసీ సభ్యురాలుగా ఉన్న ఈర్లే అనురాధను మాడుగుల అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ నుంచి బరిలోకి దింపారు. ఆయన కుమారుడు రవి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగారు. దానితో ముత్యాలనాయుడుకు ముచ్చెమటలు పడుతున్నాయి. ముత్యాలనాయుడుకు కుమార్తె, కుమారుడు మధ్య పోటీపై ముత్యాల నాయుడు వర్గీయులు గందరగోళం లోకి పడ్డారు. వైసీపీ గ్యారెంటీగా గెలుచుకుంటుందనుకున్న మాడుగుల నియోజకవర్గంలో ముత్యాల నాయుడు కుటుంబంలో రేగిన అలజడితో వైసీపీలో గందరగోళం నెలకొంది. ఈ ప్రభావం తన అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంపై కూడా పడుతుందని ఆయన మదన పడుతున్నారు.
మరోపక్క కూటమి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తొలిసారి ఆఖరి నిమిషంలో టికెట్‌ దక్కించుకొని మాడుగుల నుంచి పోటీలోకి దిగారు. తొలుత ఈ నియోజకవర్గ టికెట్‌ను పైలా ప్రసాదరావుకు టీడీపీి ప్రకటించింది. ఇక్కడ టీడీపీ నుంచి టిక్కెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాదరావు నామినేషన్‌ వేసినప్పటికీ టీడీపీి అధిష్ఠానం బుజ్జగింపు చర్యలు చేపట్టడంతో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో బండారుకు రెబల్‌ అభ్యర్థుల బెడద తప్పింది.
` విశాలాంధ్ర బ్యూరో, విశాఖపట్నం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img