Friday, May 17, 2024
Friday, May 17, 2024

ఎన్డీఏకు తిరుగుబాటు పోటు

టీడీపీ, బీజేపీ, జనసేనకు షాక్‌
16 నియోజకవర్గాల్లో రెబల్స్‌ పోటీ

సార్వత్రిక ఎన్నికల బరిలో ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేనకు గట్టి షాక్‌ తగిలింది. ఈ పార్టీల అభ్యర్థులు పోటీచేస్తున్న స్థానాల్లో కొన్ని చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయడం ఎన్డీఏ కూటమికి వణుకు పుట్టిస్తున్నది. తిరుగుబాటు అభ్యర్థులలో అత్యధికంగా టీడీపీ, బీజేపీ, జనసేన నుంచే ఉండటం ఆ పార్టీలకు మింగుడుపడటం లేదు. 2024 ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లకోసం చాలా మంది టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు టిక్కెట్లను ఆశించి భంగపాటుకు గురయ్యారు. ఎన్నికల నామినేషన్ల ముగింపు వరకు తమకు సీట్లు వస్తాయని ఆశించి, ఇక చేసేదేమీ లేక తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఎన్డీఏ కూటమిగా టీడీపీ, బీజేపీ, జనసేన జట్టుకట్టడంతోనే..ఆ పార్టీలకు రాజకీయ అనిశ్చిత్తి ఏర్పడిరది. టిక్కెట్లు దక్కని వారంతా నిరసనలతో ఆగకుండా ఈ విడత ఏకంగా చంద్రబాబు ఫోటోలతో కూడిన టీడీపీ జెండాలు, ఫోటోలను దగ్దంచేసి తమ ఆవేశాన్ని చూపించారు. అయినా వారికి టిక్కెట్లు రాకపోతే తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. చివరి వరకు చివరి వరకు ఆయా పార్టీల అధిష్ఠానాలు వారికి సర్దిచెప్పినా, బుజ్జగింపులు చేసినా ససేమిరా అంటూ మెండికేశారు. ఎట్టకేలకు ఏప్రిల్‌ 29వ తేదీతో నామినేషన్ల ఘట్టం పూర్తవ్వడంతో ఒక్కసారిగా తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దూసుకొచ్చారు. ఎన్డీఏ కూటమి తరపున మొత్తం 16 మంది తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో ఒక్క టీడీపీ నుంచే 9 మంది తిరుగుబాటు బావుటా ఎగురేశారు. మరో 7 చోట్ల బీజేపీ, జనసేన అభ్యర్థులు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ నుంచి తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలున్నారు. ఇప్పటికే ఆరుగురు తిరుగుబాటు అభ్యర్థులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత రెబల్‌గా పోటీలో ఉన్నారు. ఈమెకు టిక్కెట్‌ను టీడీపీ ఆధిష్ఠానం నిరాకరించడంతో రెబల్‌గా నామినేషన్‌ వేశారు. ఆధిష్టానం ఒత్తిళ్లకు తగ్గకుండా, నామినేషన్‌ ఉపసంహరించుకోలేదు. దీంతో ఆమె విజయనగరం స్వతంత్య్ర అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. అరకులో టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా సివేరి అబ్రహం పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో హత్యకు గురైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పరమట శ్యామ్‌కుమార్‌ ఆధిష్ఠానం ప్రకటించిన అభ్యర్థిపై తిరుగుబావుటాఎగురేశారు.
భీమవరంజిల్లా ఉండి అసెంబ్లీకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివరామరాజు రెబల్‌గా పోటీలో దిగారు. టీడీపీ నుంచి ఆయన టిక్కెట్‌ ఆశించినా దక్కలేదు. ఆయన స్థానంలో రఘురామకృష్ణంరాజుకు టీడీపీ టిక్కెట్‌ను కేటాయించారు. అసంతృప్తికి గురైన ఆయన రెబల్‌గా పోటీ చేయడంతో టీడీపీలో టెన్షన్‌ నెలకొంది. ఈ తిరుగుబాటు అభ్యర్థులతో తమ ఓట్లకు గండిపడుతుందన్న ఆందోళనతో ఎన్డీఏ కూటమి పార్టీలున్నాయి.
పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లిపోవడంతో, అక్కడి టీడీపీ నియోజకవర్గ నాయకుడు మొడియం సూర్యచంద్రరావు రెబల్‌గా పోటీలో ఉన్నారు. ఆధిష్ఠానం ఎంత బుజ్జగింపులు చేసినా ఆయన వెనక్కితగ్గలేదు. చిత్తూరుజిల్లా సత్యవేడు అసెంబ్లీకి టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా రాజశేఖర్‌ రంగంలోకి దిగారు. నెల్లూరుజిల్ల్లా కావాలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్‌ పోటీ చేస్తున్నారు.
ఉమ్మడి అనంతపురంజిల్లాలో బీజేపీ, టీడీపీకి తిరుగుబాటు అభ్యర్థులు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నారు. హిందూపురంలో బీజేపీ రెబల్‌ అభ్యర్థిగా పరిపూర్ణనంద బరిలో నిలిచారు. ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా హిందూపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి బీజేపీ రెబల్‌గా పరిపూర్ణనంద పోటీకి దిగడంతో టీడీపీలో కలవరం మొదలైంది. బాలకృష్ణను ఓడిరచడమే తన లక్ష్యమని పరిపూర్ణనంద ఘంటాపథంగా చెబుతున్నారు.
బాలకృష్ణ మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలన్న ఆశలకు..పరిపూర్ణనంద పోటీ అడ్డంకిగా మారింది. కురుపాలంలో బీజేపీ రెబల్‌గా నిమ్మక జైరాజ్‌ పోటీ చేస్తున్నారు. రాప్తాడులో టీడీపీ తరపున పోటీ చేస్తున్న పరిటాల సునీతకు రెబల్‌ బెడద ఎదురైంది. టీడీపీకి చెందిన ప్రొఫెసర్‌ రాజేశ్‌ రెబల్‌గా బరిలిలో నిలిచారు. గన్నవరంలో బీజేపీ రెబల్‌ అభ్యర్థిగా గొల్లపోలు శ్రీనివాసరావు బరిలో నిలిచారు.
జగ్గంపేట అసెంబ్లీకి జనసేన నుంచి టిక్కెట్‌ దక్కకపోవడంతో రెబల్‌గా సూర్యచంద్ర పోటీ చేస్తున్నారు. పెడనలోనూ జనసేన రెబల్‌ పోటీలోకి దిగారు.
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img