Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

కాలి బూడిదైన ఇ.డి. దూది మేడలు

కేవలం 24 గంటల సమయంలో మోదీ ప్రభుత్వం సుప్రీం కోర్టు నుంచి మూడు ఛీత్కారాలు ఎదుర్కోవలసి వచ్చింది. మొదటిది: దిల్లీ మద్యం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. రెండవది: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు అనుబంధంగా ఉండే వీవీపాట్‌ పత్రాలన్నింటినీ లెక్కించే అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. మూడవది: పతంజలి ఆయుర్వేదిక్‌ యజమాని బాబా రాం దేవ్‌, ఆయన సహచరుడు ఆచార్య బాలకృష్ణ చేతులు జోడిరచి క్షమించండి అని అనేక సార్లు వేడుకున్నా వారి క్షమాపణను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అంతకు ముందు ఎన్నికల బాండ్లను రద్దుచేస్తూ ఇవి రాజ్యాంగ విరుద్ధమైనవని సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా ప్రకటించింది. దిల్లీ మద్యం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ విధానాన్ని కేజ్రీవాల్‌ నాయకత్వంలోని దిల్లీ ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ అది ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులను వెంటాడుతూనే ఉంది. సంజయ్‌ సింగ్‌ విషయంలో అయితే ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరొక్టోరేట్‌ (ఇ.డి.) అడ్డంగా దొరికి పోయింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్‌ ఖన్నా నాయకత్వంలోని దీపంకర్‌ దత్తా, పీబీ వరాలేతో కూడిన బెంచ్‌ అడిగిన ప్రశ్నలకు ఇ.డి. దగ్గర సమాధానమే కనిపించలేదు. ఆరు నెలలుగా సంజయ్‌ సింగ్‌ను జైలులో ఉంచినప్పటికీ ఆయన విషయంలో ఇ.డి. తమ వాదనను నిలబెట్టుకోవడానికి అనువైన సమాచారం ఏమీ సేకరించలేక పోయింది. పోనీ విచారణ అయినా మొదలైందా అంటే అదీ లేదు. మద్యం కుంభకోణం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని నిరూపించడానికి ఇ.డి. దగ్గర రుజువులే కనిపించడం లేదు. కేవలం ఇదే కేసులో నిందితుడిగా ఉన్న దినేశ్‌ అరోరా అప్రూవర్‌గా మారిన తరవాత ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే సంజయ్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. దినేశ్‌ అరోరా మొత్తం పదిసార్లు వాంగ్మూలం ఇస్తే తొమ్మిది సార్లు సంజయ్‌ సింగ్‌ పేరే ప్రస్తావించలేదు. అప్రూవర్‌గా మారిన తరవాత పదోసారి ఇచ్చిన వాంగ్మూలంలో మాత్రమే ఆయన సంజయ్‌ సింగ్‌ పేరు ప్రస్తావించారు. ఇలాంటి దశలో తొమ్మిది సార్లు సంజయ్‌ సింగ్‌ పేరెత్తకుండా పదో సారి ఇచ్చిన వాంగ్మూలంలో సంజయ్‌ సింగ్‌ పేరు ప్రస్తావించారన్న కారణంతో ఎలా అరెస్టు చేస్తారని సుప్రీంకోర్టు నిలదీసింది. న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ఇ.డీ. తరఫున వాదిస్తున్న అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు నోట మాటే పెకలలేదు. ద్రవ్య అక్రమ చెలామణి చట్టంలోని 45 వ సెక్షన్‌ ప్రకారం సంజయ్‌ సింగ్‌ తప్పు చేసిన దాఖలాలే కనిపించడం లేదు కదా, ఆ మాట మేమిచ్చే ఉత్తర్వులో రాయవలసి వస్తుందని సంజీవ్‌ ఖన్నా గట్టిగా అడిగిన తరవాత అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ బెయిలు ఇవ్వడాన్ని నిరోధించలేక పోయారు. అయితే సంజయ్‌ సింగ్‌కు బెయిలు మంజూరు చేయడాన్ని పూర్వోదంతంగా స్వీకరించ డానికి వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే ఇదే వ్యవహారంలో 13 నెలల నుంచి జైలులో ఉన్న మనీశ్‌ సిసోడియా, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఇలాగే బెయిలు మంజూరు అవుతుందని సంబర పడిపోవడానికి అవకాశం లేదు. మద్యం కేసులో డబ్బు ఇచ్చిన వారెవరు, తీసుకున్న వారెవరో చెప్పే పరిస్థితిలో ఇ.డి. లేదు. మద్యం వ్యవహారంలో డబ్బులు చేతులు మారిందని, ఈ మొత్తం వ్యవహారంలో దిల్లీ ముఖ్యమంత్రి కీలక వ్యక్తి అని ఆరోపించిన ఇ.డి. దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. మద్యం కేసులో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఆరోపించినప్పుడు ఆ డబ్బు జాడ కనిపెట్టడంలో ఇ.డి. విఫలమైంది. ఎంత సేపూ గోవా ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ రూ.40 కోట్లు ఖర్చు చేసిందని మాత్రమే ఇ.డి. పాడిన పాటే పాడుతోంది.
ఈ కేసులో మూడు అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. కిరాతకమైన చట్టాల కింద అరెస్టు అయిన వారికి బెయిలు మంజూరు చేయడంలో న్యాయస్థానాలు మొదట కొద్దిగా సంకోచించవచ్చు. అరెస్టు చేసిన వ్యవస్థలు తప్పు చేసి ఉండకపోవచ్చుననీ భావించవచ్చు. అయితే అరెస్టు చేసిన వ్యవస్థలు సరైన రుజువులు చూపకపోతే న్యాయమూర్తులు గుచ్చి ప్రశ్నలడిగి నిందితులకు బెయిలు మంజూరు చేయడానికి ముందుకు రావచ్చు. చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఉన్న వ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిందే. కానీ లోటంతా ఆ నిష్పాక్షికతదే. సంజయ్‌ సింగ్‌కు బెయిల్‌ను పూర్వోదంతంగా పరిగణించకూడదని సుప్రీం కోర్టు చెప్పినా కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా, తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల కవిత అర్జీలు సుప్రీంకోర్టు ముందుకు వస్తే పూర్వోదంతం ప్రస్తావన తేకపోయినా వాదోపవాదాల క్రమంలో ఈ అంశాలే చర్చకు వస్తాయి. అరెస్టులు, నిర్బంధాల వల్ల దర్యాప్తులో ముందడుగు పడ్డ దాఖలాలే లేవు. జనం దృష్టిలో మాత్రం మోదీ ప్రభుత్వం ఆమ్‌ ఆద్మీ పార్టీ మీద కసి తీర్చుకుంటోందన్న అబి óప్రాయమే పాతుకు పోయింది. ద్రవ్య అక్రమ చెలామణి నిరోధక చట్టంలోని కటువైన 45వ సెక్షన్‌ మీద మాత్రమే ఆధారపడి ఈ వ్యవహారాన్ని తెగలాగే పన్నాగాలకు ఎప్పుడో ఒకప్పుడు తెర పడాల్సిందే. సంజయ్‌ సింగ్‌ విషయంలో అదే జరిగింది. మరో విషయం ప్రకారం కక్ష సాధింపు ధోరణి నిరంతరాయంగా కొనసాగక పోవచ్చు. కానీ ఆ క్రమంలోనే నిరపరాధు లైనప్పటికీ ఏ పాపం ఎరగని వారు సైతం దీర్ఘకాలం జైళ్లల్లో మగ్గిపోక తప్పదు. కీలకమైన వాస్తవాలను వెలికి తేవడంలోనే న్యాయస్థానాల పాత్ర విశేషమైందిగా నిలుస్తుంది. నిందితుడి నుంచి ప్రభుత్వం తరపు సాక్షిగా మారిన దినేశ్‌ అరోరా వ్యవహారంలోని లోగుట్టును న్యాయమూర్తులు కనిపెట్టి సంజయ్‌ సింగ్‌కు తాత్కాలిక ఉపశమనమైనా కలిగించడం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడ్తున్న వారికి ప్రేరణగా నిలుస్తుంది. కిరాతకమైన చట్టాలను ఇష్టానుసారం ఎల్లకాలం దుర్విని యోగం చేయడానికి వీలులేదని న్యాయమూర్తులు చెప్పకనే చెప్పినట్టయింది. కక్ష సాధించే చర్యలు అంతిమంగా న్యాయమార్గ పాలనకు విఘాతం కలిగించక మానవు. ద్రవ్య అక్రమ చెలామణి నిరోధక చట్టం వాస్తవానికి ఆయుధ, మాదక ద్రవ్య వ్యాపారుల ఆటకట్టించడానికి ఉద్దేశింది అయినా మోదీ ప్రభుత్వం దీనిని తమ రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయడానికి దుర్వినియోగం చేయడమే అసలు విషాదం. ఏమైతేనేమి సంజయ్‌ సింగ్‌ విషయంలో మోదీ సర్కారు కట్టిన దూది మేడలు కాలి బూడిదై పోయాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img