Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

మోదీ కొత్త ఆయుధం కచ్చతీవు

ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధానమంత్రి మోదీకి ఎప్పుడూ ఏదో ఒక అంశం కావాలి. 2019లో అది బాలాకోట్‌ మీద దాడి కావొచ్చు. బీజేపీ ఆత్మకు ఇంపైన హిందుత్వ నినాదంవల్ల మాత్రమే ఓట్లు రాలవని, ఇతర రాజకీయ పరిణామాలు తమకు అనుకూలంగా లేవని తెలుసుకున్న మోదీ గత నెల 31వ తేదీన మాయల మాంత్రికుడు టోపీ లోంచి కుందేలు పిల్లను తీసినట్టు కచ్చతీవు అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. కచ్చతీవుకు ఓ చరిత్ర ఉంది. కచ్చతీవును స్వాధీనం చేసుకోవాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఒక పితూరీ లేవదీశారు. మోదీ ఆ అంశాన్ని ఎన్నికలలో విజయం సాధించుకోవడానికి ఆయుధంగా మలుచుకున్నారు. అయితే కచ్చతీవు చరిత్ర మోదీ లేవనెత్తినప్పుడో, అన్నామలై మెదడులో మెదిలినప్పుడో ప్రారంభం కాలేదు. కాదు కూడా. మౌలికంగా కచ్చతీవు వివాదాస్పద దీవి. అది రామేశ్వరానికి దక్షిణాన, శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని జాఫ్నాకు మధ్యలో పాక్‌ జలసంధిలో ఓ చిన్న దీవి. కచ్చతీవు పక్కనే మరో చిన్న దీవి ఉంది. దానిని ఇమరావన్‌ అంటారు. ఆ దీవులు సైనికపరంగా ప్రాముఖ్యం కలిగినవి. భారత, శ్రీలంక దేశాలవారు చేపలు పట్టే వారు తమ వలలు ఆరవేసుకోవడానికి కచ్చతీవును వినియోగించుకుంటారు. కనక అవి భారత్‌కు చెందినవా, శ్రీ లంకకు చెందినవా అన్న వివాదం ఎప్పుడూ ఉంది. కచ్చతీవు ఎంత చిన్న దీవి అంటే అంతా కలిపితే 285 ఎకరాల నేల. పొడవు 1.6 కిలో మీటర్లు ఉంటే వెడల్పు వెయ్యి అడుగులు మాత్రమే. 1921 నాటి అధికారిక పత్రాల ప్రకారం అది వివాదాస్పద ప్రాంతమే. 1971లో భారత-పాకిస్థాన్‌ యుద్ధం జరిగినప్పుడు పాకిస్థాన్‌ యుద్ధ విమానాలు శ్రీలంక రాజధాని కొలంబోలో ఇంధనం నింపుకుంటే ఉండేవి. ఇది మనకు ప్రతికూలమైన అంశం. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ శ్రీలంక ప్రధాన మంత్రి సిరిమావో బండారు నాయికేను ఒప్పించి పాకిస్థాన్‌ యుద్ధ విమానాలు కొలంబోలో ఇంధనం నింపుకోకుండా చేయడానికి కచ్చతీవులను శ్రీలంకకు వదిలేశారు. దానికి బదులు చమురు, గ్యాస్‌ అన్వేషణకు కొంత సముద్ర ప్రాంతాన్ని శ్రీలంక మనకు అప్పగించేటట్టు 1974 లో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వాస్తవాన్ని గమనించకుండా ఇందిరాగాంధీ అప్పనంగా కచ్చతీవును శ్రీలంకకు అప్పగించేశారని మోదీ యాగీ చేస్తున్నారు. విదేశాంగ మంత్రి జై శంకర్‌ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ మోదీ రాగాలాపనకు శ్రుతి కలుపుతున్నారు. జై శంకర్‌ ఒకప్పుడు శ్రీలంకలోని మన రాయబార కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల అధికారిగా ఉన్నారు. అయినా ఆయనకు తెలిసిన చరిత్రనే విస్మరించి మాట్లాడు తున్నారు. పైగా జై శంకర్‌ శ్రీలంకలో భారత శాంతి పరిరక్షణ దళం (ఐ.పి.కె.ఎఫ్‌.) సలహాదారుగా కూడా ఉన్నారు. శాంతి పరిరక్షక దళాలను పంపించి వందలాది మంది తమిళులనే హతమార్చి నందువల్ల మనకు చెడ్డ పేరే మిగిలింది. అన్నీ తెలిసిన జైశంకర్‌ ఈ అంశంపై రచ్చ చేయడం హాస్యాస్పదమైందే. నింపాదిగా కనిపించే జై శంకర్‌ కనీసం నలుగురు చూడడానికైనా రాజనీతిజ్ఞతను పాటించలేదు.
అన్నింటికన్నా మించి త్వరలో జరిగే ఎన్నికలలో లబ్ది పొందడానికి మోదీ ఈ అంశాన్ని ఉన్నట్టుండి లేవనెత్తారు. అన్నామలై ఈ అంశానికి సంబంధించిన పత్రాలను సేకరించే పనిలో పడ్డారు. ఈ వివాదానికి మోదీ జాలర్ల సమస్యను కూడా జోడిరచారు. మన జాలర్లు శ్రీలంకకు కిలో మీటరు దూరం దాకా చొచ్చుకుపోయి చేపలు పడుతుంటారు. వారి మీద మధ్యమధ్యలో శ్రీలంక భద్రతా దళాలు దాడి చేస్తుంటాయి. జాలర్ల సాధన సంపత్తిని స్వాధీనం చేసుకుంటారు. ఈ సమస్య పరిష్కరించే ఉద్దేశమే మోదీ ప్రభుత్వానికి లేదు. జాలర్ల మీద అంత అభిమానమే ఉంటే సముద్రంలో దూర ప్రాతాలకు వెళ్లి చేపలు పట్టడాన్ని ప్రోత్సహించవచ్చు. కావలసిన పడవలు సమకూర్చవచ్చు. కానీ ప్రభుత్వం ఈ మొత్తాన్ని కేటాయించడానికి సిద్ధంగా లేదు. కనీసం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడమూ లేదు. ఉన్నదల్లా జాలర్ల ఓట్లు కొల్లగొట్టడమే. కచ్చతీవు అంశాన్ని మోదీ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటున్నారు. తమిళనాడులో డి.ఎం.కె. ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమిళాడులోని అన్ని పార్టీలు కచ్చతీవుల మీద ఆధిపత్యం సంపాదించాలనే కోరతాయి. డి.ఎం.కె. దీనికి అతీతం కాదు. గతంలో కరుణా నిధి, జయలలిత ఇదే పనిచేశారు. దక్షిణాదిలో కాలు మోపడానికి అవకాశమే లేనందువల్ల తమిళుల మద్దతు సంపాదించడానికి మోదీ చేయని ప్రయత్నమే లేదు. ఒక దినపత్రికలో వచ్చిన వార్తను ఉటంకిస్తూ మోదీ ఈ అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్‌ అడ్డంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించిందని మొత్తం సమాచారం గురించి ప్రస్తావించకుండా అర్థ సత్యాలతో వివాదాన్ని పెద్దది చేయడమే మోదీ లక్ష్యం. 50 ఏళ్ల కింది కుదిరిన ఒప్పందాన్ని ప్రధాని ప్రస్తావించడం ఓట్ల కోసమే. జనావాసమే లేని కచ్చతీవుల్లో సెయింట్‌ ఆంథొనీ చర్చి ఫిబ్రవరి, మార్చి నెలల్లో వార్షిక ఉత్సవం నిర్వహిస్తుంది. భారత్‌-శ్రీలంక దేశాల వారు ఇందులో భాగస్వాములవుతారు. భారత జాలర్ల మీద శ్రీలంక దాడులకు నిరసనగా రామనాథపురంలోని జాలర్లు ఈ సారి ఉత్సవాన్ని బహిష్కరించారు. గత పదేళ్లనుంచి అధికారంలో ఊన్నా మోదీకి కచ్చతీవు అంశం గుర్తుకే రాలేదు. లోకసభ ఎన్నికలకు ముందే ఎందుకు రచ్చ చేస్తున్నారో సులభంగానే అర్థం అవుతుంది. మారిన భారత వైఖరిని నమ్మలేని స్థితిలో శ్రీలంక పడిపోయింది. బీజేపీ చేసిన పనివల్ల శ్రీలంకతో మన సంబంధాలు బెడిసిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే శ్రీలంక క్రమంగా చైనాకు చేరువ అవుతోంది. మాల్దీవులలో కూడా చైనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మన సంబంధాలకూ విఘాతం కలిగింది. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం విదేశాంగ విధానంతో ఆటలాడుకుంటే ద్వైపాక్షిక ఒప్పందాలకు ఏ దేశమూ ముందుకు రాని విపత్కర పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి నడవడిక వల్ల శ్రీలంకలో సంకుచిత జాతీయవాద శక్తులు బలపడతాయి. పాక్‌ జలసంధికి పొరుగున ఉన్న దేశాలు శ్రీలంకతో మనకు సత్సంబంధాలు లేకపోతే అనేక దేశాలు ఈ పరిస్థితిని తమకు అనువుగా మలుచుకుంటాయి. ఈ విషయం ప్రభుత్వ నిర్వాహకులకు తెలియదనుకోలేం. కానీ మోదీ దృష్టిలో ఏదైనా ఎన్నికల విజయం తరవాతే. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మోదీ ఏ అంశాన్ని ఆయుధంగా వాడతారో తెలియనప్పుడు ఇతర దేశాల వారు మనతో రహస్యాలు మాట్లాడడానికి నిరాకరించే ప్రమాదం ఉంటుంది. తక్షణ ప్రయోజనాలకోసం విదేశాంగ విధానాన్ని ప్రమాదంలో పడవేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img