Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

బ్రహ్మాస్త్రంగా మారిన పన్ను

ప్రతిపక్షాల మీద దాడి చేయడానికి, బీజేపీని వ్యతిరేకించే పార్ల్టీలన్నింటినీ అపఖ్యాతి పాలు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిలో నాలుగైదు ఆయుధాలు ఉండేవి. మోదీ కాంగ్రెస్‌ను ప్రధాన శత్రువుగా భావిస్తారు కనక వంశపారంపర్య పాలన అని దెప్పి పొడిచేవారు. ప్రతిపక్షాలన్నీ అవినీతిలో మునిగి తేలుతున్నాయనే వారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలో అంతర్భాగమైన ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్ట్టరేట్‌ (ఇ.డి.) చేత ఎడాపెడా దాడులు చేయించారు. ద్రవ్య అక్రమ చెలామణి చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు తమ ఆదాయ వివరాలను సవ్యంగా చూపలేదన్న సాకుతో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంకు ఆర్థికశాఖ నోటీసులు జారీ చేసింది. అంటే పన్ను కూడా మోదీ అమ్ములపొదిలో ఓ అస్త్రం అయింది. శుక్రవారం జారీచేసిన నోటీసుల ప్రకారం కాంగ్రెస్‌ రూ.1823 కోట్ల జరిమానా చెల్లించాలి. 14 కోట్ల జరిమానా చెల్లించాలని ఇదివరకే కాంగ్రెస్‌కు నోటీసు అందింది. ఇలా నోటీసు జారీ చేయడమే ఇదివరకు ఎన్నడూ లేనిది. అన్ని రాజకీయ పార్టీలకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉన్నా ఆదాయపు పన్ను శాఖకు లెక్కలు మాత్రం చూపించాలి. ఇప్పటికే కాంగ్రెస్‌ కు చెందిన 11 బ్యాంకు ఖాతాలను స్తంభింపచేశారు. అంటే ఆ ఖాతాల నుంచి ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి వీలులేదు. ఈ ఖాతాల్లో ఉన్న దాదాపు 200 కోట్ల రూపాయలను కాంగ్రెస్‌ వాడుకోవడానికి వీలు లేదు. జరిమానా చెల్లించాలని కాంగ్రెస్‌కు జారీ చేస్తున్న నోటీసులన్నీ ఇటీవలి లెక్కల్లో లోపాలు ఉన్నందుకు కాదు. పాత వివరాలను తవ్వితీసి జరిమానా విధించారు. 2019లో కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు ఇచ్చిన రూ.14 లక్షల విరాళాల లెక్కలు సవ్యంగా లేవని ఆరోపించి రూ.135 కోట్ల జరిమానా విధించారు. ఇది విచిత్రాల్లోకెల్లా విచిత్రం. ఎందుకంటే లెక్కలు సరిగ్గా లేవంటున్న మొత్తం లక్షల్లో ఉంటే జరిమానా కోట్లలో ఎలా ఉంటుందో దీనికి లెక్క ఏమిటో అంతు పట్టదు. పైగా పునర్మదింపు ఆధారంగా ఈ జరిమానా విధించినట్టు ఆదాయపు పన్ను శాఖ చెప్తోంది. అంటే మొదట ఆదాయపు పన్నుశాఖ అధికారులే సరిగ్గా అంచనా వేయలేక అసమర్థత చాటుకున్నారా? అలాంటప్పుడు చర్య వారి మీద ఉండాలి. అలా కాకుండా లెక్కలు చూపవలసిన పక్షానికి కనీ వినని రీతిలో జరిమానా విధించడం మోదీ మార్కు నియంతృత్వంలోని మరో కోణం కావచ్చు. పైగా ఈ లోపాన్ని కనిపెట్టడానికి ఆదాయపు పన్ను శాఖకు అయిదేళ్లు ఎందుకు పట్టినట్టో! త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగడమే దీనికి కారణం కావచ్చు. 1993-94 సంవత్సరానికి రూ.54 కోట్లు, 2016-17 సంవత్సరానికి రూ.182 కోట్లు, 2017-18 సంవత్సరానికి రూ.179 కోట్లు, 2018-19 సంవత్సరానికి 918 కోట్లు, 2019-20 సంవత్సరానికి రూ.480 కోట్లు జరిమానా విధించారు. ఇంత ఆలస్యంగా జరిమానా విధించడానికి ఆదాయ పన్ను శాఖ అసమర్థత కారణం అయి ఉండాలి. లేకపోతే ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్‌ చేతిలో డబ్బు లేకుండా మాడ్చి ఆ పార్టీని అశక్తం చేయాలన్న మోదీ ప్రభుత్వ ఎత్తుగడన్నా అయి ఉండాలి. రెండో కారణమే ప్రధానం అనిపిస్తోంది. 2019 ఎన్నికలలో కాంగ్రెస్‌ ధారాళంగా డబ్బు ఖర్చు చేసిందని ఆదాయపు పన్ను శాఖ నిర్ధారణకు వచ్చిందట. అందుకే 2018-19 సంవత్సరానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వకుండా పైగా భారీ మొత్తంలో జరిమానా విధించారు. ఆ తరవాత 2014-15 నుంచి 2020-21 లెక్కలు తవ్వి తీయడం మొదలు పెట్టారు. దీనంతటి వెనక భారీ కుట్ర కనిపిస్తూనే ఉంది.
ఆదాయపు పన్ను శాఖను పరిచారికగా చేసుకుని వేధించడం కాంగ్రెస్‌కు మాత్రమే పరిమితం కాలేదు. సిపీఐ, సీపీఐ(ఎం), తృణమూల్‌ కాంగ్రెస్‌ మీద కూడా ఇదే అస్త్రం ప్రయోగించారు. పాత పాన్‌కార్డు వినియోగించారన్న ఆరోపణపై సీపీఐకి నోటీసు పంపించారు. 2016-17లో ఒక బ్యాంకు ఖాతాను ఆదాయపు పన్ను రిటర్నులలో పేర్కొననందుకు సీపీఐ(ఎం) కు రూ.15.59 కోట్ల జరిమానా విధించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు కూడా దాదాపు డజను నోటీసులు అందాయట. ప్రతిపక్షాలను వేధించడానికి నోటీసుల మీద నోటీసులు పంపుతున్న ఆదాయపు పన్ను శాఖ ఇవే కొలమానాలను బీజేపీ మీద వినియోగించడం లేదు. ప్రతిపక్షాల మీద వినియోగించిన కొలమానాల ప్రకారమే చూస్తే బీజేపీ మీద రూ.4,617.58 కోట్ల జరిమానా విధించవలసి వస్తుంది. ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ ప్రకారం 2017-18లో బీజేపీ అందుకున్న 92 విరాళాల దాతల పేర్లే లేవు. ఈ మొత్తం రూ.4.5 లక్షలు. అలాగే 1297 మంది దాతలనైతే చూపించారు కాని వారి చిరునామాలు లేవు. పేరు లేని దాతలు కొందరు, పేరు ఉన్నా చిరునామా లేని దాతలు మరికొందరు. ఇదీ బీజేపీ తంతు. కానీ ఆదాయపు పన్నుశాఖకు ఈ లోపాలేమీ కనిపించవు. ఆదాయపు పన్నుశాఖ చట్టంలోని 13వ సెక్షన్‌ ప్రకారం రాజకీయ పార్టీలు ఆదాయపు పన్ను చెల్లించనక్కర్లేదు. కానీ జరిమానాలు మాత్రం బీజేపీని వ్యతిరేకించే పార్టీలకే విధిస్తున్నారు. అదీ లెక్కా పత్రం లేకుండా. ఏ పొరపాటుకు ఏ మేరకు జరిమానా విధించవచ్చో ఆదాయపు పన్ను చట్టంలో నిర్దిష్టంగా ఉంటుంది. మోదీ ప్రభుత్వ పనుపుపైన అయినా అడ్డగోలుగా జరిమానాలు విధించడానికి వీలు లేదు. కానీ మోదీ రాజ్యంలో ఏమైనా జరగొచ్చు. సకల దర్యాప్తు సంస్థలు బీజేపీకి అనుబంధ విభాగాలుగా పని చేస్తున్నాయి. వీటి ఆధారంగా ప్రత్యర్థి పక్షాల మీద కసి తీర్చుకుంటున్నారు. ఎన్నికలకు ముందు లెక్కా పత్రం, హద్దూ పద్దూలేని రీతిలో జరిమానాలో విధించి ప్రతిపక్షాలను అపఖ్యాతిపాలు చేయడానికి మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఎన్నికల బాండ్ల రూపంలో రూ.850 కోట్లు పోగేసుకోవడమే కాకుండా ఇతరత్రా విరాళాలను కూడా కలిపితే బీజేపీ ఖాతాకు రూ.1250 కోట్లకు పైగానే చేరాయి. మోదీ రంగంలోకి వచ్చిన తరవాతే ఎన్నికల వ్యయం విపరీతంగా పెరిగి పోయింది. 2019 ఎన్నికలలో మన దేశంలో ఖర్చు అయినంత డబ్బు ప్రపంచంలో ఏ దేశంలోనూ వెచ్చించలేదంటున్నారు. ఆదాయంలోనూ బీజేపీదే అగ్రస్థానం, చేతికి ఎముక లేనట్టుగా బీజేపీ ఖర్చు పెడ్తుంది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాత్రం తన దగ్గర ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన డబ్బులు లేవని పేద అరుపులు అరుస్తున్నారు. చోద్యం అంటే ఇదే. తాము ఎంత అబద్ధం ఆడినా జనం నమ్మేస్తారన్న నమ్మకం మోదీ మెదడులో బాగా నాటుకు పోయింది. అబద్ధాలను జనానికి అంతగా అలవాటు చేసిన ఘనాపాటి ఆయన. పన్ను కూడా మోదీ చేతిలో బ్రహ్మాస్త్రమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img