Friday, May 10, 2024
Friday, May 10, 2024

పదేళ్లు కోల్పోయిన యువత

విద్యార్థులు చదువులు పూర్తిచేసుకుని ఎన్నో ఆశలతో ఉపాధి, ఉద్యోగ మార్కెట్‌లోకి వస్తే నిరాశ కలుగుతుంది. డిగ్రీలు, పీజీ, రీసెర్చ్‌చేసిన యువతకు ఏ చిన్నపాటి ఉద్యోగమైనా చేయడానికి సిద్ధపడినా మార్కెట్‌లో లభించని స్థితి నెలకొంది. ముఖ్యంగా గత పది సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు, ఉపాధి లభించక ఆత్మహత్యలు చేసుకుం టున్నారు. వ్యవసాయరంగంలో, పారిశ్రామిక రంగంలో పనులు తగ్గిపోతున్నాయి. ఉద్యోగాలు, ఉపాధి లభించని వృద్ధి ఎవరికోసం? ఈ వృద్ధి సంపన్నులను పెంచింది. బీజేపీ నాయకత్వంలో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడిరది. ఆయన ప్రధానిగా గడచిన పదేళ్లలో బిలియన్ల నల్లధనులను, నిరుద్యోగ భారత్‌ను సృష్టించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానని, అవినీతిని, నల్లధనాన్ని రూపుమాపుతానని, విదేశాల్లో దాచుకున్న నల్ల ధనాన్ని వెనక్కు తెచ్చి ప్రతి కుటుంబానికి 15లక్షల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తానని, ఇలా వందల హామీలు ఇచ్చారు. ఆనాటి హామీలే ఇప్పుడు మోదీ గ్యారెంటీలుగా మార్చి ప్రచారం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ విధ్వంస భావజాలాన్ని విస్తరించి, దేశంలో మత విభజన కులాల ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తూ పాలన సాగిస్తున్నారు. 2014లో పార్లమెంటరీ ఎన్నికల ప్రచారంలో మోదీ విభజిత ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా ఇస్తానని అనేక ఎన్నికల ప్రచారసభల్లో హామీ ఇచ్చారు. మోదీ మాటల మాంత్రికుడు. ప్రతి యువకుడికి హోదా, గౌరవం గల ఉద్యోగాన్ని కల్పిస్తానని మోదీ వాగ్దానం చేశారు. ఆయన పాలన పదేళ్లు గడిచిన తర్వాత కూడా ఇంకా యువతకు హామీలు గుప్పిస్తూ దారుణంగా అబద్ధాలాడుతూ యువతను మోసగిస్తున్నారు. వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. తాజాగా మానవ అభివృద్ధిసంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) కలిసి సంయుక్తంగా రిపోర్టును విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో ఉద్యోగాలు, ఉపాధిలేని యువత 83 శాతం ఉన్నారని ఈ నివేదిక తెలియజేసింది. ఉద్యోగాలు కల్పించని వృద్ధి జరుగుతోంది. కానీ ఈ నివేదికలను మోదీ అంగీకరించరు. మాటల చాతుర్యంతో ఇంకా యువతను మోసగించే ప్రసంగాలు చేస్తున్నారు. 70 లక్షల యువత వ్యవసాయంలో ఉన్నారు. వీరంతా ఉపాధికోసం విదేశాలకు వలస వెళుతున్నారు. ప్రతి సంవత్సరం కోటి 30 లక్షల మంది యువత ఉద్యోగ, ఉపాధి మార్కెట్‌లోకి వస్తున్నారు. అలాగే కోటి 60 లక్షల మంది యవ్వనులు సమాజం లోకి వస్తున్నారు. దేశ జనాభాలో మూడిరట రెండువంతులు 35 ఏళ్ల లోపువాళ్లే. ఇండియా ఎంప్లాయిమెంట్‌ రిపోర్టు ప్రకారం, లక్షలాది మంది ఉద్యోగ అర్హతకు మించిన వయస్సు దాటిపోయారు. వీరికి ఏనాడు ఉద్యోగ పిలుపులు రాలేదు. నిరుద్యోగులలో 90 శాతం మందికి అసంఘటిత రంగంలో పనులు లభించాయి. 82 శాతం ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. స్వయం ఉపాధి రంగంలో 55.8 శాతం ఉన్నారు. ఈ గణాంకాలు ప్రతి ఏడాది మారిపోతుంటాయి. చదువరులు లక్షలమంది ఉద్యోగ మార్కెట్‌లోకి వస్తుంటారు గనుక గణాంకాలు మారుతాయి.
మార్చి 20 వ తేదీ వారం రోజుల ముందు ఎన్నికల ప్రచార సభల్లో మహాకుంభ్‌లో మాట్లాడుతూ,‘‘ యువత ఉద్యోగం కోరకుండా ఉద్యోగాలు సృష్టించేవారుగా’’ మారుతున్నారని చెప్పారు. దేశంలో నిరుద్యోగ తీవ్రత పరిస్థితిని తక్కువగా చూపించి, యువతను మభ్యపెట్టి, మోసగించడానికి మోదీ చేసిన ప్రసంగమే తప్ప మరొకటికాదు. ఒక స్టార్టప్‌ను ఆయన ఇక్కడ ప్రారంభించారు. దేశంలో స్టార్టప్‌లు అభివృద్ధి చెందలేదన్న వార్తలను మోదీ ప్రస్తావించరు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు అనవసరమన్న విధంగా మాట్లాడుతున్నారు. నిరుద్యోగ భారతాన్ని వదిలేసి సంపన్నులను మరింత సంపన్నులుగా చేసే విధానాలనే మోదీ ప్రభుత్వం చేస్తోంది. నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని సర్వేలు ప్రకటించాయి. విదేశీ, స్వదేశీ ఈ సర్వేలను ప్రధాని, బీజేపీ, ఆర్‌ఎఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంఘాలు నమ్మవు. ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌, కార్మిక, నిరుద్యోగుల సమస్యలను అధ్యయనం చేసి అందించే త్రైపాక్షిక సంస్థలు సిఫారసు చేసినప్పటికీ ‘‘ జాతీయ ఉపాధి విధానం’’ రూపొందించలేదు. 45 ఏళ్ల కాలంలో అత్యధిక నిరుద్యోగం దేశంలో ఉందని అనేక సర్వేల నివేదికలు చెబుతున్నాయి. నిరుద్యోగంపై మోదీ పదేళ్లలో కనీసం ఒక సదస్సును నిర్వహించలేదు. అగ్నివీర్‌ పేరుతో కొన్ని వందల మందికి తాత్కాలిక ఉద్యోగాలు కల్పించారు. ఖాళీగా ఉన్న పోస్టులు కొన్నిటిని భర్తీ చేశారు. లక్షలాది ఉద్యోగాలు కల్పించినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్ర ట్రేడ్‌ యూనియన్లను కనీసం సంప్రదించకుండానే 40 కిపైగా చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్‌లను రూపొదించారు. 45 ఏళ్ల కాలంలో ఏనాడు లేనంతగా 6.1 శాతానికి పైగా ఉంది. అన్ని రంగాలను ప్రైవేటుపరం చేసి రానున్న కాలంలో మరింత మందిని నిరుద్యోగులను తయారుచేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించే అవకాశంలేని మోదీ ప్రభుత్వం రూపొందించే విధానాలు తెలియజేస్తున్నాయి. ఆయన విధానాలు బడా వాణిజ్యవేత్తలకు, కార్పొరేట్లకు, లక్షల వేతనాలు పొందుతున్నవారికి బాగా నచ్చుతున్నాయి. దేశాభివృద్ధికి అతి ముఖ్యమైన విద్య, వైద్య రంగాలను ప్రైవేటుపరం చేస్తూ క్రమంగా డబ్బున్న వాళ్లకే చదువుకొనే అవకాశం రావచ్చు. బ్యాంక్‌లను సైతం నెమ్మదిగా ప్రైవేటుపరం చేయనున్నారు.
బ్యాంకులకు చెల్లించవలసిన బకాయులను ఎగవేసి పారి పోయిన దేశ ద్రోహుల నుంచి డబ్బు వసూలు చేయకుండా దాదాపు 15 లక్షల కోట్లను రద్దు చేశారు. వ్యవసాయాన్ని నల్లధనులకు కట్టబెట్టేందుకు చూస్తున్నారు. ఈ చర్యల వల్ల వల్ల నిరుద్యోగం పెరుగుతుందేకానీ, ఉద్యోగాలు లభించే అవకాశం తగ్గిపోతుంది. నిరుద్యోగ యువత చేతల్లోనే నియంతృత్వం నివారించి మెరుగైన సమాజాన్ని నివారించే అవకాశం ఉంది. హిందూత్వ భావజాలంతో దేశంలో సమస్యలు తీరే అవకాశం లేదు. మాటల చాతుర్యంతో మోసగిస్తున్నారు. అందువల్ల యువత మేల్కోవాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img