Monday, May 20, 2024
Monday, May 20, 2024

అతివలే న్యాయ నిర్ణేతలు

తొలి ఎన్నికలలోనే సీపీఐ ప్రాతినిధ్యం.. వలస పక్షులదే విజయం

రాజకీయ చైతన్యానికి ప్రతీక ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం అనడంలో సందేహం లేదు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పటికప్పుడు కొత్త పోకడలను ప్రదర్శిస్తాయి. మారుతున్న కాలం ప్రకారం ప్రజల ఆలోచన ధోరణిలో కూడా వేగవంతమైన మార్పు చోటు చేసుకుంటుంది. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే ఏలూరు ప్రజానీకం ఎక్కువ శాతం వివిధ వ్యాపారాలు చేస్తూ జీవనం కొనసాగిస్తుంటారు. ఒకసారి విజయం సాధించిన అభ్యర్థి పనితీరు, గుణగణాలను బట్టి వచ్చే ఎన్నికలలో గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ప్రజోపయోగ కార్యక్రమాలు చేసిన అభ్యర్థులకు మాత్రమే ఏలూరు ప్రజలు పట్టడం కడతారంటే రాజకీయ చైతన్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. 1952 నుంచి నేటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు 14 మంది ఎన్నికయ్యారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు, వైశ్యుల నుంచి ఒకరు, వెలమ సామాజిక వర్గం నుంచి ఒకరు ఎన్నికయ్యారు. 17 సార్లు జరిగిన ఎన్నికలలో సీపీఐ 2 సార్లు, కాంగ్రెస్‌ పార్టీ 9 సార్లు, తెలుగుదేశం 5సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించింది. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంతో సంబంధంలేని కావూరి సాంబశివరావు రెండు సార్లు, సూపర్‌ స్టార్‌ కృష్ణ, తణుకు పట్టణానికి చెందిన చిట్టూరి సుబ్బారావు చౌదరి ఇక్కడ నుంచి గెలుపొందడం విశేషం.
యువకుల మధ్య రసవత్తర పోరు….
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమి తరుపున కడప జిల్లాకు చెందిన పుట్టా మహేష్‌ యాదవ్‌, వైసీపీ తరఫున పౌర సరఫరాల మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్‌ కుమార్‌ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల సరళని పరిశీలిస్తే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన అభ్యర్థులే విజయం సాధించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఇద్దరూ హోరాహోరీగా తలపడుతున్నారు. అభ్యర్థులు ఆర్థిక బలం, రంగ బలంతో నియోజకవర్గంలో ఇప్పటికే యువత, తటస్తుల ఓట్లను పొందడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
దీటైన పోటి ఇస్తున్న ఇండియా కూటమి అభ్యర్థి కావూరి లావణ్య
ఇండియా కూటమి అభ్యర్థిగా కావూరి లావణ్య పోటీ చేస్తున్నారు. సీపీఐ, సీపీఎం, ఆమ్‌ ఆద్మీపార్టీ ఆమెకు పూర్తిగా మద్దతు పలికి ప్రచారంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. వామపక్షాలు గత పది ఏళ్ల కాలంలో బీజేపీి వైఫల్యాలు, రాష్ట్రంలో ఐదసంవత్సరాల పాలనలో జరిగిన దౌర్జన్య కాండ, రాక్షస పాలన ప్రజలకు వివరించడంలో కృతకృత్యులయ్యారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల చేసిన పర్యటన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జోష్‌ ను నింపింది. దీంతో ఓట్ల చీలిక ఏ పార్టీ ఏరాజయానికి కారణం అవుతుందో అని వైసీపీ,టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అతివలే న్యాయ నిర్ణేతలు…
ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం జనవరి నాటికి 16,24,416 ఓటర్లు ఉండగా పురుషులు 7,93,897 కాగా, మహిళలు 8,30, 390 ఉన్నారు. ప్రధానంగా ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, నూజివీడు, కైకలూరు నియోజకవర్గంలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మహిళల ఓటింగ్‌ సరళిని బట్టి అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.
విశాలాంధ్ర బ్యూరో ఏలూరు

తొలినాళ్లలోనే సీపీఐ విజయం
1952లో ఏలూరు పార్లమెంటు ద్విసభ్య నియోజక వర్గంగా ఉండేది. అప్పుడు గెలిచిన ఇద్దరూ దళిత నేతలు కావడం విశేషం. సీపీిఐ తరఫున కోండ్రు సుబ్బారావు, కిసాన్‌ మజ్దూర్‌ పార్టీ తరఫున బీఎన్‌ మూర్తి విజయం సాధించారు. 1957లో కాంగ్రెస్‌ పార్టీ తరపున కేఎం. వేద కుమారి సీపీఐ అభ్యర్థి వీరమాచనేని విమలాదేవిపై విజయం సాధించారు. అనంతరం 1962లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో వేద కుమారిపై సీపీఐ తరఫున వీరమాచినేని విమలాదేవి విజయం సాధించారు. స్వాతంత్రం సిద్ధించిన తొలినాళ్లలోనే ఈ నియోజకవర్గానికి సీపీఐ ప్రాతినిధ్యం వహించి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. 2019 ఎన్నికలలో వైసీపీ తరఫున కోటగిరి శ్రీధర్‌ ఎన్నికయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img