Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

కేజ్రీవాల్‌కు ఊరట

. జైలు నుంచి పాలనతో మీకేంటి నష్టం
. పిటిషన్‌ కొట్టివేసిన దిల్లీ హైకోర్టు
. ఈడీ కస్టడీ 1 వరకు పొడిగింపు
. విచారణకు సిద్ధం: ఆప్‌ అధినేత

న్యూదిల్లీ : మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో అరెస్టు అయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. జైలు నుంచి పరిపాలన సాగించేందుకు అభ్యంతరమేమున్నదని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. న్యాయపరంగానూ ఎలాంటి అడ్డంకులు లేవని పేర్కొంటూ ఆ మేరకు దాఖలైన పిల్‌ను కొట్టివేసింది.
పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఆచరణాత్మక ఇబ్బందులు ఉండవచ్చు కానీ సీఎంగా కొనసాగడానికి ఉన్న న్యాయపరమైన అడ్డంకి ఏమిటని పిటిషనర్‌ను ప్రశ్నించింది. న్యాయపరంగా ఎలాంటి ఆటంకాలు లేవని, పాలనాపరమైన నిర్ణయం జరగాల్సిందేనని తెలిపింది. మరోవైపు కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీని ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు పొడిగిస్తూ దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఏడు రోజుల కస్టడీ ముగియడంతో ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఎదుట కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఈడీ మరో ఏడు రోజుల కస్టడీ కోరగా… నాలుగు రోజులకు కోర్టు అనుమతిచ్చింది. ఏప్రిల్‌1న ఉదయం 11 గంటలకు కేజ్రీవాల్‌ను తిరిగి హాజరుపరచాలని ఆదేశించింది.
మా జోక్యం అక్కర్లేదు: హైకోర్టు
ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను దిల్లీ సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)ను దిల్లీ హైకోర్టులో ఆపద్ధర్మ ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ నేతృత్వంలోని జస్టిస్‌ మన్‌మీత్‌ పీఎస్‌ అరోరాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించే విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. చట్టప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది ప్రభుత్వంలోని వివిధ శాఖలు నిర్ణయించుకోవాలని సూచించింది. జైలు నుంచి పరిపాలన సాగించడం సవాళ్లతో కూడుకొన్నదని, చాలా కష్టాలు ఎదుర్కొవాల్సి రావచ్చని అంగీకరిస్తాము గానీ… ఈ వ్యవహారంలో న్యాయపరమైన జోక్యం అవసరమేమీ కనిపించడం లేదని ధర్మాసనం స్పష్టంచేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడం లేదని తెలిపింది. రాష్ట్రపతి లేక గవర్నర్‌ పాలనను న్యాయస్థానం విధించదని, దీనిపై కార్యనిర్వాహక విభాగం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టంచేశారు. ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగేందుకు ఆటంకాలు ఏమిటో చెప్పండి. రాజ్యాంగబద్ధ వైఫల్యం జరిగితే రాష్ట్రపతి లేక గవర్నర్‌ తగు చర్యలు తీసుకుంటారు. దానిపై మేము చర్యలు తీసుకోం. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి, మంత్రిమండలి చూసుకోవాలి. ఏం చేయాలో వారికి తెలుసు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎలా నడుచుకోవాలన్న అవగాహన వారికి ఉంటుంది. రాష్ట్రపతి పాలన లేక గవర్నర్‌ పాలనను హైకోర్టు విధించదు’ అని జస్టిస్‌ మన్మోహన్‌ తెలిపారు.
మరో నాలుగు రోజులు కస్టడీలోనే
ఏప్రిల్‌ 1 వరకు కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడిని పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఆదేశాలిచ్చారు. మరో ఏడు రోజుల కస్టడీని ఈడీ కోరగా నాలుగు రోజులకు అనుమతిచ్చారు. కేజ్రీవాల్‌ విచారణ క్రమంలో ఐదు రోజులు వాంగ్మూలాలు తీసుకున్నామని, ఆయన సహకరించలేదని, సమాధానాలు దాటవేశారని, డిజిటల్‌ పరికరాల పాస్‌వర్డ్‌లు వెల్లడిరచలేదని రిమాండ్‌ రిపోర్టులో ఈడీ పేర్కొంది. మరో ముగ్గురి వాంగ్మూలాలు సైతం రికార్డు చేసినట్లు తెలిపింది. కేజ్రీవాల్‌ను గోవా ఆప్‌ నేతలతో కలిసి విచారించాలని, పంజాబ్‌ అధికారులకు సైతం సమన్లు పంపామని ఈడీ పేర్కొంది.
సీఎం అరెస్టుకు ఆ నాలుగు సాక్ష్యాలు చాలా: కేజ్రీవాల్‌
కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చిన సమయంలో దిల్లీ సీఎం తన కేసును తానే వాదించుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులకు రెండు లక్ష్యాలు ఉన్నాయని, మొదటిది తనను ఈ కేసులో ఇరికించడం… రెండవది ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) లేకుండా చేయడమేనని కోర్టుకు తెలిపారు. ఆప్‌ను అణచివేసేందుకు ఈడీ యత్నిస్తోందని ఆరోపించారు. ఈ కేసులో తన పేరును నలుగురు సాక్షులు మాత్రమే ప్రస్తావించారని, ఒక సీఎంను అరెస్టు చేసేందుకు ఆ వాంగ్మూలాలు సరిపోతాయా అని ఈడీని ప్రశ్నించారు. ఆప్‌ను అవినీతి పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని కేజ్రీవాల్‌ స్పష్టంచేశారు. దిల్లీ మద్యం కేసులో రూ.100 కోట్ల అవినీతి జరిగినట్లు ఈడీ చెబుతోంది…మరి ఆ డబ్బు ఎక్కడ? ఈ కేసులో తనను అరెస్టు చేసేందుకు ఈడీ వద్ద సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈడీ వద్ద సాక్ష్యాధారాలు లేనప్పుడు ఏ కోర్టు కూడా తనను దోషిగా పరిగణించలేదన్నారు. మద్యం కేసులో సీబీఐ దాఖలు చేసిన 31 వేల పేజీల చార్జిషీటులోగానీ, ఈడీ దాఖలు చేసిన 25 వేల పేజీల చార్జిషీటులోగానీ తన పేరు లేదన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చార్జిషీట్లలో పేరే లేనప్పుడు తనను ఎలా అరెస్టు చేస్తారు… తప్పుడు కేసులో ఇరికించడమే ఈడీ లక్ష్యమా అంటూ కేజ్రీవాల్‌ నిలదీశారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన ఆరు వాంగ్మూలాల్లో తన పేరు లేదన్నారు. శరత్‌ చంద్రారెడ్డి అరెస్టైన తర్వాత రూ.55 కోట్ల ఎన్నికల బాండ్లు బీజేపీకి చేరాయని, ఆయనతో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆరోపించారు. అంతకుముందు కోర్టుకు తరలించే సమయంలో విలేకరులతో మాట్లాడుతూ ‘ఇది రాజకీయ కుట్ర. దీనికి ప్రజలే సమాధానం చెబుతారు’ అని కేజ్రీవాల్‌ అన్నారు.
నా భర్తను వేధిస్తున్నారు: సునీత
కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈడీ అధికారులు ఆయనను వేధిస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్‌ విచారణ సందర్భంగా కోర్టుకు హాజరైన సునీత అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ‘నా భర్త ఆరోగ్యం బాగా లేదు. చక్కెరస్థాయిలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈడీ అధికారులు ఆయనను వేధిస్తున్నారు. ఈ దౌర్జన్యం ఎంతోకాలం సాగదు. ప్రజలే తగిన సమాధానం చెబుతారు’ అని అన్నారు. ఆప్‌ మంత్రులు అతిశి, గోపాల్‌ రాయ్‌, సౌరభ్‌ భరద్వాజ్‌ కూడా కోర్టు వద్దకు వచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img