Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

కేజ్రీవాల్‌ జైలుకు…గాలి బీజేపీలోకి…

రామకృష్ణ విమర్శ

విశాలాంధ్ర – విజయవాడ: మద్యం కుంభకోణం పేరుతో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను జైలుకు పంపిన బీజేపీ ప్రభుత్వం…మైనింగ్‌ అక్రమాలకు పాల్పడి, జైలుకెళ్లి, ఇప్పటికీ కేసులు ఎదుర్కొంటున్న గాలి జనార్దనరెడ్డిని మాత్రం తమ చెంతకు చేర్చుకున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ‘ఇవేనా బీజేపీ చెబుతున్న నీతి రాజకీయాలు? భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడినప్పటికీ బీజేపీలో చేరగానే అక్రమార్కులంతా శుద్దులైపోతారా’ అని రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో బీజేపీని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ నీతిమాలిన, క్షుద్ర రాజకీయాలను ప్రజలందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. రూ.100 కోట్ల మద్యం కుంభకోణం సాకుతో కేజ్రీవాల్‌ను బీజేపీ ప్రభుత్వం జైలుకు పంపేందుకు సిద్ధమైందని, ఇదే కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను ఏడాదికాలంగా కక్షపూరితంగా జైల్లోనే ఉంచిందని విమర్శించారు. వేలకోట్ల రూపాయల మైనింగ్‌ కుంభకోణానికి పాల్పడి, జైలుకెళ్లి, బళ్లారి జిల్లా నుండి వెలివేతకు గురైన గాలి జనార్దనరెడ్డిని మాత్రం బీజేపీ అక్కున చేర్చుకున్నదని మండిపడ్డారు. మరోపక్క ఏపీలో మద్యం అమ్మకాలలో వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్ర హోంమంత్రికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీ దుష్ట నిర్ణయాలకు వంతపాడుతున్నందునే మోదీ సర్కారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దీనిని బట్టి బీజేపీ కక్షపూరిత రాజకీయాలు ప్రజలందరికీ అర్థమవుతున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు, వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వం…తమకు అనుకూలమైన వారు ఎన్ని అక్రమాలు చేసినప్పటికీ అక్కున చేర్చుకుంటుందన్నారు. వారి కేసుల మాఫీకి ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. ఇది బీజేపీ అవకాశవాద, నీచ, బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు నిదర్శనమని నిందించారు. బీజేపీ చేస్తున్న నీతిమాలిన రాజకీయాలను, కక్షపూరిత విధానాలను ప్రజాతంత్రవాదులంతా తీవ్రంగా ఖండిరచాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img