Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

దేశాన్ని రక్షించుకుందాం

. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపు
. రాష్ట్రంలో పండుగలా ప్రపంచ కార్మిక దినోత్సవం
. వాడవాడలా ఏఐటీయూసీ, సీపీఐ పతాక ఆవిష్కరణలు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు పండుగలా జరుపుకున్నారు. వాడవాడలా ఏఐటీయూసీ, సీపీఐ పతాకాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఐక్యతను చాటుతూ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు నిర్వహించారు. మేడే వర్థిల్లాలి, ప్రపంచ కార్మిక ఐక్యత వర్థిల్లాలి, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంకెళ్ళు తప్ప అంటూ కార్మికులు దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. అనేక చరిత్రాత్మక పోరాటాలు, మహానేతల త్యాగాలతో సాధించుకున్న కార్మిక హక్కులను రక్షించుకుంటామని శపథం చేశారు. కార్పొరేట్‌ వర్గాలకు కొమ్ముకాస్తూ కార్మిక చట్టాల రద్దుకు యత్నిస్తున్న పాలకులకు ఘోరీ కడతామని హెచ్చరించారు. సీపీఐ, ఏఐటీయూసీ అధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ మేడే వేడుకల్లో ప్రజలు పార్టీలకతీతంగా పాల్గొని సంఫీుభావం తెలియజేశారు. రాజమహేంద్రవరంలో సీపీఐ, ఏఐటీయూసీ, రాజమండ్రి జట్లు లేబర్‌ యూనియన్‌ సంయుక్తంగా వేలాదిమంది కార్మికులతో భారీ ప్రదర్శన చేపట్టి బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు జట్లు లేబర్‌ యూనియన్‌ అధ్యక్షులు కొండ్రపు రాంబాబు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిధిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ కార్మికదినం మేడే స్ఫూర్తితో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఇండియా కూటమిని బలపర్చి దేశాన్ని రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సంఫీుభావం తెలియజేసిన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ది గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ అధికారం లోకి వస్తే రాష్ట్రానికి సుపరిపాలన వస్తుందని అన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే బీజేపీని గద్దె దించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు సీపీఐ నగర కార్యదర్శి వి.కొండలరావు తదితరులు ప్రసంగించారు.
కార్మికులు కన్నెర్ర చేస్తే మసే: ముప్పాళ్ల నాగేశ్వరరావు కార్మికులు కన్నెర్ర చేస్తే పాలకులకు పతనం తప్పదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. సంగడిగుంట రేగుల రాఘవయ్య భవన్‌ వద్ద సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు జీవీ కృష్ణారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడే ప్రాశస్థ్యాన్ని వివరించారు. ఎనిమిది గంటల పని విధానం కోసం చికాగో కార్మికులు చేసిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. దీనికి తూట్లు పొడిచేందుకు, కార్మిక చట్టాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, కార్మికులు మేడే స్ఫూర్తిగా దీనిని తిప్పికొట్టేందుకు మరో సమరశీల పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి, చల్లా చినఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఐక్యతతోనే హక్కుల సాధన: జేవీ సత్యనారాయణమూర్తి కార్మికులంతా ఐక్యంగా పోరాటాలు చేయడం ద్వారానే హక్కులు సాధ్యపడతాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. పారిశ్రామిక ప్రాంతం పరిధిలోని కోరమండల్‌ గేట్‌ వద్ద కోరమండల్‌ కాంట్రాక్టర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి, జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద విశాఖపట్నం కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని పతాకావిష్కరణలు చేశారు. నగరంలో దాదాపు 32 ఆటో స్టాండ్స్‌లలో కూడా ఏఐటీయూసీ పతాకాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా జేవీఎస్‌ మూర్తి మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, పీిఎఫ్‌ ఈఎస్‌ఐ సక్రమంగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనికి తగ్గ వేతనాన్ని చెల్లించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కార్మికులంతా ఐక్యతగా ఉండి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
హక్కుల సాధనకు ప్రతీక ఎర్రజెండా: జల్లి విల్సన్‌
కార్మిక, కర్షకుల హక్కుల సాధనకు, సంక్షేమ రాజ్య స్థాపనకు ప్రతీక ఎర్రజెండా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాలాంధ్ర కార్యాలయంలో సీపీఐ పతాకాన్ని జల్లి విల్సన్‌ బుధవారం ఆవిష్కరించారు. సీపీఐ విశాలాంధ్ర శాఖ కార్యదర్శి పి. మధుసూదనరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల పోరాటం, మేడే ఆవిర్భావం, దాని ప్రాశస్థ్యం గురించి వివరించారు. పదేళ్ల మోదీ పాలనలో కార్మిక హక్కులు కాలరాయబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యాలు శారీరక శ్రమ చేసే కార్మికులనే కాకుండా మేథోవర్గం మానసిక శ్రమను కూడా దోపీడి చేస్తున్నాయని హెచ్చరించారు. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవటానికి ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. సీపీఐ విశాలాంధ్ర శాఖ సహాయ కార్యదర్శి వి.రమేశ్‌ వందన సమర్పణ చేశారు.
శ్రమ దోపిడీపై గర్జించండి: ఓబులేసు
వచ్చే ఎన్నికల్లో కార్మిక వ్యతిరేక శక్తులను ఓడిరచాలని, కార్పొరేట్‌ శక్తుల శ్రమ దోపిడీపై గర్జించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.ఓబులేసు పిలుపునిచ్చారు. 138వ మేడే ఉత్సవాలు సందర్భంగా విశాఖలో సీతమ్మధార జంక్షన్‌ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద, కేజీహెచ్‌ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓబులేసు మాట్లాడుతూ నమో అంటే నరేంద్ర మోదీ కాదని నమ్మించి మోసం చేయడం అని తెలుసుకోవాలన్నారు. భారత దేశంలో కార్మిక హక్కులకు,చట్టాలకు పెను ప్రమాదం ఏర్పడిరదని, దీనిపై మరో సమరశీల పోరాటం చేయడానికి కార్మికులు ఐక్య కార్యాచరణ ద్వారా ఉద్యమాలకు సిద్ధం కావాలని ఓబులేసు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, జిల్లా కార్యదర్శిలు పడాల గోవిందు, కోటా సత్తిబాబు, అడ్డూరి శంకర్‌, జేడీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పెరుగుతున్న శ్రమ దోపిడీ: హరినాథ్‌రెడ్డి
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ శ్రమ దోపిడీ పెరుగుతోందని సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు పి.హరినాథరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి నగరం బైరాగపట్టెడలోని గంథమనేని శివయ్య భవన్‌ వద్ద బుధవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హరినాథరెడ్డి మాట్లాడుతూ కార్పోరేట్‌ సంస్థలు శ్రమజీవుల హక్కులు కాలరాస్తూ పనిగంటల సంఖ్య పెంచేస్తున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే మళ్లీ మనం ఆటవిక పాలనలోకి పోతున్నామోననే అనుమానం కలుగుతోందన్నారు. కార్మికుల శ్రమదోపిడీ రూపాలు మారుతున్నాయన్నారు. ఇపుడు మళ్లీ 12గంటల పని దినాలు వస్తున్నాయని, దీనిపై కార్మిక శక్తులు ఐక్యతతో మేడే స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, జల్లా విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.
హక్కుల కోసం పోరాటాలు ఉదృతం చేయాలి: డేగా ప్రభాకర్‌
కార్మికుల హక్కులను హరిస్తున్న కార్పొరేట్‌ కంపెనీలు, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్య ఉద్యమాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయం వద్ద ఏఐటీయూసీ పతాకాన్ని డేగా ప్రభాకర్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మే డే స్ఫూర్తితో రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం కార్మికులు పోరాటాలు చేయాలన్నారు.ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య, ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బండి వెంకటేశ్వరరావు, సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక హక్కుల రక్షణకై పోరాడండి: రావులపల్లి రవీంద్రనాథ్‌
కార్మిక హక్కుల రక్షణకై ఐక్యతతో పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం, గడియార స్తంభం సెంటర్లో ఏఐటీయూసీ పతాకాలను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు సాధించిన హక్కులను కాలరాస్తున్నాయని, వారి యత్నాలను తిప్పికొట్టేందుకు కార్మికులందరూ ఒక తాటిపై ఉద్యమబాట పట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కే హనుమంతరావు, జె కోటేశ్వరరావు,ఆర్‌ కరుణానిధి, కల్లూరి చిన్న అంజనేయులు కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పని గంటలు పెంచితే ప్రతిఘటన తప్పదు : చలసాని వెంకటరామారావు
ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా నూజివీడు టౌన్‌, మండలంలో ఘనంగా మేడే 138 వ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ నూజివీడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చాట్ల పుల్లారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చలసాని వెంకట రామారావు ప్రసంగించారు. నూజివీడు మండలంలో పోతిరెడ్డిపల్లి, రావిచెర్ల, దిగువల్లి , వెంకటాద్రిపురం, మేడే ఉత్సవాలు జరిగాయి. పోతిరెడ్డిపల్లిలో మడుపల్లి నాగేంద్రరావు, అక్కినేని వరప్రకాశరావు రావిచర్ల నాగరాజు, రాంబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బీజేపీని ఓడిరచాలి: సీహెచ్‌ కోటేశ్వరరావు
భారత రాజ్యాంగం స్పూర్తితో భిన్నత్వంలో ఏకత్వంగా మనుగడ సాగిస్తున్న జాతి ప్రతిష్ట మనుగడలకు తమ నీచమైన మతోన్మాద రాజకీయ కుయుక్తులతో మంట కలుపుతున్న బీజేపీని ఓడిరచాలని ఆంద్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్‌ కోటేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుడ్డి రమేష్‌, ఎస్‌కే జిలానీ, బి.రాము, రాజు, హర్షద్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img