Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

బీజేపీ ఓటమి ఖాయం

. అందుకే మోదీ స్వరం మారింది
. బీజేపీతో పొత్తు టీడీపీకి నష్టం
. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

విశాలాంధ్ర`తాడేపల్లి: దేశంలో బీజేపీ ఓటమి ఖాయమైంది కనుకే ప్రధాని నరేంద్ర మోదీ…అదానీ, అంబానీలను తిట్టడం మొదలు పెట్టారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఇండియా కూటమి బలపర్చిన సీపీఎం మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి జొన్నా శివశంకరరావు, గుంటూరు పార్లమెంటు సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్‌కుమార్‌లను గెలిపించాలని కోరుతూ బుధవారం సాయంత్రం తాడేపల్లిలో కృష్ణుడు గుడి ఎదుట సీపీఎం గుంటూరు జిల్లాకార్యదర్శి పాశం రామారావు అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ఏచూరి మాట్లాడారు. తొలుత ‘నయవంచన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ… దేశంలో రాజ్యాంగాన్ని, లౌకికతంత్ర పునాదులను కాపాడుకోవాలన్నా ఇండియా కూటమి పక్షాల అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. దేశాన్ని కాపాడుకోవాలంటే ఇండియా కూటమి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. మూడు దశల్లో జరిగిన
ఎన్నికల సరళి, ఓటింగు తీరును గమనిస్తే… మోదీ, బీజేపీపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. అందుకనే అదానీ, అంబాలనీలను మోదీ తిడుతున్నారని, కాంగ్రెస్‌కు నిధులిచ్చారని విమర్శిస్తున్నారని ఏచూరి పేర్కొన్నారు. మోదీ అభద్రతాభావమే ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిసిపోతోందన్నారు. గుంటూరు పార్లమెంటు సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్‌కుమార్‌, సీపీఎం మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి జొన్నా శివశంకరరావును గెలిపించాలని కోరారు.ఓటమి ఖాయమని తెలియడంతోనే మోదీ హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు పెంచేవిధంగా మాట్లాడుతున్నారన్నారు. లవ్‌ జిహాద్‌, గోరక్షణ పేరుతో దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. పదేళ్ల మోదీ పాలనలో దేశం రెండు విధాలుగా మారిందని, ఒకపక్క ధనికదేశం, రెండో పక్క పేద దేశంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. పేదలు రుణాలు చెల్లించకపోతే ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకులు పెద్దలకు రూ.16 లక్షల కోట్ల రాయితీలు ఇచ్చాయని తెలిపారు. సహజ వనరులను లూటీ చేశారని, అటవీ ప్రాంతం నుండి గిరిజనులను తరిమేసేలా చట్టాల్లో మార్పులు తెచ్చారని అన్నారు. దేశంలో ప్రతి గంటకు మహిళలపై 46 దాడి ఘటనలు జరుగుతున్నాయ న్నారు. ఒకప్పుడు రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని చెప్పిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ఏం న్యాయం చేసిందని బీజేపీతో కలిశారో సమాధానం చెప్పాలన్నారు. గతంలో వాజ్‌పేయి కాలంలోనూ ఇలాగే చేసి పదేళ్లపాటు అధికారానికి దూరమయ్యారని, ఇప్పుడూ అదే పరిస్థితి వస్తుందన్నారు. బీజేపీతో కలవడం టీడీపీకి నష్టమని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యం అపహాస్యం: రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ… రాష్ట్రంలో జగన్‌ ప్రజాస్వామ్యాన్ని ఆపహస్యం చేశారని, ఈసారి ఎన్నికల కోసం రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. దళితులు, వెనుకబడినవర్గాలు, మైనార్టీలకు స్థానం లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ప్రతిపక్షాలను కలవని ఏకైక సీఎం జగన్‌మోహన్‌రెడ్డేనని… అధికారంలో ఉండటానికి ఆయనకు ఏ మాత్రం అర్హత లేదని తెలిపారు. ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు బీజేపీతో కలిశాడో ప్రజలకు చెప్పాలన్నారు. ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌ వలీ మాట్లాడుతూ మోదీ పాలనలో భారతజాతికి ప్రమాదం వచ్చిందని అన్నారు.
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి: ముప్పాళ్ల
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ… ఇండియా కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్యాస్‌ ధరను రూ.410నుండి రూ.20 పెంచినందుకు బీజేపీ నాయకులు నెత్తిన గ్యాస్‌ బండలు పెట్టుకుని నిరసన తెలిపారని… వారి పాలనలో గ్యాస్‌ ధర రూ.1000 దాటిందని చెప్పారు. పేద ప్రజలకు రాష్ట్రంలో కొద్దో గొప్పో ఇళ్లు, ఇళ్ల స్థలాలు వామపక్ష పార్టీల పోరాటాలు ఫలితమేనన్నారు. కేసులకు భయపడకుండా, కోర్టులు చుట్టూ తిరుగుతూ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మాజీ ఎంపీ పి.మధు మాట్లాడుతూ దేశం బాగు పడాలంటే కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, జగన్‌ అధికారంలోకి రాకూడదని అన్నారు. వీరంతా కలిసి దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని మండి పడ్డారు. గుంటూరు పార్లమెంటు సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్‌కుమార్‌, మంగళగిరి సీపీఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు, తాడేపల్లి మాజీ సర్పంచ్‌ డి. శ్రీనివాసకుమారి, ఆవాజ్‌ రాష్ట్ర నాయకులు చిస్తీ తదితరులు మాట్లాడారు. తొలుత సిపిఎం నాయకులు బూరుగ వెంకటేశ్వరరావు వక్తలను వేదిక మీదకు ఆహ్వానించారు. ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన నృత్యరూపకాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య,సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, పీసీసీ జిల్లా అధ్యక్షుడు లింగం శెట్టి ఈశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు రంగయ్య, ఎస్‌.ఎస్‌ చెంగయ్య, ఎం.రవి, ఈమని అప్పారావు, వై.నేతాజీ, ఎస్‌.భావాన్ననారాయణ, నళినీకాంత్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు షేక్‌ సలీం, తాడేపల్లి కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు దర్శనపు శ్యామ్యూల్‌ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img