Friday, May 31, 2024
Friday, May 31, 2024

మోదీ మైండ్‌గేమ్‌ రాజకీయాలు

. ఇండియా కూటమితోనే రాజ్యాంగ పరిరక్షణ
. అవినీతిపరుడు జగన్‌ ను అరెస్టు చేయాలి
. మోదీ, చంద్రబాబు, జగన్‌ ముగ్గురూ దొంగలే
. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ

విశాలాంధ్ర-తిరుపతి : ‘‘ఓటమి భయంతోనే నరేంద్రమోదీ మైండ్‌ గేమ్‌, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. అయోధ్య రాముని వదలి… మంగళసూత్ర రాజకీయాలకు తెరదీశాడు. 400సీట్లు ఇస్తే భారత రాజ్యాంగం మార్చేందుకు మోదీ కుట్ర చేస్తున్నాడు. భారత రాజ్యాంగ పరిరక్షణ ఇండియా కూటమితోనే సాధ్యం. జగన్‌ పెద్ద అవినీతి పరుడని ప్రధానమంత్రి హోదాలో చెప్పారు. అలాంటపుడు జగన్‌ ను ఎందుకు అరెస్టు చేయలేదు? జగన్‌ ను అరెస్టయినా చేయాలి… లేదా మోదీ ఆయనకు క్షమాపణ అయినా చెప్పాలి. మోదీ, చంద్రబాబు, జగన్‌ ముగ్గురూ దొంగలే’’ అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ తీవ్రంగా విమర్శించారు. తిరుపతి నగరం బైరాగపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్‌ లో గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు దేశానికి కీలమైనవన్నారు. దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉందన్నారు. ఎంతో మంది మేధావులతో కలసి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తన మేనిఫెస్టో అమలు చేయలేదన్నారు. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలు అమలు చేయనపుడు… మన దేశంలోని ఎన్నికల వ్యవస్థకు ప్రశ్నించే అధికారం లేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిరదన్నారు. అయోధ్యలో రామాలయం పూర్తి కాకుండానే ప్రారంభించడం రాజకీయాల్లో భాగమేనని నారాయణ అన్నారు. అయోధ్య కాపాడలేదనే ఉద్దేశంతో మోదీ గ్యారంటీ అనే నినాదం తెచ్చారన్నారు. అది కూడా పని చేయకపోవడంతో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మోదీ మంగళసూత్రం రాజకీయాలు తెరమీదకు తెస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇండియా కూటమి గెలిస్తే ముస్లింలు హిందువుల ఇళ్లకు వెళ్లి మంగళసూత్రాలు తెంచుతారంటూ నరేంద్రమోదీ ప్రచారం చేయడం మతాల మధ్య విద్వేషం పెంచడమేనన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రధానమంత్రే రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా మాట్లాడటం బాధాకరమన్నారు. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో నియంతలా వ్యవహరించడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని నారాయణ పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలనే ఆశయంతో 26 పార్టీలు కలసి ఇండియా కూటమి ఏర్పాటు చేశామన్నారు. ఇక మోదీ, చంద్రబాబు, జగన్‌ కలసి అమరావతి ప్రాంత రైతులకు సుమారు రూ.1.50లక్షల కోట్లు నష్టం చేశారన్నారు. వీరు ముగ్గురూ దొంగలేనని ఆయన చెప్పారు. అమరావతి రైతులకు వీరు ముగ్గురూ క్షమాపణ చెప్పాలని నారాయణ డిమాండు చేశారు. మోదీ, చంద్రబాబు, జగన్‌ కలసి ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారన్నారు. మూడు రాజధానుల పేరుతో జగన్‌ ఏపీ ప్రజలను మోసం చేశాడన్నారు. ఇక జాతీయ స్థాయిలో ఇండియా కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమికి 150సీట్లు కూడా రావన్నారు. ఇండియా కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుపతి నుంచి ఇండియా కూటమి బలపర్చిన సీపీఐ అభ్యర్థి మురళిని ఎమ్మెల్యేగా… కాంగ్రెస్‌ అభ్యర్ధి చింతామోహన్‌ ను ఎంపీగా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక భూ హక్కు చట్టంతో రైతులకు అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల పాసుపుస్తకాలపై జగన్‌ ఫోటో ఎందుకు ముద్రించారని ప్రశ్నించారు. చెల్లని పాస్‌ పుస్తకాలు రైతులకు ఇచ్చి సీఎం ఫోటోను ప్రచారం చేసుకోవడానికా అని ఆయన నిలదీశారు. ధరణి వల్ల కేసీఆర్‌ ఓడిపోయాడని… భూ హక్కు చట్టంతో జగన్‌మోహన్‌ రెడ్డి ఓటమి ఖాయమన్నారు. జగన్‌ బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగి ఐదేళ్లు అవుతున్నప్పటికీ చర్యలు లేవన్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి బాబాయ్‌ హత్య నిందితులను గుర్తించలేదన్నారు. ఇంట్లో దొంగలను పెట్టుకుని ఆరోపణలతోనే సరిపెడుతున్నారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కమిషను సైతం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదన్నారు. విచ్చలవిడిగా డబ్బు రవాణా, పంపిణీ అవుతున్నా ఈసీ చర్యలు తీసుకోక పోవడం బాధాకరమన్నారు. ఇక నగరిలో మంత్రి రోజాను ఓడిరచాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి రోజా ప్రధాన అనుచర వర్గం అంతా రోజాను విడిచి వెళ్లారన్నారు. నగరిలో మంత్రి రోజా ఏకాకి అయిందని నారాయణ చెప్పారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఇండియా కూటమికి ప్రజలందరూ అండగా నిలవాలని నారాయణ కోరారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు, తిరుపతి నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img