Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌

కాంగ్రెస్‌కు ఓటేస్తే దేశ విభజన తథ్యం
ఎన్డీఏ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు

విశాలాంధ్రకలికిరి/గుర్రంకొండ: రాయలసీమ అనేక మంది ముఖ్యమంత్రులను ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిరినగిరిపల్లి సమీపాన బుధవారం ఎన్డీఏ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన వైఎస్సార్సీపీ, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. వైసీపీ పేదల వికాసం కోసం కాదు, మాఫియా వికాసం కోసం పని చేసిందని దుయ్యబట్టారు. నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందన్నారు. ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయిందని పేర్కొన్నారు.తాము మళ్లీ అధికారం చేపట్టాక వచ్చాక అన్ని మాఫియాలకూ పక్కా ట్రీట్‌మెంట్‌ తప్పదని హెచ్చరించారు. అనేక ఖనిజాలు, దేవాలయాలు కలిగిన నేల రాయలసీమ అని… చైతన్యవంతులైన యువత ఉన్న ప్రాంతమని వెల్లడిరచారు. ఆంధ్రప్రదేశ్‌ వికాసం మోదీ లక్ష్యం, ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలని మోదీ తెలుగులో చెప్పారు. నంద్యాల – ఎర్రగుంట్ల రైల్వే లైను పూర్తయిందని, కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. దక్షిణాదిలోనూ బుల్లెట్‌ రైలు నడుపుతామన్నారు. రాయలసీమలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. టమాటా నిల్వ చేసేందుకు గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి బుల్లెట్‌ రైలు కావాలా? వద్దా? అని ప్రశ్నించిన మోదీ అభివృద్ధి కావాలంటే ఎన్డీఏకు ఓటువేయాని పిలుపునిచ్చారు. ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదని, యువతకు ఉద్యోగాలు లేవు, రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. కేంద్ర పథకం జల్‌జీవన్‌ మిషన్‌కు వైసీపీ ప్రభుత్వ సహకారం అందలేదని వెల్లడిరచారు. ఈ రాష్ట్రంలో రౌడీయుజం రాజ్యమేలుతోందని ఇలాంటి మాఫియా కు వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించడంలో జగన్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఆదరిస్తే తాగునీరు సాగునీరు అందిస్తామన్నారు. ఇక దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆర్టికల్‌ 370ను మళ్లీ తెస్తుందని సీఏఏను రద్దు చేస్తుందన్నారు. అయోధ్య రామమందిర్‌కు తాళం వేస్తుందని, ఉచిత బియ్యం పథకాన్ని రద్దు చేస్తుందని, కాంగ్రెస్‌ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని మోదీ ఆరోపించారు.
అధికారం కోసం దేశాన్ని విభజించేందుకు కూడా కాంగ్రెస్‌ సిద్ధపడుతుందన్నారు. భారత్‌.. విభిన్న జాతుల సమూహం అని చెబుతోంది కానీ తెల్లవాళ్లు, నల్లవాళ్లు అనే ఆలోచనతో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలను దేశ ప్రజలు తిప్పి కొట్టాలని, దక్షిణాది ఉత్తరాది గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పెద్దలు సంస్కృతి హీనులుగా మారతారన్నారు. అనంతరం రాజంపేట బీజేపీ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు నాగబాబు, టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి, అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేశ్‌, తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌, కాళహస్తి టీడీపీ అభ్యర్థి సుధీర్‌ రెడ్డి, పుంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లా బాబు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img